” నిశా గంధము!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 121

కొన్నాళ్ళ క్రితం ఒక ” నిశాగంధము” అనే కవిత గురించి ప్రస్తావించాను. “ఉత్సవ్” సినిమాలోని ఒక పాటలో ” నిశి గంధ” అనే పదం మనసుకి పట్టేసి, పుట్టిన ఆ కవిత దాశరథి కృష్ణమాచార్య అధ్యక్షతలో  హైదారాబాద్ లోని ఆంధ్ర సారస్వత పరిషత్తులో చదివినప్పుడు దాశరథి ప్రత్యేకంగా అభినందించిన విషయం అప్పుడు ప్రస్తావించగా కొంతమంది మిత్రులు ఆ కవితను అందించమని అడిగారు. కానీ, ఏదీ సరిగా భద్రపరచుకోని నా బద్ధకం, నిర్లక్ష్యం వల్ల దానిని వెతికి తీయటానికి ఇన్ని రోజులు పట్టింది. అందుకోండి…

” నిశాగంధము!”

ఈ నిశాగంధ లహరుల నెన్ని యామ/ ములను గడపి నాడనొ సఖీ! పొంగి పొరలు/ దుఃఖ సుఖ వేదనల తోడ దూర దూర/ తీరముల నున్న నిను చూచు తీరు లేక!

మల్లె పూవుల వానలు మదిని తడిపి/ నట్లు కొన్ని నిశలు; కొన్ని యలవి కాని/ విరహ సంభరిత నిశలు; వేయి విధము/ లగును యీ నిశా పరిమళ లహరులెపుడు!

వాన కురిసిన వెనుకన వచ్చు వేకు/ వ తొలి వెలుగుల పత్రాగ్ర వర్ష బిందు/ ప్రతిఫలిత కాంతి యుతములు రాగ భరిత/  నిశలు కొన్ని నా బ్రతుకున నిలచి పోయె!

చుక్క నేనియు తురుమున చెక్కు కొనక/ గాఢ తిమిరాంధకార వికార కార/ ణములు కొన్ని నిశలు జీవనమ్ము నందు/ కలవు నాకు, వాని కతన కలను నేను!

ఈ నిశాగంధ లహరులె యింత కాల/ ము నను జీవింప జేసెను ముగ్ధ వైన/  నిన్ను తలపున నిలుపుచు నిత్య దీప్తి/ వాని కంజలింతము రమ్ము పవలు రేలు!


Leave a comment