“శ్రీగురు ప్రసాదం కాక మరేమిటి?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 122

” నో ” చెప్పటం రాలేదు!

ఆ ఒక్కటీ చేతకాక ఇరుక్కుపోయిన సంఘటనలు ఒకటా? రెండా? ఎన్నో!

ఎదుటి మనిషిని అంచనా వేయటం కూడా రాలేదు ఎప్పటికో కానీ!

తెలుసు… ఆ మనిషి “సీదా” కాదు… ” తేడా ” అని! అయినా ” నో ” చెప్పటం రాలేదు!

పెద్దవాళ్ళు అనేవాళ్ళు ” ఎదుటి వాణ్ణి దాటించాలి అంటే ముందు నువ్వు దాటాలి” అని! వినలేదు! “వాడు అవసరంలో ఉన్నాడు. అది తీరాలి” అంతే! అదొక్కటే యోచన. బహుశః మా తాత వేంకట రంగాచార్యులు గారి నుంచి వచ్చిన “జెనెటిక్ డిజార్డర్” ఏమో! నా తాహతుకు మించి వెళ్లి, ఎక్కడెక్కడో తెచ్చి, వాడి అవసరం తీర్చి, భారీ మూల్యాలు చెల్లించుకున్న సందర్భాలు ఎన్నని లేవు? చేతులు కాలాక చేసేది ఏముంటుంది కనుక? ఆ బరువు మోస్తూ ఎప్పటికైనా దింపుకోవడం కాక?

బయటివాళ్ళు మాత్రమేనా? లోపలివాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు అందరూ అదే త్రోవ! అయినా నాది ఇదే త్రోవ! బుద్ధి, జ్ఞానం అనే మాటలు ప్రక్కకుపోయి, ఎప్పటికప్పుడు బురదలో దిగబడిపోయి, ప్రాణాంతక స్థితులు వచ్చి, ఎలాగో… ఏమో… శ్రీ గురు కృపా కటాక్షాలు తోడుగానే కదా… బయట పడింది!

ఆస్తులు వదలుకొన్నా, అనుబంధాలు వదలుకోలేక, ఆ అనుబంధాల పద్మవ్యూహంలో చిక్కుకొనిపోయి, పడిన అవమానాలు ఎన్నని? అయినా, “నేను బాగానే ఉన్నాను కదా! వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు” అనుకుంటూ ఎప్పుడు అడిగితే అప్పుడు నిలబడి, ” అది నా బాధ్యత. వాళ్ళు నన్ను ఎలా చూస్తే ఏమి? నా కర్తవ్యం నేను చేయాలి. అంతే!” అనుకుంటూ ఇంకా ఇంకా లోకువై పోలేదూ? ఇంత జీవితం గడచిపోయాక ఇప్పుడు కదూ “బుద్ధి” వచ్చింది!

“అనుబంధాలు” అనేవి నిజంగా “బంధాలు” మాత్రమే అని తెలియటానికి ఇలాటి ” నిప్పుల తూర” లో నుంచి నడచి రావాలా?

చాలా ఏళ్లపాటు సుఖమూ, దుఃఖమూ రెండూ మనసుని కమ్ముకొని పోయేవి. ఒకటి మబ్బుల్లో తేల్చేస్తే, మరొకటి పాతాళంలోకి నెట్టేసేది. క్రమంగా తగిలిన అవమాన ఘాతాలు, మోసిన పరోపకార భారాలు, సుఖాన్నీ – దుఃఖాన్నీ కూడా కడిగిపారేశాయి! ఏవీ మనసుకు తాకకుండా పోయాయి! విశ్వనాథ వారు అన్నట్టు ఇంక ” యాదృచ్ఛా ప్రాప్త భోగంబె!” ఆయనలా నేను “మనస్సన్యాసిని” కాకపోయినా! ఇప్పుడు ” సుఖాలకు పొంగి పోవటమూ లేదు… దుఃఖానికి కృంగి పోవటమూ లేదు!” అసలు నిజానికి ఇప్పుడు “దుఃఖం” అంటూ ఒకటి ఉంటే కదా కృంగి పోవటానికి? శ్రీ గురు చరణ సంస్మరణ సుఖం తప్ప వేరే ఏముంది కనుక ఇప్పుడు?

నేను, నా భార్య, ఒక్కడే కొడుకు… మా మానాన మేము బ్రతికి ఉంటే ఇలా వుండే వాళ్ళమా? ఇద్దరం ఇద్దరమే! పక్కవాడి బరువు మోయటానికి ఎప్పటికప్పుడు సిద్ధమే! అదే కదూ కొన్నేళ్ల క్రితం వరకూ మా బ్రతుకు? “మేం పట్టించుకొంటున్నామా? మీరు మాత్రం ఎందుకు క్రిందా మీదా పడిపోతున్నారు?” అని ఎంతమంది సలహాలు ఇవ్వలేదు? విన్నామా? అవును… ఇద్దరికి ఇద్దరమే!

అన్నీ దాటి వచ్చేసినట్టే అనిపిస్తుంది! దాటామా? అలాగే అనిపిస్తోంది! నిజమే… దాటడం వేరు, దాటినట్టు అనిపించటం వేరు… తెలుసు. అయినా దాటినట్టు అనిపించటం అంటూ మొదలైతే దాటడం ఎంతసేపు?

నేను దాటానా? ఇన్ని అనుభవాలు నా “స్వయంకృతాలా?” ” స్వయం ప్రతిభా సంజనితాలా?” కానే కాదు…

ఈ స్థితికి తీసుకురావటానికి క్రమంగా నా గురుదేవులు బోధించిన “పాఠాలు” గానే స్వీకరిస్తున్నాను!

మా మాష్టారు శరభయ్య గారు తన “శ్రీ వేణుగోపాల శతకం” లో ఆ స్వామిని ఉద్దేశించి ఒక మాట అన్నారు… “నన్ను సరిదిద్దటానికి మృదువైన నీ మందహాసమో, నీ చేతి చెర్నాకోల అయినా సరే…” అని.

అలాగే ఈ అనుభవాలు అన్నీ శ్రీగురు దేవుల ఆనందప్రద మందహాసమో, చురుకుమని చరచే కొరడాదెబ్బనో… ఏదైతేనేమి? అన్నీ శ్రీగురు ప్రసాదమే కదా?!


Leave a comment