” మౌనం పరమౌషధం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 123

అప్పుడప్పుడు “మౌనం”గా వుండి పోవాలి. తప్పదు. మనిషి మనస్సుకి మౌనం ఒక “డిటర్జెంట్”.

కానీ…

మౌనం సాధ్యమా మనిషికి? కొంతమంది మౌనవ్రతం చేస్తూంటారు… ఒక పలక, బలపం లేదా ఒక పుస్తకం, పెన్నూ ప్రక్కన పెట్టుకొని! వాళ్ళకి ఏమి కావలసినా వాటి మీద వ్రాసి చూపిస్తూవుంటారు, ఎవరైనా ఏదైనా అడిగినా అదే పద్ధతి. అంటే మాటలో మౌనమే కానీ మనసులో మౌనం లేదు. అయినా ఇది మొదటి మెట్టు! కాదనలేము!

నిజంగా మౌనం అంటే మాట కన్నా ముందుగా మనసు మూగబోవాలి. ఆ తరువాతనే మాట.

మనసు మూగబోవటం సాధ్యమా? కాదు కదా? అందుకని ముందు మాటను కట్టేయాలి. ఆ తరువాత మనసును అదుపు చేసే ప్రయత్నం మాత్రం చేయకూడదు! ఎలా, ఎన్ని రకాలుగా పరుగులు పెడుతుందో పెట్టనివ్వాలి!

మాటను కట్టేసి మనసును వదిలేస్తే మనం అంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది! అసహ్యమూ కలుగవచ్చు!

మన మనస్సులో ఇంత “చెత్త” పేరుకుపోయి ఉందా? ఇన్ని నీచమైన ఆలోచనలు ఉన్నాయా? ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, కోరికలు మొలకలు వేస్తున్నాయా? పోకూడని దారులలో చేయకూడని పనుల ప్రణాళికలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయా?

మనం ఏమిటో మనకు తెలియాలి అంటే మాటను కట్టేసి కూర్చోవాలి. మనసును ” పిచ్చికుక్క” లా పరుగులు పెట్టడానికి వదలివేయాలి. అప్పుడు తెలుస్తుంది… మనం సమాజంలో మనని మనం ఎలా “ప్రదర్శించుకుంటున్నాం? నిజంగా మనం ఎవరము?” తేలిపోతుంది.

లోలోపల అణచిపెట్టుకొన్న సమస్త వ్యాధులూ బయట పడతాయి. పడనివ్వాలి.

కబీర్ అంటాడు… చేతిలో జపమాల తిరుగుతోంది, నాలుక మంత్రాన్ని జపిస్తూనే ఉంది, ఏదో గుహలో బాసింపట్టు వేసుకొని కూర్చున్నాం, కానీ మనసు మాత్రం దశదిశలా పరుగులు పెడుతోంది… ” యేతో సుమిరన్ నాహీ!”

మాటను కట్టేసి కూర్చున్నప్పుడు వచ్చే ప్రతి ఆలోచన బయటకు పోవటానికి వస్తుంది. కొన్నాళ్ళ పాటు ఈ మౌనాన్ని “అభ్యాసం” చేస్తే మనసులో పేరుకుపోయిన అన్నీ బయటకు వచ్చేసి, కొన్నాళ్ళకు లోపల ఏమీ మిగలదు!

షరతులు వర్తిస్తాయి మరి…

ఈ ” మౌనాభ్యాస” కాలంలో వర్తమానానికి సంబంధించిన “చెత్త”ను మళ్ళీ క్రొత్తగా ప్రోగు చేసుకోకూడదు!

కష్టం… ఈ రోజుల్లో మాటను కట్టేసుకుని కూర్చోవటం సాధ్యం కాదు కదా? తెల్లారి లేస్తే మాటతోనే కదా పని! ఎలా?  ఒక్క గంట కూడా మాట లేకుండా ఉండలేం. ఎలా?

నేను కొన్నేళ్ళు హైదారాబాద్ లోని నల్లకుంటలో ఉన్నాను. మా ఇంటి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ప్రహారీ గోడ ఒక ప్రత్యేకం. అంటే అదేదో గొప్ప కళాఖండం అని కాదు. ఆ ఇంటి ఔట్ హౌస్ లో ఒక రజక కుటుంబం ఉండేది. పొద్దున్న నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఇంటాయన ఆ గోడ మీద ఎక్కి కూర్చునేవాడు కాళ్ళు చాచుకొని, ఒక మూలకు ఆనుకొని! ఇంటి వ్యవహారాలు అన్నీ అతగాడి భార్య చక్కబెట్టేది… ఇస్త్రీ పనులతో సహా. ఆ వ్యక్తి అలా మధ్యాహ్నం దాకా అలాగే “కుడ్య సింహాసనం” మీద “ఆసీనుడ”య్యే ఉండేవాడు. భార్య పిలిస్తే భోజనం చేసి, మళ్ళీ గోడ ఎక్కేసి సాయంత్రం వరకూ, సాయంత్రం చాయ్ త్రాగి మళ్ళీ గోడ, రాత్రి భోజనం తరువాత మళ్ళీ గోడ… అలా ఉదయం ఆరు గంటలకు గోడ ఎక్కిన మనిషి మధ్యలో భోజనం, చాయ్, భోజనం టైములో తప్ప మిగిలిన రోజంతా మళ్ళీ నిద్ర పోయేవరకూ అదే గోడ మీద, అదే భంగిమలో ఉండేవాడు! ఒక్క వాన పడితే తప్ప, ఎంత ఎండలో అయినా సరే అతగాడి “నిష్ఠ” చెదిరి పోయేది కాదు!

ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇది నిజం! అలా ఎలా కూర్చున్నాడు? అంతసేపు ఏమీ చేయకుండా నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగేవాడు? అలా నిశ్చలంగా, నిశ్శబ్దంగా కూర్చున్న అతని మనసులో ఏమి తిరిగేది? తెలియదు! కానీ ఒకటి అర్థం అయింది…

ఒక మనిషి జీవితావసరాలు తీర్చుకొనే సమయం తప్పిస్తే నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉండగలడు!

ఒక్క రోజు ఒక్క గంట మాట్లాడకుండా ఉండగలిగితే చాలు! ( సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి సుమా!) అలా క్రమంగా ఆ సమయాన్ని పెంచుకుంటూ చివరకి ఒక రోజంతా ఉండగలం!

ఆ “రజక యోగి”ని ఆదర్శంగా పెట్టుకొని, ప్రయత్నించాను! సాధ్యమే అని అర్థం అయింది! అయితే దానిని నేను కొనసాగించలేదు!

అయితే అప్పట్లో చేసిన ఆ “మౌన సాధన” కారణంగా రోజులో ఎక్కువసేపు మౌనంగా ఉండటం అలవాటు అయింది! అవసరం అయితే తప్ప మాట్లాడకుండా ఉండటం అలవాటు అయింది!

ట్రై చేసి చూడండి! ఆ ఆనందం మీకూ అనుభవంలోకి వస్తుంది!


Leave a comment