” ఆ జ్వాల ఆరేది కాదు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 124

మనం ఒక వస్తువుని లేదా మనిషిని చూస్తాం. “బాగుందే/బాగున్నాడే” అనుకుంటాం.

మళ్ళీ చూస్తాం… ” బాగుంది/ బాగున్నాడు” అని ఒక అభిప్రాయానికి వస్తాం.

మళ్ళీ చూస్తాం… ” నాకు దొరికితే బావుణ్ణు!” అనుకుంటాం.

అప్పటి నుంచీ మళ్ళీ మళ్ళీ చూస్తాం… ” నాకు కావాలి!” అనే కోరిక పుడుతుంది.

ఇక మళ్ళీ మళ్ళీ మళ్ళీ చూస్తూ చూస్తూ ” ఇది లేకపోతే బ్రతకలేను” అనే నిశ్చయం ఏర్పడుతుంది.

ఇక అప్పటి నుంచీ దానిని “సొంతం” చేసుకోవాలనే ఆలోచన రగులుతూ ఉంటుంది. సాధించటానికి ఏం చేయడానికైనా సిద్ధపడి పోతాం!

ఈ “జ్వాల” ఆరేది కాదు. కోరుకొన్న వాడినో , కోరుకొన్న దానినో దేనినో ఒక దానిని నిలువునా దహించి వేస్తూ ఉంటూనే ఉంటుంది!

జీవితంలో మనం అందరమూ ఈ “జ్వాలాకుండం”లో మనల్ని మనం దహించుకొన్న వాళ్ళమే… పైకి చెప్పము, ఒప్పుకోము కానీ!

బ్రతుకు గడుస్తున్న కొద్దీ ఆ “జ్వాల”కు “నివురు” కప్పుతుంది కానీ ఎప్పటికీ అది ” నివురు కప్పిన నిప్పు” లాగే ఉంటుంది! అదీ మనం ఒప్పుకోము!

ప్రేమ? కోరిక? ఇది ఏది?

“ప్రేమ” అనుకొన్నది జస్ట్ “కోరిక” అని తేలిపోతే? బ్రతుకు “బూడిదే!”

“కోరిక” అనుకొన్నది ” ప్రేమ” అని తేలితే? బ్రతుకు “అమృతమే!”

ఈ రెండిటికీ తేడా అప్పుడు తెలియదు!

“దూకితేనే కానీ లోతు తెలియదు”… కదా?

ఇవన్నీ మనం అందరం దాటి వచ్చినవే! ఒప్పుకోము కదూ?

జీవితంలో ప్రతి దశలోనూ ఇలాటి ఏదో ఒక “జ్వాల” ఎదురవుతూనే ఉంటుంది కూడా!

సరిగ్గా అక్కడే ఈ జీవి…

“మనిషా?”

“పశువా?”

అనేది తేలిపోతుంది.

మనలో ప్రతి ఒక్కరికీ ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎదురు పడలేదూ… ఏదో ఒక సందర్భంలో! కాదంటారా?

మనిషి అయితే ఆ ప్రేమ లేదా కోరికను “స్నేహం”గా పరిణమింప చేసుకొంటాడు! ” అనుబంధం” గా బ్రతికించుకొంటాడు.

దానిలో…

ఏ “కోరిక” ఉండదు!

ఏ “స్వార్థము” ఉండదు!

అది ఒక “జీవ నది!”

నది తన నీరు తాను త్రాగదు కదా!? తన తీరానికి చేరిన వారందరికీ “జీవన దానం” చేస్తుంది!

ఆ “ప్రేమ” ఒక వస్తువుకో లేదా మనిషికో పరిమితం కాదు. తన పరిధులను విస్తరించుకొంటుంది. విశ్వవ్యాప్తం అవుతుంది.

అలా విశ్వవ్యాప్తమైన “ప్రేమ” ఈ లోకానికి ఆధారం!

అప్పుడు కూడా ఆ “జ్వాల ఆరేది కాదు!”


Leave a comment