స్వీయ అన్వేషణ – 125
మనిషి జీవితంలో ఎందరో తారసపడతారు. బంధువులు, మిత్రులు, పరిచయస్థులు, యథాలాప సమాగమాలు… ఇలా ఎన్నో, ఎన్నెన్నో రకాల వ్యక్తులు తారసపడతారు.
నువ్వు కనుక ఒక ” కుర్చీ” లో ఉంటే… నీతో పని ఉన్నవాళ్లు ఎంతోమంది కలుస్తారు. ఆ ” కుర్చీ” చుట్టూ నీతో పని చేసేవాళ్ళ ఉంటారు. ఇలా ఎందరో…
నేను ఆంధ్రపత్రిక డైలీ, ఆంధ్రప్రభ వీక్లీలలో పని చేస్తున్నప్పుడు ఎందరో కలిసేవారు. కథా రచయితలు (?), కవులు (?), సాహిత్య విమర్శకులు (?), వ్యాస కర్తలు… ఇలా… ఎందరో.
అక్కడ ” క్వశ్చన్ మార్క్” ఎందుకో మీకూ తెలుసు కనుక అక్కడితో వదిలేస్తాను.
వచ్చిన ప్రతివారూ వారి ” రచనలు” ఇచ్చేవారు… ” ఆత్మీయులు”, “స్నేహితులు”, ” సాహితీ ప్రియులు”, ” సోదర సమానులు”, “గురువర్యులు” వంటి విశేషణాలతో నా పేరు వ్రాసి, సంతకం పెట్టి మరీ ఇచ్చేవారు!
కొంతమంది తమ రచనలను ఇచ్చి “సర్! మీరే సమీక్ష చేయాలి!” అని కోరేవారు!
ఇలా నన్ను కలసిన వారు అందరి దగ్గరా నా ఫోన్ నంబర్స్ … ఆఫీస్ నంబర్, ఇంటి నంబర్… రెండూ ఉన్నాయి.
నాకు తెలుసు! చాలా బాగా తెలుసు! అదంతా నేను కూర్చొన్న ” కుర్చీ” మాహాత్మ్యం మాత్రమే! నాకు ఖచ్చితంగా ఆ విషయం తెలుసు!
నేను పత్రికా రంగం నుంచి తప్పుకొన్నది ఆంధ్రప్రభ వీక్లీతో. ఆ తరువాత మిత్రుడు వివేకానందంతో కలసి ” ప్రవాహ వాణి” సాహిత్య మాసపత్రిక మొదలు పెట్టడానికి కొంత కాలం పట్టింది. బహుశః నాకు గుర్తున్నంత వరకూ నాలుగైదు నెలల వ్యవధి ఉంది.
ఆ నాలుగైదు నెలల కాలంలో ఒక్క రచయిత, కవి, విమర్శకుడు, వ్యాస కర్త… ఒక్కరికీ నేను గుర్తు లేను!
తరువాత ” ప్రవాహ వాణి” మొదలు పెట్టాక మొత్తం అందరూ మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే ” టచ్” లోకి వచ్చేశారు! మళ్ళీ వాళ్ళ ” రచనలు” అనేవి ” ఆత్మీయ సంతకా”లతో వచ్చేశాయి. ” ప్రవాహ వాణి” లో ప్రచురణకు కూడా ” ఉదారం”గా రచనలు పంపారు అడక్కుండానే!
మధ్యలో నాలుగైదు నెలలు నేను ఏ ” కుర్చీ”లోనూ లేనుగా?! “కుర్చీ”లో లేని “నేను” లేనట్టే! మళ్ళీ “కుర్చీ”లోకి రాగానే వాళ్ళు నాకు “పునర్జన్మ”ను అనుగ్రహించారు!
కనుక… నువ్వా? కుర్చీనా? అంటే చాలా మందికి “కుర్చీ”యే కనిపిస్తుంది… “నువ్వు” కాదు!
అయితే… అందరూ అలా కాదు… దానికి ఉదాహరణ “భక్తి టీవీ” సిబ్బంది! ఎప్పటి ఉద్యోగం అది! ఏళ్ళకు ఏళ్ళు గడచిపోయాయి! అయినా ఇప్పటికీ నిజంగా “ఆత్మీయం”గా పలకరించే ఆ “పిల్లలు” నా జీవితంలో “మధుర స్మృతులు”! అవును… వాళ్ళు “పిల్లలే!” నాకన్నా దాదాపు అందరూ వయసులో చిన్నవాళ్ళే! అందుకని “పిల్లలు” అనటం లేదు… పసి పిల్లల మనసుల వలె స్వచ్ఛ ప్రేమాభిమానాలు నింపుకొని నాకు ఇప్పటికీ పంచిపెడుతున్నారు! ఆ “పిల్లల”కు “కుర్చీ”తో సంబంధం లేదు! “మనిషి”తో “అనుబంధం” మాత్రమే ఉంది! నేను సంపాదించుకొన్న “అమూల్య సంపద” అది! వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నా కన్నా చిన్న వాళ్ళు కనుక మనః పూర్వక ఆశీస్సులు!
So, ” కుర్చీ” ఖాళీ చేసి చూడాలి! జీవితంలో ఎవరు నీవాళ్ళు, ఎవరు కాదు అనేది “ఏలినాటి శని” చూపిస్తుంది అంటారు! ” కుర్చీ” కూడా అలాంటిదే! ఖాళీ చేసి చూస్తే తెలుస్తుంది!
Leave a comment