“ఆ రాత్రి ఆమె మనసు ?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 126

నాకు కాస్త “జ్ఞానం” ( అంటే కొద్దిగానైనా ఆలోచించే వయసు, కాస్త పుస్తకాలు చదివే అలవాటు) వచ్చినప్పటి నుంచీ రెండు ప్రశ్నలు తొలిచేస్తూ ఉండేవి.

వాటిలో ఒకటి… కురుక్షేత్ర మహా సంగ్రామం అయిపోయాక వృద్ధుడైన శ్రీకృష్ణుడు మళ్ళీ ఒక్కసారి బృందావనం వెళ్లి రాధా దేవిని కలిస్తే … అప్పుడు వారి మనస్సులలో భావనలు ఎలా ఉంటాయి?

రెండు… నరకాసురుడు మరణించాడు. అతడి కుమారుడు రాజు అయ్యాడు. లోకం దీపావళి జరుపుకుంటోంది. ఆ రాత్రి నరకాసురుడి భార్య మనసు ఎలా ఉంటుంది?

నాకు తెలిసిన కవులు, కథకులను అడిగాను… ఈ సబ్జెక్స్ వ్రాయండి… అని. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు! ఆ ప్రశ్నలు అలా నాలో సుడు తిరుగుతూనే ఉన్నాయి.

నేను ఆంధ్రప్రభ వీక్లీలో చేరాక ఒకసారి వాకాటి వారితో మాట్లాడుతున్నప్పుడు “దీపావళి రాత్రి నరకుని భార్య మనసు ఎలా ఉండి ఉంటుందో ఒక కథ వ్రాయండి సర్!” అని అడిగాను.

“అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది?” అని అడిగారు వాకాటి వారు.

“చాలా ఏళ్లుగా ఉంది సర్!” అన్నాను.

” అన్నేళ్ళుగా ఈ ప్రశ్న మీలో ఉంది అంటే ఆ కథ మీరే వ్రాయాలి. వ్రాయండి. దీపావళికి వేద్దాం” అన్నారు.

చాలా ఇబ్బంది పడ్డాను. ఏమీ తోచలేదు. నాలుగైదు రోజులు “నరక” యాతన పడ్డాను. చివరికి ఒకరోజు నిద్ర లేస్తూనే “దారి” దొరికింది! అలా పుట్టిన కథ ఈ

“వందే జగద్గురుమ్!” మీ కోసం..

*వందే జగద్గురుమ్!*

” వందనం మహారాణీ!”

మృదు గంభీరంగా వెలువడిన ఈ నిస్వనం ఆమె చెవులకు సోకలేదు. అమావాస్యా నిశీధినీ తమోగర్భంలో ముడుచుకొని పోయిన ఆంతర్యం కదలనే లేదు!

నిజమే! అది అమావాస్య!

కానీ

లోకమంతా వెలుగు ముద్దలా ఉంది!

జన మానసాలన్నీ మతాబుల్లా వెలిగిపోతున్నాయ్!

అయినా ఆమె మనోప్రపంచం గాధాంధకార బంధురంగా ఉంది. ఆ ఘోర తమస్సులో ఒక మూల చిరు దివ్వె లేకపోలేదు. అది ఆ చీకటిని చీల్చలేక పోతోంది!

ఏమయింది?

సరిగ్గా నిన్న మధ్యాహ్నం…

ఆమె భర్త మరణించాడు!

కదనరంగంలో మడమ త్రిప్పని మహావీరుడు!

ఇంద్రాదులను కలల్లో కూడా కలవర పరచిన యోధుడు!

అంతటివాడు…

నిన్న మధ్యాహ్నం…

కర్మ సాక్షి నడిమింటికి చేరిన వేళ…

తల తెగిపడి… చచ్చిపోయాడు!

అదీ ఆమె దుఃఖం… అంతేనా?

కాదు… అంత మాత్రమే కాదు…

తన భర్త మరణించినందుకు… తన ప్రాణేశ్వరుడు మరణించినందుకు… తన మనఃపతి మట్టి కలసినందుకు… ఈ సకల ప్రపంచమూ ఆనందిస్తోందే… పండుగ చేసుకొంటూ ఉందే! ఆమె కెంత దుఃఖ కారణం అది? ఆ విషాదాన్ని, ఆ అవమానాన్ని, ఆ నిరసనను ఆమె ఎలా భరించగలదు? ప్రపంచంలోని సమస్త సాగరాల ఘోష ఆమె మనోవేదనను శబ్దించగలదా? వెలుగుతున్న ఒక్కొక్క దివ్వె ఆమె మనసులో ఎంత తమోరాశిని కురిపిస్తోందో! అవును… అది ప్రాగ్జ్యోతిష పురం!

అవునామె… భగదత్తుని తల్లి!

అవునవునామె… నరకాసురుని ధర్మపత్ని!

నిన్నటి వరకూ మహారాణి! నేడు రాజమాత!

” రాజమాతకు వాసుదేవుని వందనం!”

ఇప్పుడు వినిపించిం దామెకు ఆ పలుకు! ఇప్పుడు మేలుకొన్నది ఆమె జ్ఞానేంద్రియ ప్రపంచం! తల త్రిప్పి చూసింది.

ఎదురుగా ఒక నీలాల మబ్బు తునక!

కాదు… ఒక వినీల రస మహాసాగరం!

కాదు… కాదు… ఒక ఇంద్ర నీల మణి!

కాదయ్యా… కాదు… ఒక నీలాల మబ్బు తునక, ఒక వినీల రస మహాసాగరం, ఒక ఇంద్రనీల మణి, కలసిపోయి కుప్పవోసిన ఒక మహా తేజస్సు!

ఇదేనా… ఒకనాడు గొల్ల పిల్లలతో ఆలమందలు కాచినది!

ఇదేనా… ఒకనాడు గోప యువతుల మనో ధనాన్ని కొల్లగొట్టినది!

ఇదేనా…ఇదేనా…నిన్నటికి నిన్న… తన భర్త కంఠ కృంతన కేళిలో హేలగా, ఖేలగా కదలినది!

ఆమె కన్నుల నిండా నీరు నిలిచింది!

నల్ల అవిసె పువ్వులా సుకుమారంగా, లలిత లలితంగా, మూర్తీభవత్కరుణ రసంగా నిలిచిన ఈ మహాపురుషునిలో ఎదుటివాడి తల తరిగే వజ్ర కర్కశ మానసాన్ని ఎలా పొదగ గలిగాడయ్యా ఆ విరించి!  ఆ కదన కేళిలో… ఆ సంగ్రామ రంగంలో … మిట్ట మధ్యాహ్నపుటెండలో… ఎలా నిలిచాడితను? వెంటబడి వచ్చిందటనే ఈతని మనఃప్రియ రణభూమికి? ఎంత అలసి పోయారో! ఎంత కనలిపోయారో కదా ఇద్దరూనూ?

అరె! ఏమిటిది?

భర్తను సహరించిన వాడి గురించి…

అతడు… ఎదుట పడినా…

ఇలా సాగుతోందేమిటి ఆలోచన?

నా దుఃఖం, విషాదం, అవమానం ఏమయిపోయాయి?

పరమేశ్వరీ పాద మంజీర నాద శ్రవణ సంజనితానందంలో  మునిగి పోయినట్లయిపోతోందేమి ఈ మనస్సు!?

“విధి అనుల్లంఘనీయం రాజమాతా!” అన్నాడు వాసుదేవుడు ఆసీనుడవుతూ.

ఆమె మనసులో అగ్నిధార!

” నీకూనా వాసుదేవా?”

“ఏమమ్మా? నేను మాత్రం మానవుడను కానా?”

” నీవు మానవుడవా వాసుదేవా?  అసాధ్యుడైన నా భర్తను సంహరించిన నీవు మానవుడవా?  మానవుడవే అయితే ఎదురు నిలచిన శత్రువును పరాజితుని చేసి వదలరాదా? సంహరింపక తప్పదా? అయినా… నీవే… ఆ క్రోధారుణిమను నీ వదన మండలంలో వ్యాపింప చేయకుండా… లోక సమ్మోహకమైన  మందహాసాన్ని ప్రసాదించి ఉంటే… నీ మృదు మధుర మురళీ రవళిలో ఒక చిన్న స్వరాన్ని పలికించి ఉంటే… పాదాక్రాంతుడే అయేవాడు కాదుటయ్యా ఆయన? ఎందుకింత శిక్ష విధించావు వాసుదేవా!”

ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. సప్త సాగరాలు ఉవ్వెత్తున లేచి, గగనతలంలో  మిళితమై ఒక్కసారి విరిగి పడినట్లయింది ఆమెకు!

” ఎందుకయ్యా మభ్య పెడతావు నన్ను? విధి అనుల్లంఘనీయం అంటావెందుకు?  నేనూ మానవుడనే అంటావే? ఎలా నమ్మాలి నేను? దేనిని నమ్మాలి నేను? భర్త మరణించినందుకు శోకం ఒకవైపు, కుమారుడు రాజయిన ఆనందం మరో వైపు, నా భర్త మరణానికి లోకం పండుగ చేసుకుంటున్న అవమానం  ఇంకొకవైపు… ఎక్కడున్నానయ్యా నే నిప్పుడు?”

వాసుదేవుని కన్నులలో కారుణ్య గంగా ప్రవాహం! ఆయన భృకుటిలో దివ్య మహస్సు!

” అమ్మా! నీవు కేవలం నరకుని పత్నిగా ఆలోచిస్తున్నావు! భగదత్తుని తల్లిగా స్పందిస్తున్నావు?”

ఆమె విస్మయంగా చూసింది.  అయోమయంగా చూసింది. అలా కాకుండా ఇంకెలా ఆలోచించాలి? అది కాకుండా తాను ఇంకెవరు? అసలు మరోలా ఎందుకు ఆలోచించాలి? ఆమెలో అనంతమైన  సందేహాలకు బీజం వేసిన వాసుదేవుని  వదన మండలంలో  మధుర హాసం!

” అవునమ్మా! నువ్వు నరకాసురుని ధర్మపత్నివి కాక ముందు, భగదత్తుని తల్లివి కాక ముందు ఎవరివో అలా ఆలోచించు రాజమాతా!”

” అదెలా?”

” నీ సంశయం సత్యమే తల్లీ! సంశయమే సిసలైన తెలివిడికి రాచబాట! మనిషి తన సంబంధ బాంధవ్యాల దృక్కోణం నుంచే ఆలోచిస్తాడు. తనను గురించి తానొక బొమ్మ చిత్రించుకుంటాడు. ఇతరుల గురించీ ఒక చిత్రాన్ని నిర్మించుకొంటాడు.  తన గూటిలో తాను ఉంటూ ఇతరుల గురించి తాను రూపొందించుకొన్న  భావచిత్రాల ఆధారంగా సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొంటాడు. దానిలో మనిషికి ఒక సుఖం, భద్రతా ఉన్నాయి. తన బొమ్మకు ఎలాటి దెబ్బ తగిలినా సహించలేడు. దానిని కాపాడుకోవటం కోసం తన చుట్టూ ఒక వలయాన్ని నిర్మించుకొంటాడు. అది విచ్ఛిన్నమైపోతే తన గతి ఏమైపోతుందోనని భయపడుతాడు, ఆక్రోశిస్తాడు. తన ‘ అహం ‘ చుట్టూ గీసుకొన్న గిరి దాటి బయటకు రాడు. ఆ గీతే తన అహాన్ని దెబ్బ తీస్తుందనుకొంటే  దాన్ని చెరిపేసి తన చుట్టూ మరొక వలయాన్ని గీసుకొంటారమ్మా! అలాటి వలయంలో నిలబడి ఉన్నావు నీవు! దానిని దాటి వస్తే ఆ దుఃఖమూ, భయమూ ఉండవు తల్లీ!”

” ఈ దుఃఖం ఒకనాటితో పోయేదా కృష్ణా? ఈ అవమానం, ఈ నిరసన ఎలా భరించగలనయ్యా నేను?”

” కేవలం ఆలోచనతో, ప్రశ్నించుకోవటంతో, దుఃఖ స్వరూపాన్ని తెలుసుకోవటంతో దానిని అతి క్రమించవచ్చు ననుకొంటానమ్మా!

“ఆలోచించు తల్లీ! నరకుడు రాజు. తన ప్రజల బాగోగులు చూసే బాధ్యత అతడిది. ఎవరైనా అతని రాజ్యం మీదకు దండెత్తి వస్తే తన భూమిని రక్షించుకోవటానికి, తన ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడుకోవటానికి అతడికి హక్కు ఉంది. అంతే! కానీ ఇరుగుపొరుగు రాజ్యాలను కబళించే హక్కు ఉందా?  పదహారు వేల మంది రాజకన్యలను చెరబట్టే అధికారం ఉందా? లేదు… ఎంతమాత్రమూ లేదు! అయినా ఇదంతా ఎందుకు సాగించాడు? దురాశ! తనకు ఉన్న దానితో తృప్తి పడడమ్మా మనిషి! ఇంకా ఇంకా కావాలి అతడికి…”

“రాజ్యం వీరభోజ్యం కదా వాసుదేవా?”

” అవునమ్మా! కాదన్నది ఎవడు? అది సంగ్రామం సంభవించినప్పుడు మాత్రమేనమ్మా!  మిగిలిన వేళల అది దురాశకు దారి తీస్తుందమ్మా! నేను గోపాలకుడను తల్లీ! గోవులు పచ్చని పచ్చిక పట్టులలో మేస్తూ పోతూ ఉంటాయి తల వంచుకొని. వాటి కంటి కెదురుగా ఎప్పటికప్పుడు  నవఘాసం కనిపిస్తూనే ఉంటుంది. అలా కొత్త గడ్డి కనిపించినంత మేరా అవి మేస్తూ పోతూనే ఉంటాయి. సరిగ్గా మనిషిదీ ఇదే తత్వంగా మారిపోయిందమ్మా! కావాలనుకొన్నది అందినా… మరేదో కనిపిస్తుంది కంటి కెదురుగా. దానిని అందుకొంటే మరొకటి! ఇదేనమ్మా పతనానికి హేతువు! కానీ తలెత్తి చూస్తే…మనుషులు కనిపిస్తారు. నరకుడు తల వంచని వీరుడే అయినా తలెత్తి చూడలేక పోయాడు!”

” వాసుదేవా! ఎంతటి తార్కికుడవయ్యా! గోవులు నీ వేణు గానానికి మరలి రావా?”

“అవి గోవులు కదమ్మా! వస్తాయి. కానీ, తల్లీ! సృష్టిలో ప్రతి అంశానికి ఒక నియతి ఉంది. దానినే ధర్మం అంటారు. పంచభూతాలూ దానికి కట్టుబడి ఉన్నాం. పశుపక్ష్యాదులూ దానికి కట్టుబడే ఉన్నాయి. మనిషే నమ్మా! ఆ నియతిని ఉల్లంఘించేది!

” ఇంత ఆక్రోశిస్తున్నావు కదా? నీ కుమార్తెను ఒక బలవంతుడైన రాజు అపహరిస్తే… ఆ క్షోభ ఎలాటిది? అలాటి ఆవేదన ఇతరులకూ ఉండదా? అది ఎందుకు ఆలోచించ లేదమ్మా నీవు? నరకుడు రాజు. సాటి రాజు సోదరుని వంటి వాడు కాదా? మానవులందరూ ఈ మట్టికి పుత్రులే కదా? అలాటి సోదరుని పుత్రికలు తనకు ఏమవుతారు? అలాటి యువతులను అపహరించి, బంధించి అతను తలెత్తుకొని ఎలా తిరిగాడో తెలుసా తల్లీ? అహంకారం! తనను ఎదిరించే వాడు లేడనే అహంకారం! దానిని అతడు వదలుకోక పోతే నేడు నేను కాకపోతే రేపు మరొకడు నిర్మూలిస్తాడు. అందుకే విధి అనుల్లంఘనీయం అన్నాను. ధర్మం దాని పని అది చేస్తుందమ్మా! ఎవడో దానికి పరికరం అవుతాడు!”

ఆమెలో ఏవో నీలి తెరలు జారిపోతున్నాయి. మనసులో ఆవరించిన దుఃఖం లేత ఎండకు పొగమంచులా కరగిపోతోంది. వాసుదేవుని మంద్ర కంఠధ్వని వైపు ఏకాగ్రంగా లగ్నమై పోయింది ఆమె చైతన్యం!

“ఆ పరికరం నీవే కాగల చారిత్రక అవకాశాన్ని చేజార్చుకొన్నావు రాజమాతా!” అంటూ వాసుదేవుడు నిట్టూర్చాడు.

ఆమె ఉలికి పడింది. ఆయన అన్నదేమిటో తెలియలేదు. విస్మయంగా, భీతభీతంగా చూస్తోంది ఆయన వైపు. వాసుదేవుని పెదవులపై చిరునవ్వు కనిపించలేదు. ఆయన నేత్రాలు తీక్షణంగా ఉన్నాయి. మహాయోగిలా, మహా చక్రవర్తిలా శాసిస్తోంది ఆయన రూపం. ఆ క్షణంలో ఆయన సహస్ర శీర్షునిలా ఉన్నాడు… సహస్ర పాదునిలా ఉన్నాడు. ఆమె చూపు నిలుపలేక పోతింది. వివశురాలై పోతోంది. అప్రయత్నంగా లేచి నిలబడింది.

” నీవు మహారాణివి. రాజ్యానికి రాజు తండ్రి అయితే, నీవు తల్లివి. రాజు ఎంతటి వాడో రాజ్య యంత్రాంగంలో రాణి అంతటిది. అదలా ఉంచు. నీవు స్త్రీవి. సాటి స్త్రీలను నీ భర్త చెరబడితే అదేమని ప్రశ్నించలేక పోయావు. పతివ్రత అంటే భర్త చేసే ప్రతి పనికీ తల ఊపటం కాదమ్మా! అతడి క్షేమం పట్ల నిత్య జాగరూకత వహించడమూ, దానికి భంగకరంగా అతడే ప్రవర్తించినా నిరోధించడమూను! ఆ పని నీవు చేయలేదు మహారాణీ!”

వాసుదేవుని మాటలు ఆమెకు వజ్రపాతంలా తగిలాయి. ఆమె హృదయంలో అగ్నిపర్వతం బ్రద్దలైంది. ఆ ఆరోపణ ఆమె ప్రాణాలను అపహరిస్తోంది.

“అంటే… అంటే… నా భర్త మరణానికి నేనే కారణ మంటున్నావా వాసుదేవా?”

“పరోక్షంగా కొంతవరకూ అంతేనమ్మా! వాస్తవాలు ఎప్పుడూ కఠినంగా ఉంటాయి. తాము ధర్మాన్ని ఆచరిస్తున్నామని భావిస్తారు కొందరు. కానీ వారికి ధర్మ స్వరూపం తెలుసా అని అనుమానం వస్తూ ఉంటుంది నాకు. వ్యక్తి ధర్మం, సంఘ ధర్మం సంఘర్షిస్తూ ఉంటాయి ఎప్పుడూ. వ్యక్తి తన ఆశలు, ఆశయాలు పరిపూర్తి చేసుకోవటానికి ప్రయత్నిస్తాడు. అది తప్పని ఎవరూ అనరు. కానీ సంఘ సంక్షేమానికి అవసరం అయిన నియతి ఒకటి ఉంది. దాని ముందు వ్యక్తి ఎవరైనా, ఎంతటి వాడైనా తల వంచ వలసినదే!

” నీ భర్త  మారనించినందుకు లోకమంతా పండుగ చేసుకోవడం నిస్సందేహంగా నీకు అవమానకరంగానే కనిపిస్తుంది. కానీ నీ భర్త మరణించినందుకు పండుగ చేసుకోవటం లేదు. అతడికి నీ భర్తగా గుర్తింపు లేదు లోకంలో! సాటివాడిని తనలా చూడని వాడూ, తోబుట్టువుల వంటి రాచకన్నెలను చెరబట్టిన వాడూ, అంటే నియతి తప్పిన వాడు , లోక క్షేమంకరమైన ధర్మానికి వ్యతిరిక్తంగా నడచిన వాడు నశించి పోయినందుకు లోకం ఆనందిస్తోంది!

” నీ భర్త మరణించినందుకు కాదు తల్లీ! లోకం పండుగ చేసుకొంటున్నది! ఒక దుష్ట భావానికి, ఒక దౌర్జన్య ప్రవృత్తికి, ఒక ధర్మోల్లంఘనకు ప్రతీకగా నిలిచిన వాడు నశించినందుకు ఆనందిస్తోంది! ఈ దుష్ట భావం నశించిన ఈ రోజు ఏటేటా పండుగ చేసుకుంటూనే ఉంటుంది”.

వాసుదేవుని కంఠధ్వని ఆమెలో తెలియని కవాటాలు తెరుస్తోంది. ఆమె ఆంతర్యపు లోతులలో నుంచి సన్నని కాంతికిరణపుంజం క్రమంగా విస్తరించి ఆమె చైతన్యాన్ని వినీలంగా ఆవరిస్తోంది.

” తానే లోకంగా చరించే వాడికి బ్రతికే హక్కు లేదమ్మా! లోకమంతా తానుగా ప్రవర్తించే వాడికే బ్రతికే హక్కు, బ్రతికించే భాగ్యమూ సిద్ధిస్తాయి. ఎవడు ఎలా ప్రవర్తించాలనేది ఎవడికి వాడే నిర్ణయించుకోవాలి. దాని ఫలితాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి. లోకమంతా కోరుకునేది ఒకటేనమ్మా! లోకం ‘ నరకం ‘ కాకూడదు! ఏ భార్యకూ నీకు సంభవించిన దుఃఖమూ, అవమానమూ రాకూడదు!”

ఇప్పుడామె ఎదురుగా సూర్య చంద్రులను నయనయుగళంగా రచించుకొన్న తేజోమూర్తి కనిపిస్తున్నాడు!

” వందే జగద్గురుమ్!” అంటూ వాసుదేవుని పాదాలపై వాలి పోయింది ఆమె!

తొలి దీపావళి ” భగవద్గీత”కు నాంది అయింది!

ఆయన పాదాలపై వాలిపోయిన ఆమె మరి లేవలేదు!

( ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక — 6.11.1991)


Leave a comment