” ఆ మహాశూన్యంలో…”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 127

ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో ఒక దశ వస్తుంది. ఒక రోజు, రెండు రోజులు లేదా కొన్ని రోజుల పాటు జీవితంలో స్తబ్ధత ఏర్పడిపోతుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఏదీ చూడాలని అనిపించదు. ఏదీ చదవాలని అనిపించదు. అసలు అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్లి పోవాలని అనిపిస్తుంది. అదీ ఒంటరిగా… అదీ మనం ఎవరమో ఎవరికీ తెలియని చోటికి… పూర్తిగా క్రొత్త ప్రదేశానికి…

ఆ దశలో ఏ అనుబంధమూ స్వాంతన చేకూర్చదు. ఏ స్నేహమూ ఆలంబన కాదు. ఏ అలవాటూ శాంతిని ఇవ్వదు. అది ఒక “మహా శూన్యం!”

కొందరికి ఆ శూన్యం బాధాకరం. కొందరికి ఆ శూన్యం ఒక వరం! అలాటివారికి ఆ శూన్యంలో నుంచి ఏదో ఒక దారి దొరుకుతుంది… క్రొత్త దారి… జీవితంలో క్రొత్త అధ్యాయానికి నాంది…

అలాటి శూన్య స్థితిలో “ప్రయాణం” ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.

నేను దక్షిణ దేశ యాత్రకు ఎప్పుడు వెళ్ళినా ఒక మార్గం ఏర్పాటు చేసుకొన్నాను. నాకు తమిళం రాదాయే! ఎలా? అందుకే ఆ ఏర్పాటు. దానికి తోడు మరొక కారణం త్రోవలో అన్నీ చూసుకొంటూ వెళ్ళటం.

అందుకని నా దక్షిణ దేశ యాత్రలలో మొదటి మజిలీ… తిరుపతి. తిరుమలలో శ్రీనివాసుని దర్శనం. అక్కడి నుంచి కారులో దక్షిణ దేశ క్షేత్ర దర్శనం. తమిళం బాగా వచ్చిన తెలుగు డ్రైవర్. అలా ముగ్గురు డ్రైవర్లు బాగా అలవాటు పడ్డారు. నేను హైదారాబాద్ లో బయలుదేరటానికి ముందే వారిలో ఎవరో ఒకరికి నేను చూడదలచిన క్షేత్రాల జాబితా పంపించేవాడిని. వాళ్ళు ఒక ” రూట్ మ్యాప్” సిద్ధం చేసి, దానికి అయే ఖర్చు సుమారుగా “ఇంత” అని చెప్పేవారు. అంతా సిద్ధం చేసికొని బయలుదేరే వాడిని.

అలాటి ఒక ప్రయాణం … తమిళనాడు లోని విల్లుపురం దగ్గరలో ఉన్న సాలమేడుకు. అక్కడ ” అష్ట వారాహీ ఆలయం” ఉంది. అక్కడికి వెళ్ళటానికి ముందు ఎప్పటిలాగే తిరుపతి వెళ్లి, స్వామి దర్శనం చేసుకొని, మరునాడు ఉదయం 6 గంటలకు సాలమేడుకు బయలుదేరాను. విల్లుపురం బస్ స్టాండ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళి ఎడమ వైపు తిరిగి వెడితే ఆ ఆలయం వస్తుంది. సాలమేడు ఒక గ్రామం. ఆ గ్రామం చివరకు వెళ్ళిపోతే పొలాల మధ్యలో ఉంటుంది ఆలయం. డ్రైవర్ అనిల్. అనిల్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడో ఒకచోట కార్ రివర్స్ తీసుకోవలసి వచ్చేది. ఆ గ్రామం చివరకు వస్తూ ఉండగా ” సర్! చూశారా? రివర్స్ తీసుకోకుండా వెళ్లవా ఎప్పుడూ అంటూ అంటారు కదా? చూడండి… ఎక్కడా రివర్స్ తీసుకోకుండా తీసుకొచ్చాను” అన్నాడు కించిత్ గర్వంగా.

“సరే… ఇంతకీ టెంపుల్ ఎక్కడ ఉందో అడుగు!” అన్నాను.

ఆ దార్లో వస్తున్న ఒకరిని ఆపి అడిగాడు.

అతడు ” గుడియా? ఇప్పుడే దాటి వచ్చేశారు.  ‘ రివర్స్ ‘ తీసుకొని ఒక్క పది అడుగులు వెనక్కి వెళ్లి, కుడి వైపు తిరగండి. అదే గుడి!” అన్నాడు.

నాకు నవ్వు ఆగలేదు! ‘ రివర్స్ ‘ తప్పలేదు. ” అమ్మవారు దెబ్బ కొట్టింది సర్!” అంటూ కార్ రివర్స్ చేశాడు అనిల్.

ఆలయానికి చేరుకున్నాం. పొలాల మధ్య గుడి. తాళం వేసి ఉంది. అనిల్ వెళ్లి ఎవరినో అడిగి వచ్చాడు. వాళ్ళు “పూజారికి చెబుతాం. వస్తారు” అన్నారు.

కొద్దిసేపటికి అర్చకుడు వచ్చి తాళం తీశాడు. ఆలయం అంటూ పెద్దగా ఏమీ ఉండదు. ఒక పెద్ద చతురస్రాకార వేదిక మీద వలయాకారంలో ఉన్న ఆలయం. ఆలయం ఎదుట ఒక పొడవైన శిల మీద ‘ సప్త మాతృకలు’ . ఆలయానికి ఎడమ వైపున పెద్ద హోమ కుండం. వలయాకార ప్రధాన ఆలయ కుడ్యంలో గూళ్ళ వంటి వాటిలో వివిధ వారాహీ మూర్తులు. అంతే.

అర్చకుడు ఆలయం తాళం తీసి, ద్వారాలు తెరిచాడు. లోపల నిలువెత్తు ఆది వారాహీ దేవి… ఆసీన భంగిమలో! ఆ విగ్రహాన్ని చూడగానే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది! ఆ మూర్తి భయద సమ్మోహనకరంగా ఉంది! చూస్తూ వుండిపోయాను కొద్దిసేపు. అర్చకుడు అర్చన పూర్తి చేసి ప్రసాదం ఇచ్చారు. తీసుకొని అనిల్ తో చెప్పాను. ” ఈ గోడలో విగ్రహాలు ఉన్నాయి కదా? వాటిపై తమిళంలో పేర్లు ఉన్నాయి. అవేమిటో అడుగు” అని. అనిల్ అడిగాడు… అర్చకుడు వరుసగా ఒక్కొక్కటీ చెప్పారు. కానీ రెండు విగ్రహాల పేర్లు లేవు. అవేమిటో అర్చకుడూ చెప్పలేక పోయారు. తరువాత అర్చకుడు గుడిలో ఏవో పనులు చేసుకుంటూ అంటే నేను ఒకచోట కూర్చున్నాను.

మనకి మంత్ర శాస్త్రం లో అయిదు వారాహీ మూర్తులు ఉన్నాయి. వారాహీ పంచకం అని అయిదు మంత్రాలు ఉన్నాయి. కానీ, దక్షిణ దేశంలో మరో మూడు వారాహీ రూపాలతో కలిపి అష్ట వారాహీ అర్చన సంప్రదాయం ఉంది. ఆ మూడు రూపాలు, వాటికి సంబంధించిన మంత్ర విధానాలూ మనకి అందుబాటులో లేవు, వారు మనకి చెప్పరు. అక్కడ కొద్దిసేపు కూర్చొన్నాను జపం చేసుకొంటూ.

తిరుగు ప్రయాణం మొదలైంది. ఈ యాత్రలలో ఎప్పుడూ నేను కార్ లో ఏ సీ ఆపు చేయమని చెప్పను. అది అనిల్ కి బాగా తెలుసు. కార్ బయలు దేరిన వెంటనే అనిల్ తో ఏసీ ఆపు చేయమని చెప్పాను. అనిల్ ఆశ్చర్యపోయాడు. ఏమీ మాట్లాడకుండా ఆపేశాడు. నాకు ఒళ్ళంతా ఒణుకుతోంది. తిరుపతి చేరాక కూడా తగ్గలేదు. రాత్రికి బాగా జ్వరం. 

మరునాడు పౌర్ణమి… మధ్యాహ్నం దాదాపు 2 గంటల వరకూ ఉంది. ఆలోగా చెన్నై లోని ” త్రి శక్తి ఆలయాలు” మూడూ దర్శించాలని సంకల్పం. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మూడూ మూడు మూలల్లో ఉంటాయి. ఉదయం 5 గంటలకు బయలుదేరితే కానీ పౌర్ణమి వెళ్ళిపోయే లోగా ఆ మూడు ఆలయాలు చూడలేము.

నేనున్న లాడ్జి వాడు ఉదయం ఏడు గంటలకు కానీ వేడి నీళ్లు ఇవ్వడు. అయిదు గంటలకు బయలుదేరాలి అంటే చన్నీటి స్నానం తప్పదు. ఒకప్రక్క ఒళ్ళు స్వాధీనంలో లేదు. క్రిందికి వెళ్లి టాబ్లెట్ తెచ్చుకున్నాను. కానీ వేసుకోవాలని అనిపించ లేదు. అలాగే పడుకున్నాను. ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేసరికి ఏమీ లేదు… నార్మల్! ఆ చన్నీటిలోనే స్నానం చేసి బయలుదేరి మరునాటి త్రిశక్తి ఆలయ దర్శనం పూర్తి చేసుకొన్నాను.

ఒక క్షేత్రంలో అలాటి అనుభవం కలగటం అదే మొదటిసారి నాకు. కేవలం ఒక అరగంట జపం అష్ట వారాహీ ఆలయంలో! బయటకు వచ్చేసరికి అంత ఒణుకు! రోజంతా జ్వరం! ఏ కారణం లేకుండా!

కొన్ని క్షేత్రాలలో అతి తీవ్రమైన ” శక్తి తరంగ వలయం” ఉంటుంది. సాధారణంగా దర్శనం చేసికొని వచ్చేస్తే పెద్దగా ప్రభావం ఉండదు. కానీ, ఆ ” శక్తి తరంగ వలయం” లోనికి ప్రవేశించి, అక్కడ కూర్చొని, మీరు ఏదైనా జపం చేశారు అంటే మాత్రం ఆ శక్తి తరంగాల ప్రభావం పడక తప్పదు. ఆ శక్తి తరంగాలు ఆ జపం చేసే వారిలోకి ప్రవేశిస్తాయి. అయితే ఆ వ్యక్తి సాధనలోని “స్థాయి”ని బట్టి ఆ తరంగాలను అతడు స్వీకరించగలడా? లేదా? అనేది తెలుసుకోవాలి.

తట్టుకొనే “సాధన బలం” ఉంటే సరే సరి! ఆ స్థాయి సరిపోక పోతే ఆ ” శక్తి తరంగ తీవ్రత” ఆ వ్యక్తి శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఒళ్ళు ఒణుకు పుట్టడం, జ్వరం కమ్మేయడం వంటివి అందువల్లనే కలుగుతాయి. ఆ శక్తి తరంగ తీవ్రత శరీరంలో కలసి పోయే వరకూ అవి తప్పవు. ఇలాటి అనుభవాలు నాకు ఒకసారి “కన్నాయిరం శివ” ఆలయంలో, మరొకసారి తిరుచానూరు ” శ్రీ పద్మావతీ ఆలయం”లో, శ్రీపెరంబుదూరు లోని “శ్రీ ఆదికేశవ పెరుమాళ్” ఆలయంలో భగవద్రామానుజుల సన్నిధిలో కూడా కలిగాయి! అవన్నీ ఆయా దైవాల అనుగ్రహ విశేషంగా భావిస్తాను.

ఒకానొక “మహా శూన్య దశ” లో అలాటి అనుభవాలు కలగటానికి అవసరం అయిన ” భూమిక” ను ప్రసాదించిన నా గురుదేవుల అపార కృపా కటాక్షాలు కదా వీటికి మూల కారణం!

” శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!”


Leave a comment