” వేదాంతం ఎవరికి?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 128

” వేదాంతం ఎవరికి?”

అవును! ఇదే అసలైన ప్రశ్న! ఈ ప్రశ్నకు సమాధానం లభించకుండా మనం ఏదీ సాధించలేము! అదేవిటి?

తరతరాలుగా మన గురువులు, ఆచార్యులు బోధించిన వేదాంతం ఎవరికి అనే ప్రశ్న ఏమిటి అసంబద్ధంగా? అనుకోవచ్చు. కానీ ఈ ప్రశ్న వేసుకోవలసిన అవసరం వచ్చింది!

“ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము”, ” మనిషి మోక్ష సాధనలో నిమగ్నుడు కావాలి, అదే చరమ లక్ష్యం”, ” లౌకిక ప్రయోజనాల వెంట పడితే శాంతి లేదు, రాదు”, ” కోరికలు దుఃఖ హేతువులు”… ఇలా యుగయుగాలుగా మన సమాజంలో ఎన్నో బోధలు వింటూనే ఉన్నాం.

అంతేనా? ఇంకేమీ లేదా?

మన సిద్ధాంతంలో ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి నాలుగు పురుషార్థాలు అని అందరికీ తెలిసిన విషయమే కదా! వీటిలో చివరిదైన “మోక్షం” అనే దాని మీద మాత్రమే “వేదాంత శాస్త్రం” తన దృష్టిని అంతా పెట్టింది. మిగిలిన మూడూ “వ్యర్థం” అని నిర్ధారించింది.

అదే నిజం అయితే ఆ ” ఒక్కటే” పురుషార్థం అని చెప్పేస్తే సరిపోయేది. మిగిలిన మూడూ ఎందుకు చెప్పారు?

“మనుష్యులు అందరూ ఒక్కటే” అనే దాని కన్నా “అర్ధరహితం” అయిన ” ప్రకటన” మరొకటి లేదు అన్నది నా అభిప్రాయం! “మనుష్యులు అందరూ ఒకటే” కాదు!

అసలు నిజానికి ఏ ఒక్క మనిషీ ఎప్పటికీ ఒకడే కాదు! ప్రతి మనిషీ వివిధ సందర్భాలలో వేరు వేరు “మనుష్యులు!”

అలా “అనేక స్వరూపాలలో ఉన్న ఒకే మనిషి” కేవలం ” మోక్షం” లక్ష్యంగా బ్రతకటం సాధ్యం అయే విషయం అసలే కాదు!

రేపేవిటి? అనే ప్రశ్న ఎదురవుతున్న మనిషికి వేదాంతం ఎక్కుతుందా? ఆత్మానాత్మ వివేకం రుచిస్తుందా? అసలు దానిపైన దృష్టి నిలవటం సంగతి అలా ఉంచి, అసలు ఆ స్పృహ ఉంటుందా?

మోక్షమే తప్ప ఇంకేమీ లేకపోతే “గృహస్థ” ఆశ్రమం ఎందుకు? “బ్రహ్మచర్యం” ఒక్కటే చాలుగా… నేరుగా మోక్ష సాధనలో నిమగ్నం అయిపోవచ్చు!

అలా కాదు… “బ్రహ్మచర్యం” అంటే “బ్రహ్మము నందు చరించుట”… అది ఏ ఆశ్రమంలో అయినా చేయవచ్చు అంటారా? “గృహస్థుగా ఉంటూనే బ్రహ్మము నందు దృష్టి నిలుపవలె” అంటారా? ఎలా? మనిషి ఎదురుగా ఉన్నది ” రేపు ఏవిటి?” అనే ప్రశ్న! ఇంక బ్రహ్మము నందు దృష్టి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న వేధిస్తోందే?

అసలు మన దేవీదేవతల స్వరూపాలు చూశారా? ” చూశారా?” అంటే కంటితో చూశారా అని కాదు. ఆలయాలలో విగ్రహాలు చూశారు కదా? ఇంకా కొంతమంది కాస్త పూజలూ గట్రా అలవాటు అయినవాళ్ళు దేవీదేవతల ధ్యాన శ్లోకాలు చదివారు కదా? ఏ ఒక్క దేవతామూర్తి అయినా గుడిలో కానీ, ధ్యాన శ్లోకంలో కానీ ఎలా ఉంటుంది/ ఉంటాడు? యవ్వనంతో మెరిసిపోతూ… సమస్త ఆభరణాలతో… పుష్పాలంకారంతో వెలిగిపోతూ వుండరూ? ఇంకా కొన్ని మూర్తులు ఆయుధ ధారులై ఉండవూ? వనవాసి అయిన శ్రీరాముడిని చూస్తామా గుడిలో… వైభవోపేతుడైన శ్రీరామచంద్ర మహాప్రభువును తప్ప?

ఏమి చెబుతున్నాయి ఈ మూర్తులు?  జీవన వైభవాన్ని ప్రదర్శించటం లేదూ?

” సంసార త్యాగం మోక్ష హేతువు” అన్న వాళ్ళే ” ఇంట గెలిచి రచ్చ గెలవాలి” అన్నారు. ” కల్పాంతం వరకూ బ్రతికే ఉంటాను అన్న భావనతో సంపాదించు! మరుక్షణం మరణిస్తాను అన్న భావనతో ధర్మ కార్యాలు చేయి!” అనలేదూ పూర్వులు?

ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే వాటిలో చరమ పురుషార్ధం మోక్షమును సాధించుకోవడానికి మొదటి మూడూ సక్రమంగా ఆచరించాలి కదా? పుణ్యం సంపాదించినా మోక్షం లేదు! పాపం మూట గట్టుకొన్నా మోక్షం లేదు! ఈ రెండూ ” న్యూట్రల్” అయిపోతేనే మోక్షం! కదా?

” మనిషి” సర్వతోముఖంగా జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపితే లభించేది మోక్షమే! దానికి సంసారాన్ని వదలి వేయ వలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు! “సంసారం” అంటే ” కుటుంబం” మాత్రమే కాదు… “లౌకిక ప్రపంచం” కూడా. దేనినీ త్యజించి పోవలసిన అవసరం లేదు!

” రేపు ఏవిటీ?” అని కొట్టుకొని పోయే ” మనిషి” కి ముందుగా ఆ ” రేపు” అనేది భద్రంగా ఉండాలి. ఆ మనిషి ఆకలి తీరాలి, ఆ మనిషి లౌకిక అవసరాలు తీరాలి, ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ఆ మనిషి కుటుంబం సుఖ శాంతులతో జీవించాలి… అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, ఎవరికీ దుఃఖం కలుగకూడదు…అని కదా అన్నారు. ముందు ఇది కదా సాధించాలి? దీనికోసం పాటుపడే మనిషి మళ్ళీ ప్రత్యేకంగా ” మోక్ష సాధన” చేయవలసిన అవసరం లేదు!

కొందరు ” ప్రవచనకారులు” చెప్పే మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతోంది. ” ఉపనిషత్తులు చదువుకోండి”, ” పరబ్రహ్మం మీద దృష్టి నిలపండి” అని ఓహ్! ఊరికే ప్రసంగాలు చేసేస్తూ వున్నారు. వీరికి ఈ ” జ్ఞాన బుగ్గ” ఎప్పుడు వెలిగింది? ఒకానొక సమయంలో చేతిలో రూపాయి లేక శ్రీమహాలక్ష్మి ఫోటో ముందు నిలబడి ఏడుస్తూ “అమ్మా! నీ దయామృతాన్ని నాపై వర్షించు!” అంటూ గోల పెట్టిన “బ్రహ్మ వేత్త”లే కాదూ వీరు? ఇప్పుడు మనల్ని ఉపనిషత్తులు చదువుకోమని సెలవిస్తున్నారు!

నీ ధర్మాన్ని నువ్వు చెయ్! ధర్మ బద్ధంగా ధన సంపాదన చెయ్! ధర్మ బద్ధంగా కోరికలను తీర్చుకో! “మోక్షం” నీ ఇంటి గడప ముందు నిలబడి నీ చేయి పట్టుకొని కూడా తీసుకువెడుతుంది!

” మనిషి” లోకంతో పోరాటం చేస్తున్న కాలం ఇది!

కడుపు నిండిన వాడు ఎన్నైనా చెబుతాడు!

ఇప్పుడు చెప్పండి… ” వేదాంతం ఎవరికి?”

ఈ ప్రశ్న కరెక్టే కదా?


Leave a comment