స్వీయ అన్వేషణ – 129
మనం అందరం ఈ లోకంలో బ్రతుకుతున్నాము. ఈ లోకం అంతా మనిషి “అనుభవించటానికి” అని కొందరు అంటారు. ఈ లోకం “అశాశ్వతం” అని మరికొందరు అంటారు. అలా అనుభవించాలని అనుకొన్న వాడు లోకం కంటే ముందే పోతున్నాడు. అశాశ్వతం అన్నవాడూ శాశ్వతమో, అశాశ్వతమో తెలుసుకోకుండానే పోతున్నాడు. కనుక వీటిలో ఏది నిజమో ఇద్దరికీ తెలియదు! కదా?
ఇంతకీ ఈ “లోకం” ఎందుకు ఉంది? అందులో మనం ఎందుకు ఉన్నాం? ఇప్పుడు నేను వ్రాయబోయేది “సిల్లీ” గా ఉండవచ్చు, “క్రొత్తగా నువ్వు చెప్పింది ఏముంది? మా టైమ్ వేస్ట్!” అనుకోనూ వచ్చు.
నిజానికి ఈ లోకం ఒక శిక్షా స్థలి! ఒక పరీక్షా కేంద్రం!
ఒకడు ఒక కుటుంబంలో పుడతాడు. దానిలో వాడి ” ఛాయిస్” ఏమీ లేదు! “ఆ కుటుంబంలో పుట్టాలని వ్రాసి ఉంది” వంటి సిద్ధాంతాలు కాస్సేపు ప్రక్కన పెట్టేద్దాం. అలా చూసినా అందులోనూ వాడి ఛాయిస్ లేదు. ఆ కుటుంబ నేపథ్యంలోనే పెరుగుతాడు. అవే కట్టుబాట్లు, సంప్రదాయాలు, నడవడిక రీతులు, ”మత” సిద్ధాంతాలు నేర్చుకుంటాడు. అక్కడి నుంచే “కండిషనింగ్” మొదలై పోతుంది.
కొన్నేళ్ల తరువాత చదువుకోవటానికి ఏదో స్కూల్ కి వెడతాడు. వీడిలాగే వివిధ నేపథ్యాలలో పెరిగిన వాళ్ళు కలుస్తారు. చిన్నతనం కనుక తేడాలు తెలియవు… స్నేహం ఒక్కటే ఉంటుంది. ఇంటి నుండి తెచ్చుకొన్న ” కండిషనింగ్” కొద్దిగా తెలిసీ తెలియకుండా సడలుతుంది.
కొంత పెద్దవాడు అవుతాడు. కాలేజ్ లెవెల్ కి వస్తాడు. వాడి “లోకం” మరి కొంత విస్తరిస్తుంది. మరిన్ని క్రొత్త సంగతులు వస్తాయి. ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాలు, వాటిలో తేడాలు పరిచయం అవుతాయి. క్రమంగా “కుటుంబ నేపథ్యం” లో నేర్చుకొన్న వాటి నుంచి ” సామాజిక నేపథ్యం” లో తెలిసిన వాటి వైపు మరలుతూ ఉంటాడు. ఇంటి ” కండిషనింగ్” చాలా వరకూ వదలి పోతుంది.
ఉద్యోగంలో చేరుతాడు. వాడి “లోకం” ఇంకా విస్తరిస్తుంది. ఉద్యోగం, ఎదుగుదల, దానిలో అడ్డంకులు – రాజకీయాలూ, ఎత్తులు – పై ఎత్తులు నేర్చుకుంటాడు. పై వాడిని ప్రసన్నం చేసుకొనే “విద్య” పరిచయం అవుతుంది. ప్రక్కవాడిని తొక్కేసే “విద్య” కూడా పరిచయం అవుతుంది. చదువుకొనే రోజులలో పెద్దగా పట్టించుకోని ” కులం” శాసిస్తుంది. ” వేర్పాటు” మొదలు అవుతుంది. ఇంటి ” కండిషనింగ్” దాదాపుగా మరుగున పడుతుంది.
పెళ్లి చేసుకొంటాడు. ఒక్కసారిగా వాడి ” లోకం” మారుతుంది. మళ్ళీ ఇల్లు! కుటుంబం! రెండు నేపథ్యాల నుండి వచ్చిన ఒక ఆడ, ఒక మొగ కలసి బ్రతకాలి! ఇద్దరి ఇళ్లలో “కండిషనింగ్” వేరు వేరు! అక్కడ మొదటి రోజుల ” మోహం”లో అన్నీ సర్దుబాట్లే! కుటుంబ నేపథ్యాలు, వాటిలో వీళ్ళు పొందిన “కండిషనింగ్” ఏవీ ఉండవు.
కొంతకాలం గడుస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి, అవసరాలూ పెరుగుతాయి. వాటి వేడికి కొద్ది కొద్దిగా ” తొలి మోహం” మంచు తెరలా కరుగుతూ పోతుంది. మళ్ళీ పాత “లోకం” బ్రతుకులోకి ప్రవేశిస్తుంది!
అలా వయసు పెరుగుతున్న కొద్దీ “లోకం” నిన్ను చూసే తీరూ, నువ్వు లోకాన్ని చూసే తీరూ మారిపోతూ ఉంటాయి!
అంటే… నువ్వూ, లోకమూ ఎప్పుడూ ఒకేలాగా లేరు! కాదు… కాదు… “లోకం” ఎప్పుడూ ఒకేలా ఉంది! “లోకం” అందరినీ, అన్నిటినీ ఒకేలా చూస్తోంది! నువ్వు లోకాన్ని చూసే విధానమే మారుతోంది!
ఇంతకీ ఈ ” సోది” అంతా ఎందుకు? అంటే…
ఈ లోకం ఒక శిక్షా స్థలి! ఈ లోకం ఒక పరీక్షా కేంద్రం!
నిన్ను ” నిన్ను” గా నిలబెట్టే “శిక్షా స్థలి!” నువ్వు ” నువ్వు” గా నిలబడ్డావా, లేదా అని చూసే “పరీక్షా కేంద్రం!”
ఇంతకీ… ఈ లోకం ఎందుకు ఉంది?.
నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉంది!
తెలుసుకొంటావా? లేదా? అది నీ ఇష్టం!
మళ్ళీ… ఇంతకీ… “నువ్వు” ఎవరు?
అన్నిటికీ అతీతంగా నువ్వు
“మనిషి” వి!
Leave a comment