” మూడే ప్రశ్నలు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 130

మనిషి జీవితంలో మూడు ప్రశ్నలు ప్రధానం. ఆ మూడు ప్రశ్నలే మనిషి జీవితానికి మార్గదర్శకాలు. ఏవిటా ప్రశ్నలు…

నేను ఎవరు?

నేను ఇక్కడి దాకా ఎలా వచ్చాను?

అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను?

ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు వెతకటం మాత్రమే మనిషి జీవితానికి ఒక దారి చూపిస్తుంది.

అయితే ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇదే వరుసలో సమాధానాలు వెతికితే ఎప్పటికీ లభించవు సరి కదా… అయోమయంలో పడిపోతాం. మరి ఎలా?

ముందుగా రెండవ ప్రశ్న… ” నేను ఇక్కడి దాకా ఎలా వచ్చాను?”

ఇదీ మొదట వేసుకోవలసిన ప్రశ్న… అంతే కాదు ప్రతి మనిషీ ప్రతి రోజూ… కాకపోయినా ఏడాదికి ఒకసారి… అదీ తన పుట్టిన రోజున వేసుకోవలసిన ప్రశ్న!

ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం కోసం అప్పటి దాకా గడిపిన జీవితం అంతా నెమరు వేసుకోవలసి వస్తుంది కదా? అలా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? ప్రతి సంఘటనలో, ప్రతి సందర్భంలో మనం ఎలా స్పందించామో తెలుస్తుంది. ఆ స్పందన లోని గుణ దోషాలు అర్థం అవుతాయి. అప్పుడు మనని మనం సవరించుకొనే అవకాశం వస్తుంది. అలా సవరించుకోవటానికి కావలసినది “సంకల్పం” మాత్రమే.

అలా సంకల్ప బలంతో దోషాలను సవరించుకో గలిగితే అప్పుడు మూడవ ప్రశ్న… “నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను?” అనే దానికి సమాధానం లభిస్తుంది!

ఇది మన జీవితానికి సంబంధించిన రెండవ పెద్ద ప్రశ్న. అసలు మనిషి జీవితం ఎలా గడుస్తోంది? పోటీ తోనా? పరస్పర సహకారంతోనా?

పోటీ అనేది ఆటవిక సూత్రం! అదేమిటి అలా అంటావ్? పోటీ లేకపోతే పురోగతి లేదు కదా? అనవచ్చు. పోటీలో ఏమి జరుగుతుంది? ఒకడు నెగ్గుతాడు, ఒకడు ఓడిపోతాడు. కదా?ఓడిపోయిన వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా? నిన్ను ఎలా క్రింద పడేయాలి? నీ మీద ఎలా నెగ్గాలి? అనే నిరంతర “చింత” తో ఉంటాడు. అలాగే నెగ్గిన వాడు కూడా తన స్థానాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎలా నిలబెట్టుకోవాలి? ఇంకా పై మెట్టు మీదకి ఎలా వెళ్ళాలి ? అనే నిరంతర ” చింత” తో ఉంటాడు. స్వరూపం వేరైనా ఇద్దరికీ కామన్ ఏమిటి? “చింత!” మనసుకు “చితి” పేర్చే “చింత”! ఇద్దరికీ సుఖం లేదు!

ఈ పోటీ ఎందుకు ఈ వికృత స్వరూపం ధరించింది? ప్రాచీన కాలంలో పోటీ లేదా? ఉంది కదా? “స్పర్ధయా వర్ధతే విద్యా” అన్నారు కదా? అలాగే అన్ని రంగాలలో “వృద్ధి”కి “స్పర్ధ”యే కదా మూలం? మరి పోటీ “ఆటవిక సూత్రం” అని ఎలా అంటావ్? అని అడగవచ్చు. ఒకప్పటి “స్పర్ధ”కి, ఇప్పటి “పోటీ” కీ చాలా తేడా ఉంది. లేదంటారా?

ఒకప్పటి “స్పర్ధ” లో ప్రక్కవాడిని తొక్కేయడం లేదు! తాను “ఎదగటం” మాత్రమే ఉంది! ఒకప్పటి “స్పర్ధ”లో ” వెన్నుపోటు” లేదు! తనంత తాను శిఖరాలు అధిరోహించడం మాత్రమే ఉంది!

ఇప్పటి ” పోటీ”కి మూలం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ? నా ఆలోచన మీ ముందు ఉంచుతాను. మీరూ ఆలోచించండి.

ఒక పర్యావరణంలో ఒకానొక వాతావరణ పరిస్థితులలో జంతువుల సృష్టి, పునః సృష్టి, వినాశం అనే వాటికి సంబంధించి ఒక సిద్ధాంతం వెలుగు చూసింది… అదే “Survival of the fittest”. ఆ పర్యావరణంలో ఆ ప్రత్యేక వాతావరణాన్ని సమర్థంగా ఎదుర్కొని నిలబడ గలిగిన జీవి మాత్రమే బ్రతికి ఉండగలదు.

” జంతు ప్రపంచా”నికి సంబంధించిన ఈ సూత్రం “మానవ సమాజా”నికి అన్వయించిన క్షణమే ” పతనం” మొదలైంది.

అప్పటి వరకూ “పరస్పర సహకారం”తో అందరూ కలసి సర్వతోముఖంగా ఎదుగుతున్న సమాజంలో “వినాశం” మొదలైంది.

ఇప్పుడు రెండవ ప్రశ్నకు సమాధానం వెతకండి. “పోటీ” పడటానికి వచ్చామా? “పరస్పర సహకారం”తో అందరితో కలసి “వృద్ధి” చెందటానికి వచ్చామా?

మనం “జంతు ప్రపంచం”లో లేము కనుక ” Survival of the fittest” మనకు వర్తించదు!

ఎవరో ఇచ్చిన రాజకీయ నినాదం అనుకోకుండా కొంచెం ఓపికగా, నిష్పాక్షికంగా చూడండి… నాకు రాజకీయాలతో సంబంధం లేదు… ఏ రాజకీయ పక్షంలోనూ నేను సభ్యుడిని కాను…

“మానవ సమాజా”నికి సరిపోయే సూత్రం ఏమిటి?

” సబ్ కా సాత్ సబ్ కా వికాస్!”

ఈ మాట ఒక రాజకీయ పక్షం ” గుత్త సొత్తు” కాదు.

” సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై” అన్న ఋషి వాక్యం! అదే వాళ్ళు ” కొట్టేశారు!”

ఇప్పుడు చెప్పండి… ఎందుకు వచ్చాం ఇక్కడికి?

” తోటి వారితో కలిసి బ్రతకటానికి, వారితో కలసి ఎదగటానికి!”

అందుకే వచ్చాం ఇక్కడికి!

ఇక మూడవ ప్రశ్న మిగిలింది…


Leave a comment