” సాక్షాత్కారం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ -131

” నువ్వు నువ్వు కాదోయ్!” అన్నారు కృష్ణమూర్తిగారు ఉన్నట్టుండి.

ఆయనే మంటున్నారో అర్థం కాలేదు నాకు. అప్పుడప్పుడు ఇలాంటి గంభీర ప్రకటనో, ప్రశ్నో నా మీద విసరటం, నేను దాన్ని పట్టుకొని వెళ్ళాడి, గుంజుకుపోయి, సతమత మవుతుంటే, ఆయనే దాన్ని గాలి దెబ్బకి మబ్బుపింజల్లా విడదీసేయటమూ అలవాటే ఇద్దరికీని.

నిన్న రాత్రి భోజనం చేసి, ఉడ్ ల్యాండ్స్ వాడిచ్చిన పేము కుర్చీల్లో చల్లగాలిలో కూర్చున్నప్పుడు అన్నారాయన ” కంచికి పోదామోయ్ రేప్పొద్దున్నే”. మద్రాసు వచ్చిన పని ఎలాగూ అయిపోయింది కదా అని సరేనన్నాను.  పొద్దున్నే మొదటి బస్సు ఎక్కాము. వీధులింకా జనాన్ని పోసుకోలేదు. బస్సు వేగంగా పోతోంది. మా ముందు సీట్లో ఓ కొత్త జంట కువకువ లాడిపోతోంది నాకు తెలియని తమిళంలో. ఈ తమిళుల ఆడపడుచులకు అదేమి వెర్రో కానీ తల నిండా తట్టెడు పూలు పెట్టుకొంటారు. అందులోనూ వేసవి కాలం. విరజాజి పూలు కుప్పలే కుప్పలు. కిటికీ ప్రక్కనే కూర్చున్న అమ్మాయి జడ లో నుంచి గాలి దురుసుతనానికి  పువ్వులు ఒక్కొక్కటీ విడివడి విసురుగా వచ్చి నా మీద పడుతున్నాయ్! తప్పో ఒప్పో గానీ చెప్పొద్దూ నాకు సరదాగా, గమ్మత్తుగా ఉంది అలా పూలవాన కురుస్తుంటే!

సరిగ్గా అప్పుడే అన్నారు కృష్ణమూర్తి గారు ” నువ్వు నువ్వు కాదోయ్” అని. కొద్ది క్షణాల పాటు ఆయనేమన్నారో అర్థం కాలేదు. “నేను నేను కాకపోవటం ఏమిటీ?” అన్నాను పూలవానకి అడ్డం పడినందుకు కొంచెం విసుగ్గానే. ఆయనతో నా పరిచయం ఏడాదే అయినా – చిన్నప్పుడు మా తాత నా చేతిని తన కుడిచేతి వేళ్ళ మధ్య అరచేతిలో బిగించి మెరీనా బీచ్ ఇసుకలో నడిపించి వినీలాగాధ మహాసాగరాన్ని చూపించినట్టు –  లోకంలో కొత్త అంచుల్ని చూపిస్తున్నారాయన.

” ఎందుకోయ్ అంత విసుగు? అసలీ సంగతి ఆలోచించావా ఎప్పుడైనా?” మళ్ళీ ప్రశ్న.

” ఇందులో ఆలోచించడానికేముంది? నేను నేనే – రామకృష్ణని” అన్నా.

” అది నువ్వు పుట్టాక కొన్ని రోజులకి మీ అమ్మా నాన్నా పెట్టిన పేరు. ఆ పేరు పెట్టక ముందు నువ్వెవరివి?” ఆయన కళ్ళు చిలిపిగా నవ్వుతున్నాయి.

” ఇదేదో తిరకాసు వ్యవహారంలాగే ఉంది” అనుకున్నాను కానీ జవాబు దొరకలేదు.

” పోనీ! ఇప్పుడు నువ్వెవరివి?” మళ్ళీ ఏదో మెలిక పడుతోంది.

” నేను లెక్చరర్ని కదా?” అన్నాను కొంచెం అనుమానంగా.

” మరి రిటైరైన తర్వాత?” చిలిపితనంతో పాటు గడుసు పోకడ కూడా కనిపిస్తోంది ఆయన కళ్ళల్లో.

మళ్ళీ సమాధానం శూన్యం.

బస్సు ఏదో పల్లంలోకి జారుతోంది. గుండె ఉన్నట్టుండి కిందకి వెళ్ళిపోతున్న అనుభూతి క్షణం సేపు. కృష్ణమూర్తిగారి ప్రశ్న లోపల్లోపల సుడి తిరుగుతోంది.

ముందు సీట్లో అమ్మాయి తల్లో నుంచి పూలు పడుతూనే ఉన్నాయి మొహం మీదా, ఒళ్ళోనూ. బస్సు శ్రీపెరంబుదూరు చేరుతోంది. దూరంగా  రామానుజుల గోపురం కనిపిస్తోంది. బాగా చిన్నతనంలో తాత అంగవస్త్రాన్ని పంచెలా కట్టుకొని, ఆయన ప్రక్కనే నిలుచుని – రామానుజుల విగ్రహానికి అభిషేకం చేస్తూ అర్చకులు ఆలపించిన “తిరుమంజన కట్టియం” చెవుల్లో మోగుతోంది అర్థం కాకపోయినా. ఆ రోజు ఆరగించిన కదంబ ప్రసాద పరిమళం నాసాపుటాల్లో వీస్తోంది. అప్పుడు స్ఫురించింది జవాబు – ఇక దీనికి తిరుగు లేనే లేదు –

వెంటనే అన్నాను ” నేను వైష్ణవుడను!” అని.

” ఎప్పట్నుంచీ?” అన్నారాయన సాగదీస్తూ.

” ఎప్పట్నుంచేమిటీ? నేను పుట్టి న్నాట్నించీను!” అన్నాను గర్వంగా.

” అలాగే! అదృష్టవంతుడివోయ్! నేను పుట్టాక కొన్నేళ్ళకి గానీ, మా నాన్న మనం ఫలానా అని చెబితే గానీ తెలియలేదు. నువ్వు పుట్టగానే – లేదూ – పుట్టుకతోనే ‘ నేను వైష్ణవుడిని ‘ అని పుట్టావు. నీలాంటి వాళ్ళు చాలా అరుదోయ్!” అన్నారు.

పోయింది, దొరికిందనుకున్న జవాబు గోదాట్లో గడ్డిపోచలా కొట్టుకుపోయింది. తాత చెబితే కదా తెలిసింది నేను ఫలానా అని. మన బుద్ధికి అందే జవాబు కాదు. ఆయనే విప్పాలి ముడి. ఆయనే చెబుతారని మౌనంగా వుండిపోయాను. ఆయనా పలకరించలేదు చాలా సేపటి వరకూ.  చివరికి నేనే ప్రశ్నించాను.  ” అయితే ఇంతకీ నేనెవ రంటారు?” అని. నా గొంతులో పలికిన జాలికి నాకే ఆశ్చర్యం వేసింది. బహుశా బిక్కమొహం పడిపోయే ఉంటుంది నాకు తెలియకుండానే.

పువ్వులు ఎన్ని పెట్టుకుందో ఆ మహాతల్లి మొహానికొచ్చి తగిలాయి రెండు మూడు పువ్వులు. అప్పటిదాకా ఆ పూలవాన ఆనందంగానే ఉంది. కానీ ఇప్పుడు మహచిరాగ్గా అనిపించింది. కొంతసేపు ఆనందం అనిపించింది మరుక్షణం చిరాకుగా ఎందుకు అనిపిస్తుంది? మనసు ఇంకో దాని మీద లగ్నమై అది ప్రబంధకంగా తోస్తుంది కాబోలు.

” అవునోయ్! అదే కదా ప్రశ్న. ఆలోచించు. నువ్వు రామకృష్ణవి అని అమ్మా నాన్నా చెప్పారు. అవునుకున్నావ్. నువ్వు లెక్చరర్ వి అంటున్నారు. నిజమే అనుకున్నావ్. నువ్వు ఫలానా కులం వాడివి అన్నారు. సరేనన్నావ్. ఇవేవీ కాదని తేలిపోయింది. కనుక నువ్వెవరివనే ప్రశ్న నిలబడింది రాకాసిలాగ. ఆలోచించాలి కదా! పద, పద, కంచి వచ్చేసింది. మఠం దగ్గర దిగితే ఆలయాలు దగ్గర” అంటూ లేచారు కృష్ణమూర్తిగారు. బస్సు దిగి ముందు ఏకామ్రేశ్వరాలయానికి వెళ్ళాము.

ఎంత శివలింగం! ఇలాటివి  ఆంధ్రదేశంలో తక్కువ. పైగా గర్భాలయంలో తైలదీపాల మసక వెలుతురు. ఆ మసక వెలుతురులో ఏ గుహాంతర్భాగంలోనో మొలుచుకు వచ్చిన వెలుతురు స్తంభంలాగా ఎంత అందంగా ఉంది ఆ శివమూర్తి! అలా చూస్తుంటే పుష్ప దంతుడుగుర్తుకు వచ్చాడు…

” బహుల రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః। జన సుఖకృతే సత్వోద్రేకే మృడాయ నమో నమః। ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః।ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః।।”

ఆయన త్రిగుణ విరహితుడు. వెలుగుల కుప్ప. ఆ వెలుగే రజో సంసర్గం చేత విశ్వ సృష్టి సాగించినప్పుడు ” భవుడు” అని పేరు. ఆ వెలుగే సత్త్వ సంపూరితమై జనహితకరమైనప్పుడు “మృడుడు” అని పేరు. ఆ వెలుగే తమోవృతమై సంహార కార్యనిమగ్నమై నప్పుడు “హరుడు” అని పేరు.

ఏదో లీలగా స్ఫురిస్తోంది – అసలు స్వరూపం ఒకటి కాగా కార్య వృత్తులను బట్టి ఏవేవో పేర్లు వస్తున్నాయన్న మాట. ఈ పేర్లు కానిదేదో మూలాధారంగా నిలిచి ఉందన్న మాట. పక్కన ఎవరున్నారో తెలియనంత స్థల కాల స్మృతి విహీనమైన మనస్సుతో కలలో లాగ నడుస్తూ బయటకు వస్తుంటే కృష్ణమూర్తి గారన్నారు “కూచుందామా” అని. ” వద్దు! అమ్మవారిని చూద్దాం!” అని నా సమాధానం.

కామాక్షి ఆలయానికి వెళుతుంటే యుగాలు నడుస్తున్నట్లుంది. ఆలయంలోకి ప్రవేశిస్తుంటే అమ్మా ఒడిలోకి పాకుతూ వెళ్లిన అనుభూతి పచ్చగా విరుస్తోంది. అమ్మ! ఎంత అందంగా ఉంది! ఎంత భయంకరంగా ఉంది! ఎంత అభయంకరంగానూ ఉంది!

ఉన్మేష నిమిషోత్పన్న భువనాలి!

కామేశ బద్ధ మాంగల్య శోభిత కంధర!

శ్రుతి సీమంత సిందూరీకృత పాదాబ్జ ధూలిక!

నామ రూప వివర్జిత!

అవును! ఆమె నామ రూప వివర్జిత! మరి నాకెందుకు నామ రూప బద్ధ స్పృహ? అయితే మరి నేనెవరిని?

కృష్ణమూర్తి గారి వైపు చూశాను. ఆయనా నాకేసే చూస్తుస్తున్నారు పరిశీలనగా. ఆయన కళ్ళల్లో బస్సులో కనిపించిన చిలిపితనం కాదు…తీక్ష్ణత ఉంది. అదీ ప్రాభాతార్కకిరణంలా ఉంది. గుండెల్లోకి దూసుకుని పోతున్న నిశాత శరధారలా ఉంది. ఆయన కళ్ళలో నించి పూలవాన కురుస్తోంది. అది బస్సులో పూలవానలా లేదు. చందనవర్షంలా ఉంది. ఇంద్రియ ప్రపంచం చల్లగా, వెచ్చగా విచ్చుకుంటోంది.

నిత్య యోవని నాగకన్యక యుగయుగాల నిద్రలో బద్ధకంగా శరీర వలయాలను సద్దుకుని, మణి మయ ఫణమండలాన్ని ఓసారి అటూ ఇటూ కదిపి లేచిన పొదలిక –

వాడి, ఎండి, పగిలి, నెరద పెదవి మీద తొలివాన చినుకు టప్పున పడగానే ఆవిరులు లేచి, వ్యాపించిన మట్టి తావి –

సన్నగా రాజుకొని, ఊదా రంగులో మెదలి, కాషాయవర్ణం లోనికి కదిలి,  నీల వర్ణానికి తిరిగి, నాలుకలు చాచి, ఎక్కడెక్కడో ప్రాచీన ప్రాకృతిక మనో కుహారాంతరాల్లో పేరుకుపోయిన అంధకారాన్ని తాకి, తాగి, విలయంగా, లయంగా, విపరీతంగా, పరీతంగా, ఋతంగా తాండవించడానికి ఒళ్ళు విరుచుకుని లేస్తున్న మంటల జాతర –

ఎక్కడో సముద్ర గర్భాంధకారంలో – ఆ తడి నేలను చీల్చుకుని, అగ్నికీలలను ఉత్క్రమించి, వాయు పథాలను తరించి, వినీల విహాయసాన్ని తాకి, అమృత సింధువులో వెన్నెల వెలుగులో బిందువై, ఛందమై, వెలుగై, ఎలుగై, స్ఫోటమై, గాటమై, ప్రాణమై, వీణలా, వేణువులా, మర్దలనాద మహస్సులా, క్రేంకారం, ఓంకారం సాకారంగా ఎదుట నిలిచినట్లయి –

హృదయంలో ఏనాడో – యుగయుగాల నాడు ఆవిర్భవించి కంఠ గ్రంథిలో చిక్కువడి పోయి, “మ్రోగక చలించి చెరవడ్డ మూగ బాధ” చిన్నప్పుడు చదువుకున్న శ్లోకం వెతుక్కుంటూ వస్తే తడుముకుంటూ చదివినట్టు వచ్చింది –

” ధరణి మయీం తరణి మయీం పవన మయీం గగన దహన మయీం హోతృ మయీం అంబు మయీ మిందు మయీ మంబా  మనుకంప మాదిమామీక్షే!”

అవును! భూమి, సూర్యుడు, గాలి, ఆకాశం, నిప్పు, నీరు, చంద్రుడు అన్నిటినీ ఆవరించినది అమ్మ! అవన్నీ నాన్నావరించుకున్నాయి. నేన్నేమిటి? సర్వ మానవులలోనూ ఉన్నాయి. అందరిలాగే నేనూను! ఇవన్నీ కలిసి వచ్చిన ఆకారానికి పేర్లు, ఊర్లు, ఉద్యోగాలూ … అవన్నీ కాకుండా … అవును! అదే కృష్ణమూర్తి గారి ప్రశ్నకు సమాధానం! సమస్త సుఖదుఃఖాలలోనూ, సమస్త స్పందనైక్యతా స్పందంలో… నా పేరు లేదు! ఊరు లేదు! రూపం లేదు! కులం లేదు! మతం లేదు! దేశవూ లేదు! స్థల కాల పరిధులు లేవు! సమస్త ప్రపంచాన్నీ ఆవాసం చేసుకున్న సకల మానవాళి నేను! వారి సమస్త స్పందనలు నావి! ఎక్కడైనా, ఎప్పుడైనా అవన్నీ ఒకటే!

” నేను మనిషిని!” అన్నాను కృష్ణమూర్తి గారి వైపు చూస్తూ …

ఆయన చిరునవ్వులో అమ్మ కన్నుల అమృత వర్షం!

” పొద్దుట్నుంచీ చెప్పడవే మర్చిపోయాను… గుడ్ మార్నింగోయ్ రామకృష్ణా!” అన్నారాయన.

( ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, 19-25 ఆగస్టు 1992)

ఇదీ నిన్న మనం వేసుకున్న మూడవ ప్రశ్నకు జవాబు!


Leave a comment