” ఎవరి కోసం ఈ బ్రతుకు?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 132

అవును… ఎవరి కోసం ఈ బ్రతుకు? నువ్వు ఎలా బ్రతికినా నీ చుట్టుప్రక్కల ఉన్నవాళ్లు నీ గురించి “తీర్పులు” ఇస్తూనే వుంటారు. ఒకరోజు “మంచి” వాడివి అయిన నువ్వు ఇంకో రోజు “చెడ్డ” వాడివి అయిపోతావ్! ఒకరోజు నిన్ను ప్రేమించిన వాళ్ళే ఇంకో రోజు నిన్ను ద్వేషిస్తారు! ఒకరోజు నిన్ను అపారంగా గౌరవించిన వాళ్ళే ఇంకో రోజు నిన్ను దారుణంగా అవమానించడానికి ఏమాత్రం వెనుకాడరు!

మరి… ఎవరి కోసం ఈ బ్రతుకు?

నీ నుంచి ఉపకారాలు పొంది, నీ నుంచి ప్రేరణ పొంది, జీవితంలో ఒక్కొక్క మెట్టూ ఎక్కి నిలబడి, నువ్వు తప్ప మరొక ఆలంబన లేదని నీ చుట్టూ తిరిగిన వాళ్ళే నిన్ను ప్రక్కన పెట్టేయడం సంగతి అటుంచి, నీ కన్నా ” వ్యర్థుడు” మరొకడు లేడని ప్రకటించడానికి ముందుంటారు!

మరి… ఎవరి కోసం ఈ బ్రతుకు?

నీ చదువు, నీ కాలం, నీ శ్రమ, నీ సాధన, నీ ప్రేమ, నీ అభిమానం… అన్నీ పంచి పెట్టేసి, ఇప్పుడు నువ్వు ఎక్కడ నిలబడ్డావ్?

మరి… ఎవరి కోసం ఈ బ్రతుకు?

“కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ మిత్రుల కోసం, నీకు పరిచయం అయినవారి కోసం, నిన్ను ఆశ్రయించిన వారి కోసం… ఇలా ఎందరి కోసమో బ్రతికాను” అంటావా?

ఈ స్థితికి రావడానికి నువ్వు నీ బ్రతుకుతో ఎన్ని యుద్ధాలు చేసి వుంటావ్? ఎంత మందిని ఆశ్రయించి ఎన్ని నేర్చుకొని వుంటావ్? ఎన్ని వ్యతిరేక – విద్వేష సముద్రాలు ఈదుకొని వచ్చి వుంటావ్?

మరి… ఎవరి కోసం ఈ బ్రతుకు?

నీ చుట్టూ ఎంత “గుంపు” చేరింది ఇప్పటి వరకూ? ఆ ” గుంపు”లో ఎంతమంది నిన్ను వదలి పోలేదూ? నువ్వు ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు ఒక్కొక్క ” గుంపు”! ఒక్కొక్క హోదాలో ఉన్నప్పుడు ఒక్కొక్క “గుంపు”! స్థాయి మారినా, హోదా మారినా ” గుంపు” మారిపోతోంది కదా? ఆ “గుంపు”లలో ఇప్పటికీ, ఎప్పటికీ నీ ప్రక్కన నిలబడే వాడు ఒక్కరైనా ఉన్నారా?

మరి… ఎవరి కోసం ఈ బ్రతుకు?

ఎంత చదివినా ఇంకా మిగిలిపోతూనే ఉండే చదువు! ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసిన నైపుణ్యం! ఎంత సాధన చేసినా ఇంకా చేయవలసిన సాధన ఎంతో! నీ ఉద్యోగం, నీ స్థాయి, నీ పదవి, నీ బిరుదులు, నీ కీర్తి కిరీటాలు, నీ కంకణాలు, నీ గండపెండేరాలు, నీ ఆస్తులు… అన్నీ నీతోనే “ఖతమ్”! కాదా? అవన్నీ సాధించుకోవడానికి నువ్వు చేసిన కృషి, నువ్వు పడిన కష్టం… ఎవరికి తెలుసు నీకు తప్ప?

మరి… ఎవరి కోసం ఈ బ్రతుకు?

నువ్వు ఇతరుల కోసం బ్రతికినంత కాలం నువ్వు ” మహానుభావుడివి”! నీ కోసం నువ్వు బ్రతుకుదామని అనుకుంటే నువ్వు “స్వార్థపరుడివి”! ప్రక్కవాడి సలహా పాటిస్తే నువ్వు “వివేకివి”! ” బుద్ధిమంతుడివి”! నీ నిర్ణయం నువ్వు తీసుకుంటే నువ్వు “మూర్ఖుడివి”! “అహంకారివి”!

మరి… ఎవరి కోసం ఈ బ్రతుకు?

ఈ శృంఖలాలు అన్నీ తెంచేయ్! నీ కోసం నువ్వు బ్రతకడం నేర్చుకో! నీ కోసం నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచెయ్! నీ పరిమితులు నువ్వు తెలుసుకో! ఎదుటివారి పరిధులు వాళ్ళకి స్పష్టంగా చెప్పేయ్! అప్పుడే నువ్వు, నీ కుటుంబం సుఖ సంతోషాలతో బ్రతకొచ్చు! 

తెలిసింది కదా?

మరి… ఎవరి కోసం ఈ బ్రతుకు? 

నీ కోసం!!!

ఇతరులకు హాని కలిగించకుండా నీ కోసం!

ఇతరుల క్షేమం కోరుతూ నీ కోసం!


Leave a comment