స్వీయ అన్వేషణ – 133
మనిషి బాధ పడుతూనే ఉంటాడు నిరంతరం ఏదో ఒక దాని కోసం! ఆ బాధ ” మూల స్వరూపం” ఏమిటో మనిషికి తెలియదు!
లౌకికంగా చూస్తే…
చేతిలో డబ్బు లేకపోతే బాధ!
అనుకొన్న ఉద్యోగం రాకపోతే బాధ!
ఉద్యోగం అంటూ వస్తే ప్రమోషన్ / ఇంక్రిమెంట్ రాలేదని బాధ!
కోరుకొన్న అమ్మాయి/ అబ్బాయి దొరకకపోతే బాధ!
పెళ్లి చేసుకుంటే ఆ కాపురం ఎలా ఉంటుందో అనే భయంతో కూడిన బాధ!
అది సరిగా లేకపోతే సద్దుబాటు చేసుకుంటూ పోవటంలో బాధ!
అన్నీ బాగున్నా పిల్లలు కలగటం లేదని బాధ!
పిల్లలు కలిగినా ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళనతో కూడిన బాధ!
వాళ్ళ చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం బాధ!
దానికి చేసే అప్పుల వెతుకులాటలో బాధ!
చేసిన అప్పు తీర్చలేక బాధ!
ఇచ్చిన అప్పు తిరిగి రాక బాధ!
రోగాల బాధ!
ఇంకా ఈ జాబితాలోకి రాని లెక్కలేనన్ని బాధలు మీకూ తెలుసు!
ఇలా… ఎన్నెన్నో బాధలు!
వీటి అన్నిటిలో ఉన్న ” మూల సూత్రం” ఒకటి ఉంది!
ఏమిటిది?
మనిషి నిరంతరం దేని కోసమో వెతుకుతూనే ఉంటాడు. ఆ అన్వేషణలో ఎన్నో దారులలో ప్రయాణిస్తూ ఉంటాడు. కొన్ని దారులు సులువుగా ఉంటే, కొన్ని దారులు కఠినంగా ఉంటాయి. కొన్ని పూల బాటలు అయితే, మరికొన్ని ముళ్ళ బాటలు. కొన్ని రహదారులు అయితే, ఇంకొన్ని బురద బాటలు.
ఏ దారి అయినా ప్రయాణం తప్పదు బ్రతికి ఉన్నంత కాలమూను. ఆ ప్రయాణంలో నువ్వు “ఒంటరివి!”
అదేమిటి అలా అంటావ్? నా కుటుంబం ఉంది, నా స్నేహితులున్నారు, నా శ్రేయోభిలాషులు, నాకు అండగా ఎందరో ఉన్నారు… అంటావా? ఆలోచించి చూడు! ఎవరూ లేరు! నువ్వు ” ఒక్కడివే!” ఇదే నిజం!
నమ్మ శక్యం కావటం లేదు కదూ? పైన అనుకొన్న ” బాధ” లలో నీకు భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? లేరు కదా? ఆ బాధలన్నీ నీ మనసులో నువ్వే అనుభవిస్తున్నావు కదా? ఎవరితోనూ పంచుకోవటం లేదు కదా…చివరికి నీ భర్త/ భార్య తోనైనా? ఈ బాధలు ఎవరితోనైనా పంచుకుంటే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారో అని మరొక బాధ! కదా?
మనిషిని ” Social Animal” అని కొందరు అంటారు. కానీ మరికొందరు మనిషిని ” Island ” అంటారు. రెండూ నిజం కాదు! మరి ఏది నిజం? ఆ నిజం తెలుసుకునే క్రమంలోనే మనిషి ఇన్ని బాధలు పడుతున్నాడు. ఆ బాధలు అన్నిటిలోనూ ఒక ” వెతుకులాట” ఉంది. ఆ “వెతుకులాట” అంతా “సుఖం” కోసం! ఏదో ” సాధించాను” అని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం! గుర్తింపు పొందటం కోసం! నీ కుటుంబం నుంచి, నువ్వున్న సమాజం నుంచి ” గౌరవం” పొందటం కోసం ” వెతుకులాట!”
అంటే… దీనికి ” మూల కారణం” ఏమిటి? ” గుర్తింపు”. ఇక్కడే అసలు కీలకం అంతా దాక్కుని ఉంది!
ఈ “గుర్తింపు”ను నువ్వు “ఇతరుల” నుంచి కోరుకుంటున్నాం. కానీ… నువ్వు నిన్ను “గుర్తించుకోవటం” లేదు!
నిన్ను నువ్వు ” గుర్తించుకొన్న” రోజు ఏ బాధా ఉండదు! ఎందుకు అంటే… “నువ్వు” వేరు! నీ “అసలు స్వరూపం” వేరు! ఆ “స్వరూపం” నీకు తెలిస్తే చాలు! అదే “ఆనందం!” ఎప్పుడైనా “సుఖం” విరిగిపోయి “దుఃఖం” గా పరిణమిస్తుందేమో కానీ ” ఆనంద” లక్షణానికి “క్షతి” లేదు! అది “అఖండం”, “పరిపూర్ణం”, “అక్షరం”. ఆ స్వరూపాన్ని తెలుసుకొనేది ఎలా?
” శ్రీ గురు కృపా హి కేవలమ్!”
Leave a comment