స్వీయ అన్వేషణ – 137
ఆరున్నర దశాబ్దాల జీవితం తరువాత ఏదైనా అర్ధమైనట్లు అనిపించింది అంటే… అది ఇదీ…
నేను ఇక్కడికి ఏదో ” అవాలని” రాలేదు. ఇప్పటి వరకూ అయినది “ఏదో” అది వదలించుకోవటానికే వచ్చాను. ఆ ” ఏదో” గుర్తు పట్టి, దానిని వదలించుకోవటాకినికే వచ్చాను. సహస్రాధిక జన్మ పరంపరలో ప్రోగు చేసుకొన్న కర్మ ఫలాలతో పాటుగా ఆయా జన్మలలో ప్రోగు చేసికొన్న “చదువు” అనబడే దానిని అంతా వదలించుకోవటానికే వచ్చాను.
” లెర్నింగ్” అనే దానిని ” అన్ లెర్న్” చేసుకోవటానికి వచ్చాను. అయితే అది అంత సులువైన పని కాదని మాత్రం పూర్తిగా అర్థం అయింది. అది ఏదో తెలుసుకోవాలని రకరకాల శాస్త్రాలు – సిద్ధాంతాలు చదివి, అధ్యయనం చేసి, విశ్లేషించుకొని, అనుభవంలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నించి, అన్నీ సగంసగం పనులై, చివరికి ఏదీ కాని ఒకానొక “అగమ్య గోచర” స్థితికి వెళ్లిపోయిన క్షణాలు కదూ ఒక్కొక్క జన్మ!
ప్రతి జన్మలోనూ ఈ అసంపూర్ణ లక్ష్యంతో మరొక జన్మలోనికి ప్రవేశించి, అక్కడా అదే పరిస్థితి ఎదురై, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకొంటూ ఎప్పటి వరకూ ఇది?
కానీ ఎప్పటికప్పుడు “అసలు” సంగతి మరచి, “ఏదో” అవాలనే ఆరాటంలో పడిపోతూనే ఉన్నాను కదూ? అలా “ఏదో” అవాలనే ప్రయత్నంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక దెబ్బ తగిలి, ఆ మార్గం మూసుకొని పోయి, కొంత కాలం “శూన్య స్థితి”కి వెళ్లిపోవడం.
ఆ “శూన్య స్థితి”లో ఆంతరిక ప్రపంచంలోకి ప్రయాణించడానికి బదులు మరేదో అవుదామని ఇంకొక మార్గాన్ని వెతుక్కోలేదూ? అలా దారులు మార్చుకుంటూ పోవడం వల్ల ఇప్పటికే ప్రోగు చేసికొన్న “చదువు”కి మరింత చేర్చుకొంటూ పోవడమే కానీ వదలించుకొనే ప్రయత్నం చేసినది ఏదీ? లేదు కదూ? “జీవించటానికి” బదులుగా “బ్రతకటం” లో మునిగి పోయాక ఇంకేం మిగిలింది కనుక? మళ్ళీ మళ్ళీ పుట్టుక తప్ప?
సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి వచ్చి, తీరాన్ని ఆక్రమించి, విరిగి, నురగలు కక్కుతూ, వెనక్కి పోతున్నట్టు ఆలోచనలు వచ్చి పోతూ ఉంటే… ఏదో ఒక క్షణం ఆ ఆలోచనలలో “విరామం” !
ఆ “విరామం”… అదే… ఆ “విరామ”మే కాదూ కావలసినది! ఆ “విరామం” లో సహస్రాధిక జన్మ పరంపరలో ప్రోగు చేసికొన్న కర్మ ఫలాలు లేవు! ఆ జన్మ పరంపరలో ప్రోగు చేసికొన్న “చదువు” అనబడే “భారం” లేదు! శాస్త్రాలు లేవు! సిద్ధాంతాలు లేవు! సుఖం లేదు! దుఃఖం లేదు! సంబంధ బాంధవ్యాలు లేవు! అధ్యయనం లేదు! విశ్లేషణ లేదు! వాక్కు లేదు! మనసు లేదు! అసలు ఈ లోకమే లేదు! నేనూ లేను!
అదొక నిరామయ, నిర్లిప్త స్థితి! శూన్యమూ కాదు! అశూన్యమూ కాదు! అదొక “అనుభవం” మాత్రమే!
ఆ “అనుభవ క్షణం” అనే దాని వ్యవధినీ, పరిధినీ విస్తరింప చేసుకోవటమే కదూ కావలసినది! ఆ “అనుభవ క్షణం” లోనే కదూ వదలించుకో వలసినది “ఏదో” వదలిపోయేది! ఆ వ్యవధినీ, పరిధినీ విస్తరించుకొనే కొద్దీ ఆ “ఏదో” క్రమక్రమంగా పూర్తిగా వదలి పోతుంది కదా?
కానీ… ఆ “అనుభవ క్షణం” లోని రహస్యం తెలియటం లేదే! అది ఎందుకు సంభవిస్తుంది అనేదీ తెలియటం లేదే! దానిని విస్తరించుకొనే మార్గమూ తెలియటం లేదే! ఎలా?
ఎలాగో తెలిస్తే, ఆ ” అనుభవ క్షణా”న్ని విస్తరించుకోవడమే, ప్రతి క్షణం ఆ క్షణాన్నే అనుభవంలోకి తెచ్చుకోవడమే కదూ ” మోక్షం!” అంటే!
అది నా “ప్రయత్నం”తో అవుతుందా? అలా అయేదే అయితే ఇన్ని వేల జన్మలు ఎందుకు? మరి ఎలా?
ఒకటే సమాధానం… శ్రీగురు కృపా విశేషం మాత్రమే దిక్కు! కాదంటారా?
Leave a comment