స్వీయ అన్వేషణ – 138
తన విలువ తనకు తెలియనివాడే ఇతరులతో పోల్చుకుంటాడు!
తన విలువ తనకు తెలియనివాడే ఇతరుల అంతస్తుకు ఎదగాలనుకుంటాడు!
తన విలువ తనకు తెలియనివాడే ఇతరుల శక్తికి భయపడతాడు!
తన విలువ తనకు తెలియనివాడే ఇతరులకు లొంగిపోతాడు!
ఏముంది? నీలో లేనిది ఇంకొకళ్లలో ఏముంది?
నిన్ను నువ్వు ప్రేమించుకోలేక పోవడం, నిన్ను నువ్వు ఇష్టపడకపోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోలేక పోవడం, నీ కృషికి నువ్వు గర్వపడకపోవడం, నీ స్థాయితో నువ్వు సంతోషించక పోవడం, నువ్వు చేస్తున్న పనిని నువ్వు నమ్మకపోవడం… ఇవి కాదూ నీ లోపాలు?
అసంతృప్తి కదూ నిన్ను తినేస్తున్నది?
ఆవు తల వంచుకుని గడ్డి మేస్తూ పోతూ ఉంటుంది. తల వంచుకుని పోతూ గడ్డి మేస్తున్న ఆవుకు కనుచూపు మేరా గడ్డి కనిపిస్తూనే ఉంటుంది. గడ్డి కనిపించినంత మేరా మేస్తూనే పోతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట కూర్చుని అప్పటి వరకూ మేసిన గడ్డిని నెమరు వేస్తూ ఉంటుంది. ఇదే కదూ నువ్వు కూడా చేస్తున్నది?
ఇంకా… ఇంకా… ఇంకా… అంటూ పోతూనే ఉన్నావ్! అప్పటి దాకా పోయిన దూరాన్ని నెమరు వేసుకొని… మళ్ళీ ” అయ్యో! ఇంకా ఉందే?!” అంటూ మళ్ళీ మేతకు బయలు దేరుతూన్నావ్!
ఒకాయన ఉన్నాడు. ఆయనా, భార్యా ఇద్దరూ చిన్న వయసులోనే అమెరికా వెళ్లారు. అక్కడ ఉద్యోగాలు సంపాదించారు. ఆయన ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో పెద్ద పెద్ద హోదాలు సాధించాడు. భార్య కూడా ఉన్నత స్థానాలు సాధించింది. కొన్నేళ్ళు గడచిపోయాయి. లెక్క లేనంత సంపాదన.
ఒకరోజు ఇద్దరూ రాత్రి భోజనాలు అయ్యాక తీరుబడిగా కూర్చున్నారు. ఆయన మనసులో చాలా కాలంగా ఒక ఆలోచన మెదులుతూ ఉంది… కాదు… కాదు… ఆ ఆలోచన తొలుస్తూ ఉంది. ఆ రాత్రి ఆ ఆలోచనను భార్య దగ్గర బయట పెట్టాడు…
“మనం ఇంకో యాభై ఏళ్లు బ్రతుకుతాం అనుకో! ఆ యాభై ఏళ్లు ఎలాటి కష్టమూ లేకుండా, ఎలాటి లోటూ లేకుండా మనద్దరం బ్రతకటానికి ఎంత డబ్బు కావాలి?” అని అడిగాడు.
భార్య ఏమీ ఆశ్చర్యపోలేదు ఈ ప్రశ్నకు. బయటకు చెప్పలేదు కానీ ఆమె లోనూ ఇదే ఆలోచన తొలుస్తోంది.
ఇద్దరూ ప్రశాంతంగా కూర్చొని లెక్కలు వేశారు. ” ఇంత డబ్బు కావాలి!” అని లెక్కలు తేల్చారు.
“సరే! ఈ డబ్బు సంపాదించాక మనం ఉద్యోగాలు మానేసి ఇండియాకు వెళ్ళిపోదాం! అక్కడ మనకి చాలా చాలా ఇష్టమైన ఉద్యోగాలు చేసుకుందాం!” అన్నాడు.
” మీరేం చేస్తారు?” అడిగింది.
” నాకు టీచింగ్ ఇష్టం! అదే చేస్తా!” ఆయన జవాబు. ” మరి నీకు?” అని ప్రశ్నించాడు. ” చాలా ఇష్టాలున్నాయ్! అక్కడికి తిరిగి వెళ్ళాక అక్కడి పరిస్థితిని బట్టి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా!”
వాళ్లిద్దరూ వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకున్నారు ఆ రాత్రి. ఇక అప్పటి నుంచీ అదే లక్ష్యంతో పని చేశారు. ఎప్పటికప్పుడు లెక్కలు చూసుకున్నారు. వాళ్ళు అనుకొన్న రోజు వచ్చింది. అక్కడ ఉన్న ఇల్లు, కార్లు, స్థిరాస్తులు అన్నీ అమ్మేశారు. ఇండియాకి తిరిగి వచ్చేశారు.
ఆయన ఒక కాలేజ్ లో పాఠాలు చెప్పటానికి చేరాడు. (అనుకోకుండా అదే కాలేజ్ లో నా కుమారుడు చదువుకోవడం, అదీ ఆయన పాఠాలు చెప్పే తరగతుల్లో ఉండటం వాడి అదృష్టం!)
ఈ ” తెలివిడి” లేకపోవడం వల్ల కదూ…
నీ విలువ తనకు తెలియక పోవడం వల్ల ఇతరులతో పోల్చుకుంతున్నావ్!
నీ విలువ నీకు తెలియక పోవడం వల్ల ఇతరుల అంతస్తుకు ఎదగాలనుకుంతున్నావ్!
నీ విలువ నీకు తెలియక పోవడం వల్లనే ఇతరుల శక్తికి భయపడుతున్నావ్!
నీ విలువ నీకు తెలియక పోవడం వల్లనే ఇతరులకు లొంగిపోతూన్నావ్!
నీ శక్తి, నీ పరిమితి గుర్తించి నీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని పని చేస్తే నీ జీవితానికి నువ్వే హీరో!
Leave a comment