” నేలను తాకగానే…!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ -139

అప్పటి వరకూ అమ్మ ఒడి, భుజం అదే లోకం! అంతకు మించి ఏమీ తెలియదు… తెలియదు కాదు… ఇంక వేరే దేనికీ అస్తిత్వం లేదు!

ఆ బిడ్డ తొలిసారి అమ్మ ఒడి నుంచి క్రిందకి దిగింది! నేలను తాకింది! ఆ నేల మీద బోర్లా పడుకొని, మెల్లగా మెడ నిలిపి, తలెత్తి, అటూ ఇటూ పరకాయించి చూసింది! అమ్మ ఒడిని దాటి ఏదో క్రొత్తగా కనిపించింది! ఎదురుగా ఇంకేదో కనిపించింది!

దానిని అందుకోవాలనే కోరిక కలిగింది! అది “కోరిక” అని కూడా ఆ పసి మనసుకు తెలియదు! ఆ స్పందన అనంతర జీవితంలో విస్తరణకో, వినాశానికో కూడా తెలియదు!

ఎదురుగా కనిపిస్తున్న దానిని అందుకోవాలి! అంతే! శిక్షణలో సైనికుడు “క్రాలింగ్ ఎక్సర్సైజ్” చేస్తున్నట్టు బయలుదేరింది ఆ శిశువు.

ఎడమ చేయి మడచి, మోచేతి బలాన్ని ఊనిక చేసుకొని, కుడి చేయి ముందుకు చాచి, తనకున్న బలం అంతా వినియోగించి అరచేతితో నేలను అదిమి పట్టి, తన చిన్ని పసిదేహాన్ని ముందుకు జరిపింది! తరువాత కుడి మోచేయి, మళ్ళీ ఎడమ మోచేయి… అలా అలా మార్చుకుంటూ, నెమ్మది నెమ్మదిగా ముందుకు జరుగుతూ తాను “కావాలి” అనుకొన్న దానిని అందుకొంది! అందుకొన్న వెంటనే నోటి దగ్గరకు చేర్చుకొంది! ఆ మొట్టమొదటి కదలికే… తరువాతి బ్రతుకును నిర్ణయించేసింది!

పసి ఒంటితో నేల మీద బోర్లా పడుకొని, మెల్ల మెల్లగా కదులుతూ, తనకు “కావాలి” అనుకొన్న దానిని అందుకొని నోటి దగ్గరకు చేర్చుకొన్న క్షణం నుంచీ…

ఏ కదలికా లేకుండా వెల్లకిలా అదే నేల లోలోతులలోనో, కట్టెల మంటల పరుపు పైనో పడుకొనే వరకూ…

ఇదే కదా మనిషి సాగిస్తున్న ప్రయాణం!

కావాలి… అందుకోవాలి… అనుభవించాలి… అంతే!

మంచిదే! కోరిక, ఆశ లేకుండా మనిషి జీవితం ముందుకు సాగనే సాగదు! ఆ రెండే మనిషిని ఉన్నత శిఖరాలకో, అధః పాతాళ కుహరాలలోనికో నడిపిస్తాయి!

ఉన్నత శిఖరాలు అంటే… గొప్ప చదువు, పదవులు, అధికారం, హోదా, సంపదలు…ఇలా ఎన్నెన్నో! ఇవే కదా మనకి గుర్తుకు వచ్చేవి? వీటి కోసమే కదా మనం వెంపర్లాడేవి?

పాతాళ కుహరాలు అంటే… వేరే చెప్పటం ఎందుకు?

ఉన్నత శిఖరాలను అధిరోహించటం తప్పు కాదు. దానికి శ్రమ పడటం నేరం కాదు.

అయితే… ఏదైనా పొందాలి అంటే ఎంతో కొంత కొల్పోక తప్పదు కదా? ఉన్నత శిఖరాలను అధిరోహించటం నీ విజయం! కానీ ఆ విజయాన్ని సాధించే క్రమంలో నువ్వు కోల్పోతున్నవి ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఆ కోల్పోయినవి మిగిలిన బ్రతుకు మీద ఏం ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఆలోచించావా?

అలా ఆలోచించి చూసుకున్నప్పుడు నువ్వు సాధించిన విజయం గొప్పదా? నువ్వు కోల్పోయినవి గొప్పవా?

ఆ విజయం నీలోని మనిషిని ఒక్క అంగుళం పెంచిందా? నీ మనసును విస్తరించిందా? నీ ఆలోచనను సరళం చేసిందా? నీ బుద్ధిని మెత్తన చేసిందా? నీ కుటుంబం నీ సాహచర్యాన్ని పొందిందా? ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు, ఆరు నుంచి పదవ తరగతి వరకు, ఇంటర్ లో, డిగ్రీలో, ఇంకా ఆ పైన ఎంతమంది స్నేహితులను సంపాదించుకొన్నావ్? వారిలో ఎంతమంది నీకు గుర్తున్నారు? గుర్తున్న వారిలో ఎంతమందితో నువ్వు ఇప్పటికీ “టచ్” లో ఉన్నావ్?  ఇప్పటికీ, నువ్వు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ” ఏరా!”, ” ఒరేయ్!” అని పిలిచేవాళ్ళు ఎంతమంది వున్నారు?

శిశువుగా నువ్వు కదలిన మొదటి కదలిక నుంచి ఇప్పటి వరకూ నీ “విజయ పరంపర”లో నువ్వు ఏమేమి, ఎన్నెన్ని పోగొట్టుకొన్నావో అర్థం అవుతోందా?


Leave a comment