“పగిలిన అద్దం ముక్కలు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 140

ఏ మనిషి బ్రతుకైనా చెల్లాచెదురుగా పడిన అద్దం ముక్కల లోని బింబ శకలాల లాంటిదే కానీ పూర్తి అద్దం లో బొమ్మ కాదు. నాదైనా అంతే!

ఒకే మనిషి…

ఆ మనిషిలోనే ఎన్నెన్నో శకలాలు! కొన్ని లోకానికి కనిపిస్తాయి…

కొన్ని కనపడవు…

కొన్నిటిని చూడటానికి ఆ మనిషే ఇష్టపడడు!

పైకి కనిపించే వెలుగు వలువలు కప్పేసి ఎన్ని చీకట్లు దాచేస్తాడో కదా మనిషి!

మోహ వీచికలూ…

వ్యామోహ తరంగాలూ ఎక్కడో ఆగి…

విరిగి…

క్రమంగా అగ్నికుండాలుగా మారిపోయిన క్షణాలు లేవూ మనలో?

ప్రేమోద్యానవనంలో ఋతువు కాని ఋతువులో వికసించి…

ఆహ్లాదాన్ని పంచబోయి…

కుదరక…

కొమ్మకే వాడి…

వడలి…

రాలిపోయిన పూలు లేవూ మనందరి బ్రతుకులో?

ధూమవలయావృత అహస్సులు… పానీయ మాదకతా మగ్న నిశలు… లేవూ మనలో కొందరికైనా?

వాంఛాగ్ని కీలా దగ్ధ వివేక బాధ ఎన్నడూ అనుభవించలేదూ మనం?

చెప్పుకుంటామా ఇవన్నీ? దాచేసుకుంటాం కదా?

ఇవన్నీ మన బ్రతుకు అద్దం ముక్కలు కావూ?

వెనక్కి తిరిగి చూసుకునే తీరిక లేని పరుగులు పెట్టేసి…

” ఇక చాలు… పరుగులు ఆపేయ్!” అనే క్షణం వచ్చేసి…

చేసే పని లేక…

పని చేద్దామన్నా చేయలేక… నీరసించి…

పడక్కుర్చీలో వెనక్కి వాలిన రోజో…

సోఫాలో నడుము వాల్చిన రోజో …

ఇవన్నీ గుర్తుకు రావటం లేదూ?

గుర్తుకు వచ్చిన ఆ క్షణాల్లో…

ఆ రోజుల్ని తలచుకొని దుఃఖం రావటం లేదూ?

అసహ్యం వేయటం లేదూ?

అంత బుద్ధిహీనంగా ప్రవర్తించినందుకు సిగ్గు క్రమ్మేయటం లేదూ?

ఎంతమందికి క్షమాపణ చెప్పుకోవాలి?

ఎంత మందికి చేతులెత్తి మ్రొక్కాలి?

ఎంతమందికి పాదాభివందనం చేయాలి?

ఏమో?


Leave a comment