స్వీయ అన్వేషణ – 141
నువ్వు ఏమిటో ఎవరికీ తెలియదు! ఆ మాటకొస్తే నువ్వు ఏమిటో నీకే తెలియదు!
నమ్మశక్యంగా లేదు కదూ?
ఎదుటివారికి నువ్వేమిటి అనేది తెలియచేయాలి అనే ఆరాటంలో అసలు విషయం విస్మరించడం అసలు తమాషా!
ఏవిటా అసలు విషయం?
నువ్వెవరు అనేది ఇతరులకు తెలియచేయాలి అంటే అసలు నువ్వెవరు అనేది నీకు తెలియాలి కదా?
అది తెలియకపోతే గుర్తింపు కోసం నువ్వు పడే ఆరాటం అంతా నిష్ఫలం! కదా?
నీ “బలం” ఏవిటో నీకు తెలుసా?
నీ “బలహీనత” ఏవిటో నీకు తెలుసా?
నీకున్న “అవకాశం” ఏవిటో నువ్వు గుర్తించావా?
నీకున్న “అడ్డంకి” ఏవిటో నువ్వు తెలుసుకున్నావా?
ఈ విశ్లేషణ చేసుకోకుండా నువ్వేవిటో నీకు ఎలా తెలుస్తుంది?
నీకు గుర్తింపు ఎలా వస్తుంది? ఆరాటమే తప్ప నీతో నువ్వు పోరాడినది ఎప్పుడు?
బాహ్య పరిస్థితులతో ఎడతెగని పోరాటం చేసే నువ్వు నీతో నువ్వు పోరాడింది ఎప్పుడూ?
అసలు అలా నీతో నువ్వు పోరాడే ధైర్యం ఉందా?
కనీసం అలాటి ధైర్యం లేదని ఒప్పుకొనే ధైర్యం అయినా ఉందా?
నీ మనసులో ఉన్న చీకటితో నిన్ను నువ్వు కప్పేసుకుంటున్నావ్ కానీ… “వెలుగు” వైపు పయనించే ప్రయత్నం చేశావా?
అసలు “వెలుగు” అనేది ఒకటి ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నావా?
లేదు!
“వెలుగు” అంటే ఏమిటో నీకు తెలియదు!
నువ్వున్న “చీకటి” నీకు సుఖంగా ఉంది!
సౌకర్యంగా ఉంది!
నువ్వు లేకపోతే ఈ ప్రపంచం అసంపూర్ణం!
అది నీ “బలం!”
నువ్వు లేకపోతే ఈ ప్రపంచం అసంపూర్ణం అని తెలుసుకోకపోవటం…
నీ “బలహీనత!”
నువ్వు లేకపోతే ఈ ప్రపంచం అసంపూర్ణం అని నిన్ను నువ్వు నిరూపించుకోవటం…
నీ “అవకాశం!”
నువ్వు ఈ మూడు విషయాలూ గుర్తించి ముందడుగు వేయకపోవడం…
నీకు నువ్వు కల్పించుకొనే “అడ్డంకి!”
ఆ “బలహీనత”ను జయించాలి అన్నా…
ఆ “అడ్డంకి”ని దాటాలి అన్నా…
నీకు సాధ్యం కాదు!
నీ “చీకటి గుహ”లో నువ్వు సుఖంగా ఉన్నావు కనుక!
అప్పుడే…
నీకు “సహాయం” అవసరం!
ఆ “సహాయం” కోసం ఊపిరాడనంతగా నీలో తపన రేగితే…
“వెలుగు” ఒక ఆకారాన్ని ధరించి నీ ముందు నిలబడుతుంది!
చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తుంది!
ఆ చేతులలో వాలిపోయే వరకూ నువ్వు నిలువలేవు!
తీరా ఆ చేతులలో చేరితే…
అప్పటి దాకా నీలో ఉన్న నమ్మకాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి!
అప్పటి దాకా నువ్వు సుఖ సౌకర్యాలు అనుకొన్నవి అన్నీ దూరం అయిపోతాయి!
నీ ఆరాటం ” స్వరూపం” మార్చుకుంటుంది!
ఆ “వెలుగుల సన్నిధి”లోకి పరుగులు పెట్టాలనిపిస్తుంది!
ఆ సరిక్రొత్త ఆరాటం నిన్ను నిలబడ నివ్వదు!
కానీ…
ఒక్కసారి నువ్వు ఆ “వెలుగుల సన్నిధి”కి చేరావంటే…
అప్పటివరకూ ఉన్న నీ ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది!
తలక్రిందులు అయిపోతుంది!
అయినా నువ్వు ఆగలేవు!
ఆ “వెలుగుల సన్నిధి”ని చేరుకోకుండా ఆగలేవు!
ఆ “వెలుగుల సన్నిధి” పేరే “గురువు!”
అది విశ్వవ్యాప్త కాంతి చైతన్యం!
నీకోసం…
నీ మీద అవ్యాజమైన కరుణతో..
ఒక “భౌతిక స్వరూపా”న్ని ధరించి…
నీ ముందు నిలబడింది!
ఇక నీ ప్రాప్తం!
అందుకుంటావా?
ఆ చేతులలో వాలిపోవటానికి పరుగులు పెడతావా?
“అమృతఫలం” నీకు సిద్ధిస్తుంది!
లేదూ…
అదమ్యమైన కాలసర్పం నిన్ను చుట్టుకుంటుంది?
నిర్ణయం నీదే!

Leave a comment