స్వీయ అన్వేషణ – 142
అవును…
కాలం మారదు!
నిజానికి కాలంలో నిన్న, నేడు, రేపు అనేవే లేవు!
కాలం అఖండం!
నిన్న, నేడు, రేపు అనేవి మనకే కానీ కాలానికి కావు!
కాలంలో పగలు, రాత్రి కూడా లేవు!
ఒక చోట పగలు మరొక చోట రాత్రి!
అంటే పగలు, రాత్రి రెండూ ఎప్పుడూ ఉంటాయి. నువ్వుండే ప్రదేశాన్ని బట్టి అవి నీ అనుభవంలోకి వస్తాయి… అంతే!
కనుక కాలం మారదు!
ఒక సూర్యోదయం నుంచి మరొక సూర్యోదయం వరకూ ఒక రోజు అనేది మనిషి వేసుకొనే లెక్క మాత్రమే. దానిలో వెలుగు ఉన్న కాలం పగలు అనీ, వెలుగు లేని కాలం రాత్రి అనీ మనిషి వేసుకొన్న లెక్క. అంతే.
కాలంలో ఆ విభాగం నువ్వు చేసుకొన్నదే.
అసలు కాలానికి సంబంధించి మనిషి అనుభవంలో ఒక విచిత్రం ఉంది! మనిషి వేసుకొనే లెక్కలో ఇంకా విచిత్రం ఉంది!
ఒక్క సంగతి మాట్లాడుకుందాం…
మనిషి పుట్టిన రోజు జరుపుకొంటాడు కదా? సంతోషంగా జరుపుకొంటాడు కదా?
కొన్నేళ్ల వరకూ సంతోషంగా జరుపుకొన్న అదే పుట్టిన రోజు కొన్నేళ్ల తరువాత ఒక తెలియని భయాన్ని కలిగించటం లేదూ? చిన్నప్పుడు, యవ్వనంలో, దాదాపు యాభై అరవై ఏళ్ళు వచ్చేవరకూ ప్రతి పుట్టిన రోజూ సంతోషంగానే సాగుతుంది. ఒక్కసారి యాభయ్యో అరవయ్యో వచ్చాక ఒక్కొక్క పుట్టిన రోజూ భయాన్ని పెంచటం లేదూ? ఇంకెన్నాళ్ళు ఉంటామో తెలియని దిగులు క్రమ్ముకోవటం లేదూ?
మరి కాలం మారిందా? లేదు కదా?
నువ్వు వేసుకొన్న లెక్కలో ఒక్కొక్క ఏడు గడుస్తున్న కొద్దీ నీ ప్రయాణం “అడంగు”కి చేరుతుందనే ఆందోళన కలగటం లేదూ?
కాలం మారిందా!
లేదు!
నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉందో పోయేటప్పుడూ అలాగే ఉంది!
ఆ ” నిర్లిప్త కాలం”లో నీ అనుభవం మారుతోంది… అంతే!
అంటే కాలం మారిపోవటం లేదు!
ఆ అంతు లేని కాలవీధిలో నడుస్తున్న మనిషి మారిపోతున్నాడు!
కాలం మనిషి వేసికొన్న ముసుగులు అన్నిటినీ తొలగించివేస్తుంది.
నీ ప్రక్కన ఉన్న ప్రతి వాడి స్వరూపాన్ని నీకు పరిచయం చేస్తుంది.
అంటే… కాలం ఒక ” గురువు!”
అదృశ్యంగా నీ జీవితంలోనే, నీతోనే ఉంటూ, నీకు వివిధ అనుభవాలను ప్రసాదించి, సరైన మార్గంలో నడిచే అనేకానేక అవకాశాలను కల్పిస్తుంది. కానీ మనిషి ఈ అదృశ్య రూప గురువును తెలుసుకోలేడు. ఆ గురువు ఇచ్చే అవకాశాలను గుర్తించలేడు.
అందుకే మనిషి తన ఎదురుగా ఎన్ని అవకాశాలు వచ్చినా చేజార్చుకొంటాడు.
మరి…
ఏమిటి దిక్కు?
ఏమిటి గతి?
ఏమిటి తరుణోపాయం?
కాలాన్ని గుర్తించటమే దిక్కు!
కాలాన్ని నిజాయితీగా అనుసరించటమే గతి!
కాల స్వరూపాన్ని ” అనుభవం”లోకి
తెచ్చుకోవటమే తరుణోపాయం!
దానికి మార్గం ఏమిటి?
ఆ దారి మనిషికి ఎలా తెలుస్తుంది?
ఆ దారి దీపం ఏది?
ఒక్కటే మార్గం…
ఏకైక మార్గం…
“శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!”

Leave a comment