“శర్మ గారి ట్రైనింగ్!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 143

ప్రతి మనిషికీ సుఖ పరంపరల జీవితం కావాలి!

ప్రతి మనిషికీ వరుసగా విజయాలే కావాలి!

ప్రతి మనిషికీ జేబు నిండా డబ్బు ఉండాలి!

ప్రతి మనిషికీ తన చుట్టూ తనను మెచ్చుకొనే వారే కావాలి!

ప్రతి మనిషికీ తన అధికారానికి అడ్డు లేకుండా ఉండాలి!

ప్రతి మనిషికీ లోకంలో ఉన్న మంచి అంతా కావాలి!

కదా?

ఏ మనిషికీ ఒక్క కష్టం కూడా వద్దు!

ఏ మనిషికీ వైఫల్యం అనేదే వద్దు!

ఏ మనిషికీ పైసా లేని రోజే వద్దు!

ఏ మనిషికీ తనపై అధికారం చెలాయించే వాళ్ళు వద్దు!

ఏ మనిషికీ లోకంలో చెడు అనేదే వద్దు!

కదా?

నా చిన్నప్పుడు నన్ను పెంచిన మా చిన తాత వేంకట వల్లభాచార్యులు గారు ప్రతి నెలా చివరి రోజున మరుసటి నెలలో కిరాణా కొట్టు, పాలవాడు, పని మనిషి, ఒక అంచనాతో కరెంటు బిల్లు, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అనేది లెక్క కట్టి, ఒక సందుగా పెట్టె లో విడివిడిగా పెట్టేసేవాడు.

ఆ పెట్టె ఒక విచిత్రం… మూత తీయగానే బయటకి తీయటానికి వీలైన ఒక అర వుంటుంది. ఆ అరలో మధ్యలో పెద్దది, నాలుగు చిన్నవి అయిదు అరలు ఉండేవి. దానిని బయటకు తీస్తే దాని క్రింద మరొక పెద్ద అర. అదంతా ఒకటే భాగం. దాని క్రింద ఖాళీ. అన్నిటి కన్నా క్రింది అరలో ఆ నెలలో వచ్చిన అద్దెలలో ఖర్చులకు ప్రక్కన పెట్టగా ఉన్న “మిగులు ధనం”, మధ్య అరలో అవసరం అయితే మందులకు, ఆయన రెగ్యులర్ గా తెచ్చి పెట్టుకొనే స్వీట్స్ – ఖారా లకు డబ్బు, అన్నిటికన్నా పైన ఉన్న అయిదు అరలలో రబ్బరు బ్యాండ్ వేసి ఎవరెవరికి ఇవ్వాలో పేర్లు వ్రాసి పెట్టిన డబ్బులు. మొదటి తేదీ రాగానే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఆ నెల చివరి రోజు వరకూ ఆ పై అర ఖాళీ!

రాజమహేంద్రవరంలో మా ఇంటి గురించి ఇంటి గురించి చెప్పాను కదా? అన్నగారు వేంకట రంగాచార్యులు గారు ఉన్నంత కాలం  ఇంటిలో ఎవరికీ ఈయన అద్దెకు ఇవ్వలేదు. ఆయన పోయాక ఆయన, భార్య, నేను ముగ్గురం మాత్రమే. అంత ఇల్లు ఏమి చేసుకోవాలి? అందుకని మాకు కావలసిన భాగం ఉంచుకొని, మిగిలిన భాగంలో రెండు వాటాలుగా అద్దెకు ఇచ్చారు.

ఒక వాటాలో రంగనాథం గారని ఒక వీణ మాష్టారు ఉండేవారు. ఇంకో వాటాలో శర్మ గారని ఉండేవారు. రంగనాథం గారి గురించి తరువాత.

శర్మ గారికి అప్పటికి వివాహం కాలేదు. తల్లి, ఆయన. వీరిద్దరూ కాకుండా శర్మ గారి అక్కగారు, బావగారు, బావగారు తల్లి, వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు. ఆ బావగారికి ఉద్యోగం లేక పోవటం వల్ల ఆ కుటుంబం బాధ్యత కూడా శర్మ గారే తీసుకోవలసి వచ్చింది. ఆయన రాజమహేంద్రవరంలో విజయ డెయిరీలో ఉద్యోగం చేసేవారు. పెద్ద జీతం ఏమీ కాదు. ఆయనా, తల్లీ మాత్రమే అయితే దర్జాగా బ్రతికేవాళ్ళు. కానీ అక్క గారి కుటుంబం కూడా ఉందిగా?

నెల మొదలైందంటే ఆయన విన్యాసాలు రకరకాలుగా ఉండేవి!

మా చిన తాత వచ్చిన వాడికి వచ్చినట్టు సందుగా పెట్టెలో నుంచి తీసి బాకీలు కట్టేసేవాడు. కానీ శర్మ గారు అలా కాదు.

వచ్చినవాడికి వెంటనే బాకీ తీర్చేయటానికి కుదిరేది కాదు! ఆదాయం చాలేది కాదు మరి!

ఒక్కొక్కళ్ళకీ ఇవ్వవలసిన బాకీ వాయిదా వేయటానికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క సాకు, ఒక్కొక్క కథ, ఒక్కొక్క డెడ్ లైన్…

నేను ఆయన విన్యాసాలు అన్నీ ఆసక్తిగా చూస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎలాటి గొడవా చేయకుండా ఆయన ఒక్కొక్కళ్ళకీ నచ్చచెప్పి పంపే “చాతుర్యం” ఆశ్చర్యకరంగా ఉండేది. అది ఒక “సృజనాత్మక కళ!”

మా ఇంటిలో అది ఉండదు… అంతా లెక్క ప్రకారం జరిగి పోతుంది. శర్మ గారి దగ్గర బాకీ ముందుకు “జరిగి” పోతుంది!

నాకు శర్మ గారి చాతుర్యం బాగా నచ్చేది! అది చాల “థ్రిల్లింగ్” గా ఉండేది! “అది కదా లైఫ్!” అనుకునే వాడిని! ఎలాటి ఎగుడు దిగుళ్ళు లేకుండా సజావుగా సాగిపోయే బ్రతుకులో “థ్రిల్” ఏముంటుంది కనుక? ఒక్కొక్కరికీ ఒక్కొక్క “కథ” చెప్పేసి పంపించేసే “నైపుణ్యం” కదూ లైఫ్ లో “ఆకర్షణ!” అనుకునే వాణ్ణి.

మెల్లిగా నెల పూర్తి అయే లోపు ఎవరి బాకీ వాళ్ళకి సద్దేసి ఊపిరి పీల్చుకునే శర్మ గారిని చేస్తే ముచ్చటేసేది. ఆ రోజు ఆయన ముఖంలో కనిపించే “రిలీఫ్” బహుశః భక్తుడికి భగవంతుడు ప్రత్యక్షం అయినప్పుడు కలిగే ఆనందం కన్నా ఎక్కువేనేమో!

శర్మ గారు అప్పట్లో నా “హీరో!”

“బ్రతికితే అలా బ్రతకాలి!” అనుకొనే వాణ్ణి! జస్ట్ ఆ “థ్రిల్” కోసం!

పెద్దలు చెప్పిన మాట వ్యర్థం కాదు కదా? “యద్భావం తద్భవతి” అని ఏ క్షణాన ఎవరు వ్రాక్కుచ్చారో కానీ… అనంతర జీవితంలో నేనూ ఒక “శర్మ గారు” అయిపోయాను! ఎన్ని బాకీలు! ఎన్ని కథలు! ఎన్ని సాకులు! అన్నిటికీ చిన్నప్పుడు పరోక్షంగా ఆ శర్మ గారు ఇచ్చిన “ట్రైనింగ్” పనికొచ్చింది. ఆయనకు “ఏకలవ్య శిష్యుడిని” కదా!

ఆ రోజులన్నీ గడచి పోయినా శర్మ గారిని ఎలా మరచి పోగలను?


Leave a comment