స్వీయ అన్వేషణ -144
కొన్ని అద్భుతమైన వ్యక్తిత్వాలు, ఆ వ్యక్తిత్వాలకు వేదికలైన జీవితాలూ ఎందుకో చీకటిలో మునిగిపోతాయి. కానీ ఆ చీకటిని నిరాకరిస్తూనే, సాధ్యమైనంత వరకూ “లోపలి వెలుగు”ను సజీవంగా నిలుపుకొనే ప్రయత్నం అనుక్షణం చేసే వ్యక్తులు కొందరు ఉంటారు! అలాటి మహత్తర వ్యక్తి “కుసుమక్క!”
ఇద్దరన్నల ముద్దుల చెల్లెలు. పొలాలు, తోటలు ఉన్న కుటుంబం. చందనం చెక్క లాంటి చెయ్యెత్తు మనిషి. చదువంటే ప్రాణం. సంగీతం ఆమె ఆత్మగానం.
సరిగ్గా అదే కుసుమక్క కొంప ముంచింది. వీణ నేర్చుకుంటానని అన్నలను వేధించింది. ఆమె అడిగితే కాదనేది ఏముంది? కానీ, పదహారేళ్ళ అందమైన ఆడపిల్ల, ఆస్తిపరురాలు. ఎవరి దగ్గర పెట్టాలి నేర్చుకోవడానికి?
అప్పుడు కనిపించారు ఒక వీణ మాస్టర్. రాజమహేంద్రవరం క్షేత్రపాలకుడు శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రధానార్చకులు శ్రీమాన్ ఖండవల్లి జగన్నాథాచార్యులు గారు గొప్ప వీణా విద్వాంసులు. కుసుమక్క “వీణ నేర్చుకుంటాను” అనే సరికి ఆయన పాఠాలు చెప్పటం మానివేసి పూర్తిగా స్వామి సేవలో మునిగిపోయారు. ఆయనను అడిగితే ” నేను మానేశాను. నా శిష్యుడు ఉన్నాడు. అతని దగ్గరకు పంపండి” అని చెప్పారు ఆయన. ఆయన శిష్యుడు రంగనాథం. ఈ రంగనాథం మా ఇంటిలో రెండు గదులలో అద్దెకు ఉండేవారు. ఖండవల్లి వారి దగ్గర శిష్యరికం తరువాత ఆయన కొద్దికాలం ప్రపంచ ప్రఖ్యాత వీణా విద్వాంసులు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి దగ్గర కూడా శిష్యరికం చేశారు. ఇంకేం కావాలి? “పెద్దాయన చెప్పారు, పైగా ఈయన ఫణిహారం వారి ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. అంతకన్నా “సేఫ్ ప్లేస్” ఎక్కడుంటుంది అమ్మాయికి” అనుకున్నారు అన్నలు. అలా ఆ కుసుమక్క ఈ రంగనాథం శిష్యురాలు అయింది. రోజూ సాయంత్రాలు వచ్చి వీణ పాఠాలు చెప్పించుకొనేది. అలా ఒక ఏడాది ఆ శిష్యరికం సాగిన తరువాత…
ఒకసారి రంగనాథంకి బాగా జ్వరం వచ్చింది. ఒకటి, రెండు రోజులు కుసుమక్క వచ్చి పాఠం లేక తిరిగి వెళ్ళిపోయింది. జ్వరం తగ్గలేదు, నీరసించి పోతున్నాడు. కుసుమక్కకు జాలి వేసింది. ఉదయం గోధుమ జావ, మధ్యాహ్నం తేలికపాటి భోజనం, రాత్రి మళ్ళీ జావ తెచ్చి ఇచ్చేది గురువు గారికి. ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో చూసి ఇస్తూ ఉండేది. తల, కాళ్ళు పట్టేది. గురుసేవలో మునిగింది ఆ అమాయకురాలు.
కానీ… ఆయనలో మరో “భావన” కలిగింది. ఇదంతా తనపై ఇష్టం అనుకొన్నాడు, ప్రేమ అనుకొన్నాడు. “బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు” అని కదా అంటారు!
కానీ… ఎలా? ఆమె ఆస్తిపరురాలు. తనో… వీణ పాఠాలు చెప్పుకొంటూ బ్రతికేవాడు. ఆమె అన్నలు ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎలా?
ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెతో పాటు ఆమె ఆస్తీ దక్కుతుంది. ఎలా?
అక్కడ మొదలైంది ప్రణాళిక!
ఆ సమయంలోనే ఆమె పెద్దన్న, వదిన, వాళ్ళ ముగ్గురు పిల్లలు భద్రాచలం బయలుదేరారు. ఆమె చిన్నన్న చక్రపాణి ఆమెకు తోడుగా ఉన్నారు. భద్రాచలంకి లాంచీ ప్రయాణం. ఏ దుర్ముహూర్తంలో బయలుదేరారో కానీ ఆ లాంచ్ ప్రమాదానికి గురైంది. కుసుమక్క పెద్దన్న, వదిన, వాళ్ళ పిల్లలు ఆ గోదావరి గర్భంలో జలసమాధి అయిపోయారు. ఆ కుటుంబంలో కుసుమక్క, చక్రపాణి, ఆయన భార్య మిగిలారు. చిన్నతనం నుంచీ ప్రాణం పెట్టి పెంచిన పెద్దన్న కుటుంబం అలా జల సమాధి అయిపోవడంతో ఆమె కృంగిపోయింది.
అదే అదను అనుకొన్నారు రంగనాథం. మా తాతల దగ్గర ప్రస్తావించాడు. “ఆమె నన్ను ఇష్టపడుతూంది, నాకూ ఇష్టం ఆమె అంటే. మీకూ తెలుసు కదా నాకు బాగా లేనప్పుడు వచ్చి నెల రోజులు ఎంత సేవ చేసిందో!” అంటూ మొదలు పెట్టాడు.
నిజమే కదా… నెల్లాళ్ళు మనమూ చూశాం కదా… అనుకొన్నారు వీళ్ళు. ఆమె చిన్నన్న చక్రపాణిని పిలిచి మాట్లాడారు. చక్రపాణికి ఏమీ అర్థం కాలేదు. “అమ్మాయిని అడిగి చెబుతాను” అని వెళ్ళిపోయాడు. అడిగాడు. ఆమెకు మతి పోయింది. పాఠాలు చెప్పే వాడికి బాగా లేకపోతే సేవ చేయటం తప్పయి పోయిందా? అన్నగారికి చెప్పింది “అలాంటిదేమీ లేదు” అని.
ఆయన వచ్చి మా తాతలకు చెప్పాడు. వీళ్లకి ఏమీ అర్థం కాలేదు. ఆయన ఏమో అలా చెబుతున్నాడు, ఈయన ఏమో ఇలా చెబుతున్నాడు… ఏం చెయ్యాలి? రంగనాథాన్ని పిలిచి అడిగారు. అతను మరికొంత పెంచి చెప్పాడు. “మీకు చెప్పలేకపోయాను కానీ… మన్నించండి… ఆమెకీ నాకూ …”
ఈ పెద్ద మనుషుల జీవితాలలో అలాటి మాటకి ఆస్కారమే లేదు. ఆ మాట విన్నాక చక్రపాణి కూడా ఏమీ మాట్లాడలేక పోయాడు. రాత్రి తొమ్మిది పది గంటల వరకూ ఆమె ఇక్కడ ఉండటం తెలుసు. అంతే… అందరూ కలసి ” ఈ మాట బయటకు పొక్కితే పరువు పోతుంది” అనుకొన్నారు.
ఇంకేముంది? కుసుమక్క బ్రతుకును చీకట్లోకి నెట్టేశారు అందరూ కలసి…
“మొదటి వ్యక్తి ఆమె!” రేపు…
Leave a comment