స్వీయ అన్వేషణ – 145
కొందరు చీకటిలో కూరుకుపోతున్న కొద్దీ తమకు తాము “వెలుగు రేక”లా విచ్చుకొంటారు. ఆ ” వెలుగు రేక” పేరే కుసుమక్క!
పెద్దవాళ్ళు అందరూ కలిసి ఒకడి మాట నమ్మి పెళ్లి చేసేశారు. చిన్నన్న చక్రపాణి రాజమహేంద్రవరంలో ఉన్న తమ ఉమ్మడి ఇల్లు చెల్లెలికి అప్పజెప్పి తమ పల్లెకి వెళ్ళిపోయాడు.
రంగనాథం కోరిక తీరింది… “అందాల బొమ్మ తో పాటు ఇల్లు దక్కింది…”అనుకొన్నాడు!
తనను మోసం చేసిన వాడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది కుసుమక్క. ఎవరికీ చెప్పకుండా, మూడో కంటి వాడికి తెలియకుండా తన వాటాకు వచ్చిన పొలం, తోటల భాగం తన తరువాత తన చిన్నన్న కూతురి పేరిట రిజిస్టర్ చేసేసింది. ఆ పత్రాలను ఒక కవర్ లో ఉంచి, అతికించి మా చిన్న తాత చేతికి ఇస్తూ ” మా చిన్నన్న కూతురి పెళ్లి టైమ్ లో ఇద్దామని నా దగ్గర ఉన్న డబ్బు కొంత బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపోజిట్ లో దాచాను బాబాయ్ గారూ! ఈ కాగితాలు మీ దగ్గర క్షేమంగా ఉంటాయని మీకు ఇస్తున్నాను. దయచేసి ఈ సంగతి మీ రంగనాథం తో సహా ఎవరికీ చెప్పకండి!” అని చెప్పింది. ఆయన “మంచి పని చేశావమ్మా! జాగ్రత్తగా ఉంటాయి ఈ కాగితాలు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకో!” అని ఆ కవర్ మా చిన్న మామ్మకి ఇచ్చి జాగ్రత్త పెట్టమని చెప్పారు. అందులో ఏముందో చూసే ఆలోచన వచ్చే మనుషులు కారు వాళ్ళు. ఆ నమ్మకంతోనే కుసుమక్క వాళ్ళకి ఇచ్చింది.
కుసుమక్కను నేను మొట్ట మొదట చూసినప్పుడు నాకు పన్నెండేళ్ళు! అప్పటి నుంచి దాదాపు మరో పదిహేనేళ్ల కాలం కుసుమక్కను నేను చూస్తూనే ఉన్నా. ఇప్పటి వరకూ చెప్పింది అంతా కుసుమక్క మాత్రమే కాక తాము చేసిన పెళ్లికి పశ్చాత్తాపంతో మా చిన్న తాత చెప్పిన విషయాలు మాత్రమే. నేను ప్రత్యక్ష సాక్షిని కాను.
కానీ కుసుమక్క వాళ్ళూ మా ఇంటికి అద్దెకు వచ్చిన తరువాత రంగనాథం గారి ప్రవర్తన చూస్తున్న కొద్దీ ఆ కథలో నిజం బోధపడుతూ వచ్చింది.
అప్పటి నుంచీ ఆమె తన జీవితాన్ని ఎలా “హ్యాండిల్” చేసుకుందో, ఎవరికీ తల వంచకుండా ఎలా బ్రతికిందో నేను ప్రత్యక్షంగా చూశాను.
ఆమెకు ముగ్గురు పిల్లలు. అందరూ నా కన్నా చాలా చిన్నవాళ్ళు. ఆమెకు చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో ఒక లేడీ డాక్టర్ చాలా సన్నిహితురాలు. ఈ స్నేహ బృందం రోజూ సాయంత్రం ఆవిడ ఇంటిలో కలిసి పేకాట ఆడుకునేవారు. కుసుమక్క పేకాటలో ఎక్స్పర్ట్! వాళ్ళు పేకాట ఆదుకునేవారు అనే విషయం నాకు చెప్పింది ఆ డాక్టర్ గారి హెడ్ నర్స్ కూతురు ఝాన్సీ. ఆమె నేను చిన్నప్పటి నుంచీ క్లాస్ మేట్స్. “మీ అక్క ఎప్పుడూ ఒక్కసారి కూడా ఓడిపోవటం చూడలే!” అనేది ఝాన్సీ.
కుసుమక్క విపరీతంగా చదివేది. వార పత్రికలు అన్నీ చదివేసేది. అప్పటికే నాకు మా చిన్న మామ్మ వల్ల చదవటం అలవాటై పోయింది. మా చిన్న మామ్మ ఆంధ్రప్రభ వీక్లీ, యువ మంత్లీ మాత్రమే చదివేది, నా చేత చదివించేది. కుసుమక్క అన్ని పత్రికలూ చదివేది. నేను ఆమె రీడింగ్ క్లబ్ మెంబర్ని.
ఈ చదవటం అనే వ్యామోహం క్రమంగా పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని చదవటం వరకూ వెళ్ళింది. రంగాచారి రోడ్ లో కొంచెం ముందుకు వెడితే కుడివైపు రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ కంపనీ ఉంది. దాని అరుగు మీద ఒక బడ్డీ కొట్టు ఉంది. దాని యజమాని పాలీసురావు! బహుశః పోలేశ్వర రావు ఏమో! అందరి నోళ్లలో పడి, పడి పొలీసురావు అయింది!
ఆ షాప్ లో పుస్తకాలు అద్దెకు ఇచ్చేవాడు. అక్కడే డిటెక్టివ్ లు యుగంధర్, పాణి, పరశురామ్, వాలి… పరిచయం అయ్యారు. ఆ తరువాత అప్ గ్రేడ్ అయి స్పై షాడో వచ్చాడు.
వీటితో పాటు ఆనాటి కుర్రకారు ఎగబడి “రహస్యం”గా ” దాచుకొని” చదివే పత్రికలు కొన్ని ఉండేవి. తెనాలి నుంచి వచ్చేవి. మెల్లిగా అవీ కంట పడ్డాయి. తెచ్చుకొని చదివే వాణ్ణి.
ఒకసారి అలాటి పుస్తకం ఒకటి చదువుతూ కుసుమక్కకి దొరికిపోయాను. ఆమె కోప్పడలేదు. “తమ్మీ” అనేది నన్ను.
“తమ్మీ! మామూలే… ఈ ఏజ్ లో ఇలాటివి చదవటం. కానీ వీటిలో ఉండేవి ఏవీ నిజం కాదు. ఇవి చదివేసి, ఇందులో చెప్పినవన్నీ నిజం అనుకొని, తరువాత ఆ అంచనాలు అందుకోలేక డిప్రెషన్ లోకి పోతారు. ఇవి కాదు చదవాల్సిన పుస్తకాలు. నిజంగా నీకు చదవాలి అని ఉంటే ఏం చదవాలో నేను చెబుతాను. ఇంకెప్పుడూ ఇలాటి పుస్తకాలు తీసుకు రాకు!” అంది కుసుమక్క. ఇంకొకరు అయితే చావగొట్టేవారు ఆ పుస్తకాలు చదువుతున్నందుకు.
ఆమె నా చేత చదివించిన మొదటి పుస్తకం కళ్యాణమల్లుడి “అనంగరంగ”! జైకో పబ్లికేషన్స్ వాళ్ళు వేసిన ఇంగ్లీష్ పుస్తకం అది. అది చదివిన తరువాత కుసుమక్క దానిలో నుంచి ఎన్ని ప్రశ్నలు వేసిందో! నేను నిజంగా చదివానా? నాకు ఎంత వరకూ అర్థం అయింది? తెలుసుకోవటానికి!
మా మాష్టారు శరభయ్య గారు వేణుగోపాల శతకం వ్రాశారు. దానిలో ఒక పద్యంలో ” సవురౌ మీ యురమ దెల్లెడన్ శివ శివ! శ్యామా పదాంకంబులే” అన్నారు. ఆ పద్యం చెప్పి ” ఈ పద్యంలో విశేషం ఏమిటో చెప్పండి!” అన్నారు మాష్టారు. నేను ఈ పాదమేచెప్పాను. మాష్టారు కొంచెం ఆశ్చర్యంగా సూటిగా చూస్తూ ” వాత్స్యాయనుడిని చదివారా?” అని అడిగారు. “లేదు మాష్టారూ! కళ్యాణ మల్లుడిని చదివాను” అన్నాను.
అప్పుడు మాష్టారు “ఇప్పటి దాకా ఎవరితోనూ చెప్పలేదు. నా చిన్నప్పుడు బందరులో ముట్నూరి కృష్ణారావు గారు, ఆయన భార్య రుక్మిణమ్మగారు చాలా ఆప్యాయంగా చూసుకునేవారు నన్ను. ఆయన మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళేవారు. అప్పుడప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళేవారు. భోజనం అయిన తరువాత ఉయ్యాల బల్ల మీద బాలీసును ఆనుకొని ఏటవాలుగా ఒరిగి ఉన్న ఆయనకు రుక్మిణమ్మ గారు తాంబూలం అందించేవారు. ఆ సమయంలో వారి మధ్య సాహిత్య చర్చలు సాగేవి. నేను వాటికి శ్రోతను. ఒక్కొక్కసారి కావ్యాలలోని శృంగార పద్యాల చర్చలో నుంచి వాత్స్యాయనుడి లోకి మళ్లేది చర్చ. అలా చదివాను నేను వాత్స్యాయనుడిని. చదవండి. మన కావ్యాలలో అతని సూత్రాలు చాలా ఉంటాయ్!” అన్నారు మాష్టారు.
అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది కుసుమక్కే!
దశాబ్దాల తరువాత వాకాటి పాండురంగ రావు గారు తన దగ్గర ఉన్న ఇంగ్లీషు పుస్తకాలు ఇచ్చి, చదివించి, వాటి మీద చర్చ పెట్టిన మొదటి రోజు కూడా నాకు గుర్తుకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి కుసుమక్క!
అడ్డమైన పుస్తకాలూ చదివి, ఆ మాయలో పడిపోకుండా కాపాడిన వ్యక్తి మా కుసుమక్క!
మాష్టారి కన్నా ముందు, వాకాటి వారి కన్నా ముందు ఏమి, ఎలా, ఎందుకు, ఎప్పుడు చదవాలో చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మా కుసుమక్క!
Leave a comment