” ఏమిటి ఆమె గొప్పదనం?”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 146

మా ఇంటి పెరటిలో బూడిద గుమ్మడి పాదు ఉండేది. పుష్కలంగా కాసేది. మా చిన్న మామ్మ కనకవల్లి ఆ బూడిద గుమ్మడి కాయతో  హల్వా చేసేది.

ఆ బూడిద గుమ్మడి కాయ కోసి, శుభ్రంగా కడిగి, నాలుగు ముక్కలు చేసి, ఒక్కొక్క ముక్క తురిమి, ఒక వస్త్రంలో ఆ తరుగును మూట కట్టి, దాని మీద ఒక రోలు బరువు పెట్టేవాళ్ళం. ఈ తరిగే పని నాది  నీరంతా పోవాలి. ఆ తరువాత మరో పొడి వస్త్రం మీద ఆ తరుగు ఆరే వరకూ ఉంచే వాళ్ళం.

ఆ తరువాత హల్వా తయారీ మా చిన్న మామ్మ పని. ఈ ” రెసిపి” నాకు చాలా ఇష్టం… ఇప్పటికీ!

కుసుమక్క సర్వ స్వతంత్రురాలు. తన జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకొని ఆ విధంగా జీవించిన వ్యక్తి. మరి భర్త రంగనాథం? ఆమెకు తాను చేసిన పని తెలియని వాడా? తెలుసు కనుకనే మాట్లాడలేక పోయేవాడు. ఆమె స్నేహితులతో గడపటం ఇష్టం లేదు. తనకు లోబడి ఉండాలి. తన మాటకు ఎదురు చెప్పకూడదు. ఆ మాట చెప్పే ధైర్యం లేదు… చెప్పినా ఆమె ఆ మాట వినదు. మగాడికి, మొగుడికి లొంగే మనిషి కాదు మరి!

ఏం చేయాలి? ఆమెని పూర్తిగా తన వశం చేసుకోవాలి, తాను గీసిన గీటు దాటకుండా ఉండేట్టు చేసుకోవాలి! ఎలా?

పోయి పోయి ఎవరినో అడిగాడు… ఏదైనా మంత్రమో, తంత్రమో చెప్పమని. వాడెవడో కానీ … బూడిద గుమ్మడి కాయ రసం తీసి, దానిలో కొబ్బరి నూనె కలిపి, ఆ మిశ్రమానికి ఇంకోటి కలిపి ( ఆ ఇంకోటి ఇక్కడ చెప్పేది కాదు!) మాడుకు రాస్తే ఎలాటి స్త్రీ అయినా వశం అయిపోతుంది, అలా వారానికి ఒకసారి చొప్పున ఆరువారాలు చేయాలని చెప్పాడు.

అంతే… మా ఇంటి మీద పడ్డాడు. వారానికి ఒకసారి వచ్చి మా చిన్న తాతను అడిగి ఒక బూడిద గుమ్మడి కాయ పట్టుకు పోయేవాడు. నాకు ఒళ్ళు మండిపోయేది. నాకు ఇష్టమైన హల్వాకు కాయలు తగ్గిపోవటం లేదూ మరి? అదీ నా మంట!

ఒకసారి మా చిన్న తాతను అడిగాను… “ఈయన ప్రతి వారం బూడిద గుమ్మడి కాయ ఎందుకు పట్టుకు పోతున్నాడు?”… అని. ఆయన ఈ కథంతా చెప్పాడు. ఈ కథంతా చెప్పి ఆయన ఒక మాట అన్నాడు… ” మొగుడూ పెళ్ళాం మధ్య ఉండవలసినది పరస్పర నమ్మకం, అనుబంధం. వీళ్ల పెళ్ళిలో ఆ నమ్మకం అనేదే లేదు. ఆ నమ్మకం లేకపోవటం వల్ల అనుబంధమూ లేదు. ఇలా ఎన్ని బూడిద గుమ్మడి కాయలు వాడినా ఏమీ లాభం లేదు. పోనీ… పట్టుకు పోనీ…!”

చివరికి ఆయన చెప్పినట్టే జరిగింది! ఎన్ని బూడిద గుమ్మడికాయలు వాడి ఏమి ప్రయోజనం? కుసుమక్క ఒక “అదమ్య వ్యక్తిత్వం!”

వీళ్ళు మా ఇంటిలో అద్దెకు ఉండటం వల్ల నాకు ఒక అనుకొని అదృష్టం కూడా కలిగింది!

రాజమహేంద్రవరం లో బుగ్గా పాపయ్య శాస్త్రి అని ఉండేవారు. ఆయన “శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి” అనే సంస్థను స్థాపించి ప్రతి యేటా శ్రీత్యాగరాజ ఉత్సవాలు నిర్వహించేవారు. ఆ సంగతి గతంలో ప్రస్తావించాను. ఆ ఉత్సవాలకు ఎందరో హేమాహేమీలు అయిన సంగీత విద్వాంసులు వచ్చేవారు.

ఆ కార్యక్రమాలకు ప్రఖ్యాత వీణా విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి గారు చాలా సార్లు వచ్చారు. రంగనాథం కొంత కాలం ఆయన దగ్గర శిష్యరికం చేశారు. శాస్త్రి గారు వచ్చినప్పుడు ఆయనను భోజనానికి ఆహ్వానించేవాడు. ఆయనా శిష్య వాత్సల్యంతో వచ్చేవారు. శాస్త్రి గారు భోజనప్రియలు… అందులోనూ గారెలు అంటే మహా ప్రీతి.

ఆయన భోజనానికి వచ్చినప్పుడల్లా సాయంత్రం వరకూ ఉండేవారు. నేరుగా ఇక్కడి నుంచే కచేరీకి వెళ్ళేవారు. భోజనానికి ముందో, విశ్రాంతి తరువాతనో కుసుమక్క ఆయనతో “బాబాయ్ గారూ! ఒక్క కీర్తన…” అనేది. ఆయనా కాదనేవారు కారు. అలా మహా విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి గారి వీణా నాదానికి “ప్రత్యేక శ్రోతల”లో ఒకడిగా నాకూ ఒక  అవకాశం దక్కింది. కేవలం ఆరుగురు మాత్రమే ఆ మహత్తర విశేష సందర్భానికి  శ్రోతలం!  ఒక కీర్తనతో మొదలై మరొకటి రెండు వినిపించేవారు ఆయన! కుసుమక్క మా ఇంటిలో ఉండటం వల్లనే నాకూ ఈ అదృష్టం కలిగింది.

కొన్నేళ్ళకు కుసుమక్క పట్టు బట్టి శంకర శాస్త్రి గారి సిఫార్సు తో రంగనాథానికి ఆకాశవాణి లో ఉద్యోగం ఉప్పించ గలిగింది. విశాఖపట్టణంలో పోస్టింగ్. అలా దాదాపు పదిహేనేళ్ల మా నిత్య సాహచర్యం ముగిసింది !

అయిదేళ్ళ క్రితం… అంటే దాదాపు ముప్ఫై ఏళ్ల తరువాత…అనుకోకుండా ఒక రోజు సాయంత్రం కుసుమక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చింది… ” తమ్మీ! హైదారాబాద్ వచ్చాను. దిల్ సుఖ్ నగర్ లో మా అమ్మాయి వేదవల్లి దగ్గరున్నాను. ఇంకో మూడు రోజులు ఉంటాను ఊళ్ళో. చాలా ఏళ్లై పోయింది. చూడాలని వుంది, ఓసారి రాకూడదూ?” అని.

అప్పుడు నేను హైదారాబాద్ లో లేను. దక్షిణ దేశ క్షేత్రయాత్రలో ఉన్నాను. కలవలేక పోయాను. ఇప్పుడు ఎలాగైనా కలవాలి అనుకొన్నా కుసుమక్క లేదు!

ఏవిటయ్యా మీ కుసుమక్క గొప్పదనం? ఇలా మోసపోయి ఇరుక్కుపోయిన జీవితాలు ఎన్ని లేవూ? అని అడగవచ్చు. నిజమే… అలాటి జీవితాలు లక్షల్లో ఉండవచ్చు ఈ దేశంలో. కానీ ఆ జీవితాలు ఏవీ నాకు ప్రత్యక్షంగా తెలియవు. వాటి ప్రభావం ఏమీ నా మీద లేదు.

కానీ… కుసుమక్కను నేను ప్రత్యక్షంగా చూశాను. ఒకటి రెండూ కాదు… పదిహేనేళ్ళ సుదీర్ఘ సహవాసం. ఎన్నో సందర్భాలలో నాకు సలహాలు ఇచ్చింది, మందలించింది, పాఠాలు చెప్పింది, పెడ దారి పట్టకుండా సరైన దారిలో పెట్టింది. అందుకే కుసుమక్క నాకు ప్రత్యేకం!


Leave a comment