” దేవుడు కనబడ్డాడు (ట)!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 150

చాలా మంది అంటూ అంటారు “నిన్న రాత్రి నాకు కలలో దేవుడు కనబడ్డాడు!” అని. సరే! ఎవరి నమ్మకం వాళ్ళది.

కానీ… నిజంగా మెలకువగా ఉన్నప్పుడు… పట్టపగలు… రహదారిలో… “దేవుడు” కనబడితే!?

ప్రముఖ సంపాదకులు కీ. శే. పొత్తూరి వేంకటేశ్వర రావు గారు ఒకసారి ఒక సంఘటన చెప్పారు…

ఆయన జిల్లెళ్ళమూడి అమ్మ భక్తులు. ఈ విషయం ఆనాటి వారికి, ఆయనతో సాన్నిహిత్యం కలవారికి  అందరికీ తెలిసిన విషయమే.

పొత్తూరి వారు, ఆయన బాల్య మిత్రులు మారుటూరి పాండురంగారావు గారు ఒకసారి జిల్లెళ్ళమూడికి వెళ్లారు.  పొద్దుపోయే వరకూ అమ్మ సాన్నిధ్యంలో గడిపి, గుంటూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. రాత్రి…చీకటి…వీధి దీపాలు లేవు… ఆ మట్టి రోడ్డులో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. మారుటూరి వారు “ఏమిటోనయ్యా వేంకటేశ్వర్రావూ! అమ్మ దగ్గర గడిపినట్టే లేదు. ఇంకొంచెం సేపు ఉండాల్సిందేమో!” అన్నారు.

జిల్లెళ్ళమూడి అమ్మ నిలువెత్తు భారీ మనిషి. పట్టు చీర, నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో ఉండేవారు.

మారుటూరి వారు అలా అనగానే…ఆ చిమ్మ చీకటిలో… నడి రోడ్డు మీదే… ఎదురుగా అమ్మ!

హఠాత్తుగా అంతటి మనిషి ఎదురుగా ప్రత్యక్షం కాగానే… ఇద్దరూ భయపడి పోయారు! కాళ్ళల్లో ఒణుకు! నోట మాట రావటం లేదు ఇద్దరికీ! నిశ్చేష్టులై కొయ్యబారి పోయారు.

ఎలాగో ఊపిరి కూడ దీసుకొని పొత్తూరి వారు చేతులు జోడించి… “అమ్మా! మేము నీ సాన్నిధ్యంలో గడపాలి అనుకుంటే ఎంతసేపైనా గడుపుతాం. కానీ… ఇలా చీకట్లో… నడి రోడ్డు మీదే ప్రత్యక్షాలూ అవీ పెట్టకమ్మా! గుండాగి చచ్చిపోతాం!” అన్నారు.

అమ్మ ఒక చిరునవ్వు ప్రసాదించి అదృశ్యం అయిపోయారు. ఇది పొత్తూరి వారు స్వయంగా చెప్పిన సంఘటన! ఆయన అనుభవాన్ని తేలికగా తీసిపారేయడానికి లేదు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన గొప్ప “సాధకుడు!”

ఆయన ఆఫీస్ లో కూర్చుని మాట్లాడుతుంటే ” ఇప్పుడు ఫలానా మనిషి ఫలానా పని మీద వస్తాడు” అనేవారు. అయిదు పది నిమిషాలలో అదే మనిషి అదే పని మీదే వచ్చేవాడు! ఇది పొత్తూరి వారిలో ఎందరికో తెలియని “అజ్ఞాత పార్శ్వం”.

ఇదంతా ఎందుకు ప్రస్తావించ వలసి వచ్చింది?

నేను ఒక భక్తి సంబంధమైన టివీ ఛానల్ కి ” కన్సల్టెంట్” గా ఉన్న రోజులలో ఒకాయన ఆఫీస్ కి వచ్చాడు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి పొందిన ప్రవచనకర్త ఆయన. ఎందుకు వచ్చాడు అంటే ఆ ఛానల్ లో ఏదైనా కార్యక్రమం తనకు ఇవ్వాలని అడగడానికి!

మాటల మధ్యలో ఆయన ఒక విషయం చెప్పాడు… ” నేను ఆ మధ్య ఒక పర్వత క్షేత్రానికి వెళ్ళాను. ఆలయ దర్శనం అయాక ఆ కొండలలో తిరుగుతూ ఉంటే ఉన్నట్టుండి ఎదురుగా శ్రీ నృసింహ స్వామి కనిపించాడు! నేను ఆయనతో సంభాషించాను! తరువాత ఆయన అదృశ్యం అయిపోయారు! ఎంత ఆనందం కలిగిందో మాటలలో చెప్పలేను. అలాటి దివ్య అనుభవం ఎంత మందికి కలుగుతుంది చెప్పండి!” అన్నారు.

నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఆయన అనుభవం ఆయనది! కాదనటానికి నేనెవరిని? అంతటి ” దైవ సాక్షాత్కారం” పొందిన వ్యక్తి ఎదుట పడితే నిలువునా సాష్టాంగ నమస్కారం చేయవద్దూ?

కానీ…ఆయన అనుభవం ఆయనదే! కాదనను! అలా అని ఆ మాటలను ఖచ్చితంగా నేను నమ్మను… నమ్మను గాక నమ్మను! అది నా స్వేచ్ఛ!

అయినా ” ఎందుకు నమ్మవురా అబ్బీ!” అని అడుగుతారు కదా? అంతటి ప్రవచన కర్త, ప్రఖ్యాతుడు చెప్పిన మాటకు విలువ లేదా? అని అంటారు కదా?

చెబుతాను! నా ఉద్యోగ జీవితంలో చాలా మందిని చూశాను! రకరకాల వ్యక్తులు… ఒక ప్రక్క సాహిత్య రంగంలో, మరొక ప్రక్క ఆధ్యాత్మిక ( ఆ మాట వాడవచ్చా అనేది ఇప్పటికీ నాకు సందేహమే!) భక్తి రంగంలో… ఒకరా ఇద్దరా ఓ వందల మందిని చూశాను.

సరే… ఎందుకు నమ్మవురా?” … అంటే చెబుతాను…

ఆయనకు “దేవుడు కనబడ్డాడు!” ” ఈయన ఆ దేవుడితో సంభాషించాడు!” అది కదా ఆయన ” క్లెయిమ్!” ఓకే!

నాకు తెలిసినంత వరకూ “పట్టపగలు (కలలో కాదు సుమండీ) దేవుని సాక్షాత్కారం పొందిన వ్యక్తి “ఎలా ఉంటాడు?” అనే విషయంలో నాకు చాలా… చాలా… “క్లారిటీ” ఉంది!

అలాటి వ్యక్తి ఇక ఈ “ప్రాపంచిక విషయాల”కు క్రమంగా దూరం అయిపోతాడు! అతడిలో ఆ “భగవత్ సాక్షాత్కార సంజనిత ప్రశాంత దివ్య తేజస్సు” నెలకొని ఉంటుంది! ఆ అనుభవం పొందిన వాడు ఆ ” అనుభవ మాధుర్యం”లో తేలియాడుతూ ఉంటాడు! దాని గురించి పదిమందికీ చెప్పాలనే ఇచ్ఛ ఉండదు! అటువంటి వాడు ఎక్కడో మారుమూల ఒంటరిగా కూర్చున్నా వందలాది మంది వెతుక్కుంటూ వెడతారు. ఆ “భగవత్ చైతన్యం” లోక కల్యాణం కోసం, లౌకికుల బాధా నివారణం కోసం జనాలను అతడి వైపు పంపిస్తుంది.

అంతే కానీ… అలాటి వ్యక్తి టివీ ఛానళ్ల గడప తొక్కడు! ఒకదాని దాని తరువాత మరొక ఛానల్ కు పరుగులు పెట్టడు! “నాకు దేవుడు కనిపించాడోచ్!” అని ప్రకటించుకోడు!

నిజంగా “అంతటి వాడే” అయితే ఈ ఛానళ్ల వాళ్ళే కెమెరాలు, మైకులూ పట్టుకొని వెతుక్కొంటూ వెళ్ళరా?పోటీ పడి ఆ వ్యక్తి వెంట పడరా?కాదంటారా?

మరి పొత్తూరి వారి అనుభవాన్ని ఒప్పుకొని, నమ్మేసి, ఈయన అనుభవాన్ని ఎందుకు నమ్మనంటావ్? ఈ ” డబుల్ స్టాండర్డ్స్” హేవిటీ? అంటారా?

అదీ చెబుతాను… పొత్తూరి వారి, మారుటూరి వారి జీవితాలను నేను దగ్గర నుండి చూశాను. గంటలకు గంటలు వారితో గడిపాను. వాళ్ళ “వ్యక్తిత్వాలు” నాకు తెలుసు. వాళ్ళు ఎప్పుడూ ” స్వోత్కర్ష”కు పాల్పడిన వారు కారు. వారి ప్రవర్తనలో “వినయం” ఉంది కానీ “అహంకారం” లేదు. జిల్లెళ్ళమూడి అమ్మ సాక్షాత్కారం గురించి ఆయన మాటలలో చెప్పినా అది అమ్మ శక్తిగానే ప్రకటించారు తప్ప తన “గొప్పదనం” గా చెప్పలేదు. ఆయన మాటలలో ఆ “అమ్మ” పట్ల ఆయనకున్న విశ్వాసం, భక్తి, అంకిత భావం కనిపించాయి కానీ అది “స్వోత్కర్ష” కాదు.

కానీ… నాకు దేవుడు కనిపించాడు… నేను ఆయనతో సంభాశించాను… అనే “ప్రకటన” లో ఉన్నది “స్వోత్కర్ష” మాత్రమే! టీవీలో కార్యక్రమం అడగటానికి వచ్చినవాడు ఆ విషయం చెప్పవలసిన అవసరం ఏముంది? అప్పటికే ప్రవచన రంగంలో ప్రఖ్యాతి ఉన్నవాడే. ” నేను ఎంతటి వాడినో తెలుసా?” అని చెప్పుకోవటానికి కాక ఈ ప్రసక్తి తీసుకు రావలసిన అవసరమే లేదు గాక లేదు! అందుకే నమ్మను! నమ్మను గాక నమ్మను!

నువ్వు నమ్మితే ఎంత? నమ్మకపోతే ఎంత? నిజమే…నేను ఎవడిని? ప్రవచన కర్తను కాను… పీఠాధిపతిని కాను… అవధాన విద్యా ప్రవీణుడను

కాను… కానీ… ఆ సందర్భంలో… ఆ ఛానల్ లో కార్యక్రమాలకు సంబంధించిన సలహాదారును. కనుక ఆ సందర్భంలో నమ్మాలా? వద్దా? అనేది నా హక్కు మాత్రమే కాదు… నా ఉద్యోగ బాధ్యత కూడాను.

ఈ “సాక్షాత్కార ప్రహసనాలు” టివీ రంగంలో ఉన్నప్పుడు చాలా చూశాను.


Leave a comment