“మహోపకారి!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 151

నా మిత్రుడు వివేకానందం ఒక గొప్ప సాహిత్య రంగ కార్యకర్త. ఏదైనా తెర వెనుక ఉండి నడుపుతాడు కానీ ఎక్కడా కనపడడు.

యువభారతి సంస్థ కార్యదర్శిగా నాకు పరిచయం అయ్యాడు. 1985 కి ముందు రాజమహేంద్రవరం పుస్తక ప్రదర్శనకు యువభారతి పుస్తకాలు తీసుకొని వచ్చాడు. అతనితో మా మేనమామ( తరువాతి కాలంలో బావగారు) తిరుమల కాండూరి విజయకుమార్ కూడా వచ్చాడు. “వచ్చాడు” అనే ఏకవచన సంబోధన చిన్నప్పటి నుంచీ వచ్చిన ” చనువు” వల్ల!

అప్పుడు ఆ పని చూసుకొని వెళ్ళిపోయారు. తరువాత యువభారతి ఏటా నిర్వహించే ఒక “లహరి” కార్యక్రమానికి ఆహ్వానం పంపాడు. అప్పటికే నేను రాజమహేంద్రవరం లో జాతీయ సాహిత్య పరిషత్ కు కార్యదర్శిగా ఉన్నాను. ఆ ఆహ్వానం అందుకొన్న తరువాత వివేకానందం కి ఒక ఉత్తరం వ్రాశాను… ఇంగ్లీషులో!

దానికి సమాధానం వ్రాస్తూ అతడు “యువభారతి ఇంగ్లీషులో ఉత్తరమా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

అది చదివిన క్షణం నుంచీ ఇప్పటి వరకూ తెలుగు రాని వాళ్లకు తప్ప తెలుగు వచ్చిన వాళ్ళకి ఎవరికీ తెలుగులో తప్ప ఇంగ్లీషులో ఉత్తరాలు వ్రాయలేదు నేను!

నేను హైదారాబాద్ వచ్చేశాక ఎన్నో సాహిత్య కార్యక్రమాలలో అతడితో పాటు నేనూ పాల్గొన్నాను. ఆంధ్రపత్రికలో ఉన్న కాలంలో మేమిద్దరం రాళ్ళబండి కవితాప్రసాద్ మరికొంత మందితో కలసి “రస తరంగిణి” అనే ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేసికొని చాలా కార్యక్రమాలు చేశాము. ఒక ఏడాది కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి నాడు ప్రారంభించి వర్ధంతి వరకూ ప్రతి నెలా కార్యక్రమాలు ఏడాది పాటు నిర్వహించాం. ప్రధానంగా విశ్వనాథ కృతులు, పద్య సంపుటులు, నాటకాల  మీద దృష్టి పెట్టాము. సమాపన కార్యక్రమంలో శ్రీయుతులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ, డాక్టర్ ప్రసాదరాయ కులపతి, క్రొత్తగా జ్ఞానపీఠ పురస్కారాన్ని “గ్రహించి”న ఆచార్య సి. నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

దక్షిణ మధ్య రైల్వే వారి ” లలిత కళా సమితి” త్యాగరాజ గాన సభలో ఒక రోజంతా నిర్వహించిన సాహిత్య సదస్సు వెనుక ఉన్నది కూడా మేమిద్దరమే.

“భారతి” మాస పత్రిక నమూనాలో మేము “ప్రవాహ వాణి” సాహిత్య మాస పత్రికను ప్రారంభించటంలో విశేష యోగదానం అతడిదే!

ఇది ఒక పార్శ్వం కాగా మరొకటి… దేశంలో ఎక్కడెక్కడి మంత్రవేత్తలను కలవటం అతడికి ఒక పని. ఆ క్రమంలోనే “అద్దంకి కృష్ణమూర్తి”గా ప్రసిద్ధులైన మంత్ర సిద్ధుడి పరిచయం. ఆయనను నాకు పరిచయం చేసినది అతడే. అలాగే గుంటూరులో అందరూ “నాన్నగారు” అని ఆప్యాయంగా, ఆరాధనాభావంతో గౌరవించుకునే  “రాధికా ప్రసాద్ మహారాజ్”ను నాకు పరిచయం చేసినదీ అతడే.

అన్నిటికీ మించి ” The Power of Tantra” అనే పుస్తకం తెచ్చి ఇచ్చి పరమ పూజ్య గురుదేవులు స్వామీ నిఖిలేశ్వరానందగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ గురించి తెలియచేసింది కూడా అతడే. గురుదేవుల ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ, జోధ్ పూర్ తిరిగి సాధించి తెచ్చి ఇచ్చి ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురించటానికి కారణం అతడే.

గురుదేవులు హైదారాబాద్ వస్తున్నారన్న సమాచారం ఇచ్చిన వాడు, ఆ తరువాత గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ సాన్నిధ్య భాగ్యానికి కారణం కూడా అతడే.

గుంటూరులో ఇప్పుడు “శ్రీ స్వయం సిద్ధ కాళీ పీఠం” అనే పేరుతో ఇప్పుడున్న మందిరంలో ఆ కాళీ విగ్రహం ఉన్నది అంటే దానిని తెప్పించి ఇచ్చినది గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ అయితే ఆ పని పూర్తి అయ్యేవరకూ నడుం కట్టి నడచిందీ ఇతడే!

సాహిత్యం పిచ్చిలో ఒకసారి ఒక శతావధానం నిర్వహించాలని సంకల్పించాడు. ఒక ప్రసిద్ధ శతావధాని గారిని సంప్రదించాడు. ఆయన అంగీకరించారు కానీ కొన్ని షరతులు పెట్టారు! ఆ షరతులు ఏమిటయ్యా అంటే…

  1. పృచ్ఛకులను నేను నిర్ణయిస్తాను.
  2. కొన్ని సమస్యలు నేనే ఇస్తాను.
  3. సగం మంది పృచ్ఛకులను నేనే తెచ్చుకుంటాను.

అది విన్నాక ” ఛీ” అనిపించి వదలివేశాడు.

ఆ మిత్రుడు వివేకానందం నాకు చేసిన అనేక సహాయాలు, ఉపకారాలూ ఎన్నో ఉన్నా అన్నిటికీ మించినది పరమ పూజ్య గురుదేవులు స్వామీ నిఖిలేశ్వరానంద ( డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ), పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీల పరిచయ భాగ్యం కలిగించటం!


Leave a comment