“జీవించడం! బ్రతకడం!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 152

“నామం” అంటే పేరు… మనకు కలిగే అనుభవాన్ని శిధిలం చేసేస్తుంది! పేరు తెలియనప్పుడు కలిగే అనుభవం ఒక అద్భుతం! చిన్నప్పుడు ఒక సముద్రాన్ని చూశారు అనుకోండి… ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు… మీద మీదకు వచ్చి పడిపోతున్నట్టు భయపెట్టేసి… ఒక్కసారిగా నిలువునా విరిగి పడిపోయి… నురగలు కక్కుతూ వెనక్కిపోయి, ఆ తెల్లని నురగ ఒక్కొక్క కెరటానికీ ఒక్కొక్క సరిహద్దు రేఖలా హొయలు పోతూ… కనుచూపు సాగినంత మేరా అటెటో దిగంతరేఖను తాకి…దానిలో మమేకమై పోతున్నట్టున్న ఆ అనంత జలరాశిని జీవితంలో మొట్టమొదటి సారి చూసినప్పుడు… భయం…ఆశ్చర్యం…సంభ్రమం..

ఇలాటివి ఎన్నెన్నో ఒకేసారి కమ్మేసి…కళ్ళు విప్పార్చి…రెప్ప వేయకుండా… పక్కనే ఉన్న నాన్న చేతినో, అమ్మ కొంగునో గట్టిగా పట్టేసుకుని…చూడలేదూ!

“ఇదేమిటి?”

“బుజ్జీ! ఇదే సముద్రం!”

ఆ తరువాత మరోసారి దానిని చూసినప్పుడు… ఆ మొదటి అనుభవం కలిగిందా? లేదు కదూ? ఎందుకు? అది ” సముద్రం!” అని తెలిసిపోయింది! దాని పేరు తెలిసిపోయింది! ఆ పేరు తెలిశాక ఎప్పుడు చూసినా మొదట మదిలో మెదిలేది ఆ నామం అంటే పేరు! అక్కడితో “సజీవ అనుభవం” ఖతమ్! “ఇంద్రియ అనుభవం” స్థానంలో “నామ రూప జ్ఞానం” ప్రవేశించింది.

ఈ సృష్టిలో దేనిని చూసినా మనకు కలిగే మొదటి “దర్శనానుభవం” మాత్రమే “స్వచ్ఛ” మైనది. తదనంతర దర్శనం అంతా ” నామ జ్ఞాన కలుషితం”, వ్యర్థం!

సూర్యోదయానికి ముందుగానే మంద్ర కాషాయ వర్ణ శోభిత గగనం క్రింద తరంగిస్తున్న సముద్రం… ఓ గంట తరువాత…రెండు గంటల తరువాత…ఉషోదయం నుంచి అర్ధరాత్రి వరకూ కడలి ఒడ్డున కూర్చొని చూస్తే…అదే సముద్రం…అదే జలరాశి… అవే కెరటాలు… అవే నురగలు… తరగలు… ఎన్నెన్ని “సోకులు” పోతాయో తెలుసా!చెన్నపట్నం ( నన్ను పెంచిన మా చిన్న తాత వేంకట వల్లభాచార్యులు గారు అలాగే అనే వారు… నాకూ అదే ఇష్టం!)లో పని చేస్తున్న కాలంలో ఒక ఆదివారం ఉదయం రాయపేట వుడ్ ల్యాండ్స్ హోటల్ నుంచి ఎవరికీ చెప్పకుండా పారిపోయి మెరీనా బీచ్ లో ఉషోదయం నుంచి రాత్రి 10 గంటల వరకూ కూర్చుంటే… సముద్రం ఎన్ని రంగులు మార్చుకుందో! ఎవరన్నారు సముద్రం నీల జలరాశి అని? కాదు… సముద్రం కేవలం నీల జలరాశి కాదు… వివిధ వర్ణ రంజిత అంబురాశి… జీవితం లాగే!

దాని కెరటాల వేగంలో… ఒడుపులో… ఆటులో… పోటులో… ఎంత వైవిధ్యం…జీవితం లాగే!

నాలుగో తరగతో, అయిదవ తరగతో… గుర్తు లేదు… మొట్టమొదటి సారి… మా చిన్న తాత, చిన్న మామ్మలతో… మొట్టమొదటి సారి మెరీనా బీచ్ కి వెళ్ళినప్పుడు, ఎన్నో ఏళ్ల తరువాత ఆంధ్రపత్రికలో ఉన్నప్పుడు బాలమురళీకృష్ణ ఇంటర్వ్యూ కోసం మిత్రుడు వివేకానందంతో చెన్నపట్నం వెళ్లిన రోజు సాయంత్రం, అలాగే మరికొన్ని ఏళ్ల తరువాత ఆంధ్రప్రభలో ఉన్నప్పుడు, మళ్ళీ కొన్నేళ్ళకు “వెలుగు” ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు అదే మెరీనా బీచ్ కి వెళ్ళినప్పుడు, అలాగే కాకినాడ, బాపట్ల, పూరీ, ఉప్పాడ బీచ్ ల దగ్గర…ఆ “ప్రధమానుభవం” సజీవంగా తిరిగి రావటం…అదే ఆశ్చర్యం, అదే సంభ్రమం, అదే భయం… చాలదూ నాలో ఇంకా ఆ “పసివాడు” సజీవంగా ఉన్నాడని ఆనందించటానికి! మా మాష్టారు శరభయ్య గారు ఇలాటి అనుభవం గురించి వ్రాసిన కొన్ని పద్యాలు, ఆయన నుంచి అందిన “కావ్యజ్ఞ శిక్ష” లేకుంటే… మనసుకి “జిడ్డు” పట్టకుండా ఉంటే… ఈ అనుభవ గంధం సాధ్యం అయేదే కాదు అన్నది సత్యం!

సమస్త ఇంద్రియాలు పరిపూర్ణంగా వికసించి, ఆ ఇంద్రియానుభవాలను విడివిడిగా ఆస్వాదించ గలిగి, ఆ ఆస్వాదనలో విచక్షణ నేపథ్యంగా నిలిచి, ప్రతిక్షణం వర్తమానంలో నిలబడ గలగడం ” జీవించడం”!

“ఆహార నిద్రా భయ మైథునాదుల” వలయంలో ప్రతిక్షణం “సమసిపోవడం” అంటే “బ్రతకడం”!

మొదటిది ఒకరకంగా “భగవదనుభవం”తో సమానం… “బ్రహ్మానంద సబ్రహ్మచారి”!

రెండవది కేవలం “జంతు – పశు స్థాయి”!

ఏ స్థాయిలో ఉన్నాం? ఒకటే పరీక్ష!

అనుక్షణం “అశాంతి” తో ఉంటే “బ్రతుకుతున్నాం” అని అర్థం. గడచిన కాలానికి సంబంధించిన దుఃఖంతో లేదా రాబోయే రోజుల గురించి భయంతో గడిపిన ప్రతిక్షణం అమూల్యమైన “జీవితం” వ్యర్థం చేసుకొన్నట్టే!

ఏం చేద్దాం?

జీవిద్దామా?

బ్రతికేద్దామా?

నేనైతే “జీవిస్తున్నాను”!


Leave a comment