స్వీయ అన్వేషణ – 153
“నేను ఏళ్ల తరబడి దేవుడికి పూజలు చేస్తున్నాను. అయినా కష్టాలు తీరటం లేదు!”
“నేను ఎన్నో మంత్ర సాధనలు చేశాను. సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు!”
” ఎన్ని తీర్థయాత్రలు చేశానో, ఎంతమంది దేవుళ్ళకి మొక్కానో…ఒక్క దేవుడూ కరుణించ లేదు!”
… ఇలాటి మాటలు వింటూనే ఉంటాం. బాధలు, కష్టాలు, సమస్యలు తీరకపోవటం వల్ల ఈ మాటలు వస్తాయి. సహజం!
ఇలా ఎందుకు జరుగుతోంది? మొదట “పూజ” విషయం చూద్దాం…
కొందరు…
” పూజ” అంటే ఏమి చేస్తున్నారు?
దేవుడి దగ్గర ఒక దీపం వెలిగించి ఇంత బెల్లం ముక్కో, ఒక చెంచాడు పంచదారో “నైవేద్యం” పెట్టేసి… వాళ్ళకి ఉన్న కష్టాలు అన్నీ చెప్పేసి, తీర్చేయమని అడుగుతారు.
మరికొందరు గంటలకి గంటలు రకరకాల పూజలు చేస్తూ, స్తోత్రాలు చదువుతూ ఉంటారు.
ఇక్కడ ” కష్టాలు తీరడం” అనేదే ప్రధానంగా ఉంటుంది కానీ… ఆ దేవుడో, దేవతో … వాళ్ళ మీద భక్తి లేదు…అవును… లేదు! ఈ మాట అంటే నొచ్చుకుంటారు కానీ… ఇది నిజం!
మరొక ధోరణి కూడా ఉంది… ఒక దేవుడు కష్టాలు తీర్చకపోతే… వాడిని వదిలేసి… మరో దేవుడిని పట్టుకోవడం… వాడూ తీర్చకపోతే… ఇంకో దేవుడు… ఇలా దేవుళ్ళ జాతర… మత మార్పిడి లాగే … సాగుతూనే ఉంటుంది.
ఆ మధ్య అంటే 2020 లో ఒక సినిమా వచ్చింది… దాని పేరు “అమ్మోరు తల్లి”… నయనతార, బాలాజీ నటించారు… దానిలో బాలాజీ తల్లి పాత్ర ఊర్వశి నటించారు. ఆమె చేత ఒక డైలాగ్ చెప్పించారు… ఆమె శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటోను చూస్తూ… “ఇదుగో…నువ్వు మా కష్టాలు తీర్చకపోతే… అదుగో అక్కడ సాయిబాబా రెడీగా ఉన్నాడు. ఆయన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి, నిన్ను పక్కన పెట్టేస్తా! చూసుకో మరి!” అంటుంది.
ఇది మనలో నూటికి తొంభై తొమ్మిదిన్నర మంది మనస్తత్వం అదే! కాదంటారా? కాదనగలరా?
అంటే… మన దృష్టి ఆ దేవుడు/దేవత మీద కాక మన “కష్టం” మీద ఉంది. దృష్టి ఆ దేవుడు/దేవత మీద దృష్టి పెడితే… అప్పుడు పలుకుతారు!
తాళం చెవి అక్కడ ఉంది!
రెండవది… మంత్ర సాధన…ఇదెలా చేస్తున్నాం?
నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు… ఆ సాధన చెప్పండి… ఈ సాధన చెప్పండి… అని!
“ఇంతకు ముందు ఏదైనా సాధన చేశారా?” అని అడుగుతాను. “ఫలానా సాధన చేశాను” అంటారు. ” మీ గురువుగారు ఎవరు” అంటాను.
ఏదో పేరు చెబుతారు.
” మరి వారిని అడగక నన్నెందుకు అడుగుతున్నారు?” నా ప్రశ్న.
ఇక్కడ మూడు రకాల సమాధానాలు వస్తాయి.
ఒకటి… ” ఆయన చాలా బిజీగా ఉంటారండి!”
( నేను ఖాళీగా కూచుని ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారా? అని వెయిట్ చేస్తూ కూచున్నానా!)
రెండు… “వారు పీఠాధిపతులు అండీ! కలవటం కుదరదు!
(మీరు మంత్రం తీసుకున్నప్పుడు ఆయనను కలిశారు. ఒకరికి ఒక మంత్రం చెప్పాక వారి సందేహాలు తీర్చవలసిన బాధ్యత ఎవరిది? అయినా అంత “కలవటానికి కుదరని వారి” దగ్గరకు ఎవడు వెళ్ళమన్నాడు?)
మూడు… ” అబ్బే! ఆయన నాకు మంత్రం చెప్ప లేదండీ! కాగితం మీద రాసిచ్చి చేసుకోమన్నారు!”
ఇందులో ఇంకో రకం కూడా ఉంది… ” ఆయన డైరెక్ట్ గా చెప్పలేదండీ! ఆ మంత్రం పక్కనే ఉన్నవాళ్ళని రాసి ఇమ్మన్నారు. వాళ్ళు రాసి ఇచ్చారు!”
ఇందులోనే మరో రకం కూడా ఉంది…” నేను ఆయన్ని కలవలేదండీ! ఫోన్ లో మంత్రం చెప్పారు. ఉపదేశం ఏమీ లేదు!”
మొదటి రకంలో “ఒకడు కాకపోతే ఇంకొకడు!”
రెండవ రకంలో ” ఎవడు దొరికితే వాడు…మనకి పని కావాలి. అంతే!”
మూడవ రకం… మంత్రం ఇచ్చిన వాడి మీద గౌరవం లేదు!
ఇంకెలా ఫలిస్తాయి సాధనలు?
ఒకరి దగ్గర… ఏ విధంగానైనా… ఫోన్లో అయినా, కాగితం మీద రాసి ఇచ్చినా, రాయించి ఇచ్చినా…ఆ వ్యక్తి దగ్గర మంత్రం తీసుకున్నారు కనుక ఆ వ్యక్తి ఖచ్చితంగా “గురువే!” ఆ విశ్వాసం, గౌరవం, నిష్ఠ లేకుండా సాధన ఎలా ఫలిస్తుంది?
తాళం చెవి అక్కడే ఉంది…
” గురు వాక్యం తు కర్తవ్యం!”
ఇక తీర్థ యాత్రల విషయం… తీర్థ యాత్రలకు ఒక విధానం ఉంటుంది. శాస్త్రాలలో ఆ విధానాలను నిర్దేశించారు. ఆ విధానం పాటించకుండా చేసే తీర్థయాత్రల వల్ల ప్రయోజనం ఏముంటుంది?
నిజానికి మనం తీర్థయాత్రలు చేయటం లేదు. ఆ పేరిట ” విహార యాత్రలు” చేస్తున్నాం. ఉదాహరణకు తిరుమల యాత్ర చూద్దాం…
తిరుమలకు ఎలా వెడుతున్నాం? రైలులో, బస్సులో, కారులో తిరుపతికి వెడుతున్నాం… తప్పేమీ లేదు. తప్పదు కూడా. అక్కడి నుంచి బస్సులో, కారులో, టాక్సీలో, కొంతమంది మెట్ల మార్గంలో తిరుమల చేరుతాం. తప్పేమీ లేదు.
తిరుమల చేరాక ఏం చేస్తాం? అసలు ఏమి చేయాలి?
ముందు స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలి. తలనీలాలు సమర్పించుకునే మొక్కు ఉంటే అది తీర్చుకొని ఆ తరువాత స్వామి పుష్కరిణిలో స్నానం చేయాలి. ఆ తరువాత పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఆ తరువాత శ్రీవరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తరువాత స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తరువాత దక్షిణ, కానుకలు హుండీలో సమర్పించాలి. ఆలయంలో ప్రసాదం స్వీకరించి బయటకు రావాలి.
ఈ “ప్రోసెస్”లో స్వామి మూర్తి కనిపించినప్పటి నుంచి తిరిగి వచ్చేవరకూ దృష్టి “సమస్య” మీదే! స్వామి మీద కాదు! కానీ ఆ స్వామికి సరిగా ఎదుట నిలిచిన ఆ ఒక్క క్షణం మాత్రం మన “మైండ్ బ్లాంక్” అవుతుంది! అంతే!
స్వామి దర్శనానికి క్యూలో నిలబడినప్పటి నుంచీ దర్శనం అయే వరకూ హడావిడి! దర్శనం అయాక బయటకు వచ్చేవరకూ కూడా అదే హడావిడి! లడ్డూ కౌంటర్ కి పరుగులు! ఇంకెక్కిడి భక్తి?
తాళం చెవి ఇక్కడే ఉంది… స్వామిని ఏమీ అడక్కు! “సర్వదా సర్వస్వ శరణాగతి” చెయ్! ఆయన పలక్కపోతే చూడు!
తాళం చెవి ఒక్కటే… శ్రద్ధ, నిష్ఠ, విశ్వాసం, అంకిత భావం, గురువైనా – దైవమైనా సర్వస్వ శరణాగతి!
Leave a comment