” స్పందించకు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ -154

నేను నేర్చుకున్న ఒక పాఠం… “స్పందించకు!”

ఒకప్పుడు నా అంత కోపిష్టి లేడు! నోరూ అదుపులో ఉండేది కాదు! ఒక్కోసారి చెయ్యి లేచేది కూడా!

ఇంటా, బయటా అదే ధోరణి!

జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురు అవుతూ ఉంటాయి. మనసు గాయ పడుతుంది, అవమాన పడుతుంది, కోపం కమ్ముకొస్తుంది… ఇలా ఎన్నెన్నో సందర్భాలు!

ఏం చేస్తాం? వెంటనే “రియాక్ట్” అయిపోతాం. ఎదుటివాడు గాయపరిస్తే దానికి ప్రతీకారం…అవమానిస్తే మరింత అవమానించడం… కోపం కమ్మేస్తే అది తీరేవరకూ తిట్టిపోయడం…ఇదే కదా చేసేది?!

కాసేపు ఈ సంగతి పక్కన ఉంచి, మరో విషయం మాట్లాడుకొని, మళ్ళీ ఇటు వద్దాం…

రాజమహేంద్రవరం… గోదావరి…

సజీవ జలరాశి…

నిరంతర ప్రవాహిని…

మనతో మాట్లాడుతుంది…

మనతో నవ్వుతుంది…

మన విషాదాన్ని పంచుకుంటుంది…

మనతో అలల చేతులతో ఆడుకుంటుంది…

మనతో కలసి ఒక సరళ నాదంతో పాడుతుంది…

గోదారొడ్డు వాళ్ళకి తెలుసు… అందరికీ కాదండోయ్… దానితో “సమలయ” లోనికి వెళ్లగలిగిన వాళ్ళకి!

ఎన్నో ఘాట్లు… ఎప్పుడూ జనం ఉంటూనే ఉంటారు… అదో శబ్ద సంకుల ప్రపంచం…

మా మాష్టారు శరభయ్య గారికీ, నాకు రెండు ప్రత్యేక ఘాట్లు ఉండేవి. ఒకటి శ్రీ మార్కండేయ స్వామి ఆలయం దగ్గర, రెండవది కోటిలింగాల రేవు.

సాయంత్రం ఆయన కాలేజ్ పని అయిపోయాక వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి ఏదో ఒక ఘాట్ లో కూర్చునే వాళ్ళం. నేను ఏదో ప్రశ్న వేసేవాడిని. అంతే… సమస్త సంస్కృతాంధ్ర కావ్య ప్రపంచాన్నీ నా ముందు ఆవిష్కరించేవారు మాష్టారు! కోటిలింగాల రేవు అయితే అక్కడి దాకా మా ” వాకింగ్”లోనూ అదే!

చుట్టూ మనుషులు… వాహనాలు…ఒకటే రొద. అవన్నీ మాష్టారి మధుర మంద్ర స్వరం ముందు నిశ్శబ్ద ముద్ర వహించేవి. చుట్టూ ఉన్న ప్రపంచం మాయమైపోయి, మాష్టారూ – నేనూ – ఆయన స్వరం… అంతే! సాహిత్య ప్రపంచంలో ” ఆవరణ భంగం” అంటారే… అలాటిది! ఆ భిక్ష, ఆ శిక్షణ ఆయన ప్రసాదమే! అదొక ఏకాగ్రత! అదొక నిశ్చలత! అదొక రస ప్రపంచం!

అక్కడ ” స్పందన” లేదు! “అనుభవం” మాత్రమే ఉంది!

“కావ్యానందం” మాత్రమే ఉంది!

ఒక్కొక్కసారి రాత్రి సద్దు మణిగాక  పది,పదకొండు గంటల వేళ ఏదో ఒక ఒడ్డున కూర్చునే వాణ్ణి. ఆ ప్రవాహాన్ని చూస్తూ… మనసులో ఏ కదలికా ఉండేది కాదు… ఏ ఆలోచనా ఉండేది కాదు… Just Seeing…చూస్తూ ఉండటమే! సుఖం లేదు… దుఃఖం లేదు… కానీ… నిర్లిప్తత కాదు… నిరామయత కాదు… అదొక అలౌకికత! ఆ జలమూ… నేనూ ఒకటే… దానితో ప్రవహించటమే! నిజానికి ఆ ప్రవాహమే ఉంది… నేను లేను…”నేను” లేకపోతే ఈ “లోక”మూ లేదు… దాని విక్షేపమూ లేదు!

అదొక ” స్పందనా రహిత స్థితి”!

మళ్ళీ మొదటికి వెదదాం…

ఏ సందర్భానికి అయినా వెంటనే స్పందించి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటాడు మనిషి. ఒక్క క్షణం ఆగితే అవేవీ ఉండవు.

అలా వెంటనే స్పందించకుండా ఉండాలి అంటే రెండే మార్గాలు… ఒకటి ప్రకృతితో మమేకం అయే “రస సాధన”, రెండవది “మంత్ర సాధన”.

ఈ రెండూ మనని నియంత్రిస్తాయి. ఒక్క క్షణం ఆగేటట్టు చేస్తాయి. వెంటనే స్పందించకుండా శిక్షణను అందిస్తాయి. 

“తక్షణ స్పందన” అనే దురలవాటుని మానగలిగితే…చాలు… జీవితం “ఆనందమయం” అవుతుంది!


Leave a comment