స్వీయ అన్వేషణ – 155
“ఇదేం స్టేట్మెంటూ?” అని కోప్పడకండి.
అవును!
ఈ లోకంలో ఎవరూ ఎవరికీ “శత్రువు”లు కారు!
అందరూ “అజాత శత్రువులే!”
పుట్టినప్పుడు మనకు వ్యక్తిగతంగా శత్రువులు లేరు!
పోయాక శత్రువులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే!
ఈ రెండిటి మధ్య సాగే బ్రతుకులో వీళ్లు నాకు ” శత్రువులు” అని కొందరికి ముద్ర వేసి వ్యవహరిస్తాం.
“శత్రువు” అనేది ఒక వ్యక్తి కాదు…
“శత్రువు” అనేది ఒక భావన మాత్రమే!
నిజానికి లోకంలో ఇతరుల మంచి కోసం ప్రయత్నించే వారు ఎలా ఉంటారో అలాగే ఇతరుల ఎదుగుదలను చూసి అసూయ పడే వారూ ఉంటారు!
నిస్వార్థంగా బ్రతికే వారు ఎలా ఉంటారో స్వార్థపరులూ అలాగే ఉంటారు! నెమ్మదస్తులు ఉన్నట్టుగానే కోపిష్టి మనుషులూ ఉంటారు!
సన్మార్గులు ఉన్నట్టే దుర్మార్గులూ ఉంటారు!
“ద్వందం” అనే ఈ వైవిధ్యం లేకపోతే లోకమే లేదు!
ఇంతకీ మనం ” శత్రువులు” అని అనుకొనే వారు నిజానికి కేవలం అసూయాపరులు, స్వార్థపరులు, కోపిష్టులు, దుర్మార్గులు మాత్రమే!
అయితే ఇలాటి వారి వల్ల మనకు హాని కలిగినా, మన అభివృద్ధికి ఆటంకం కలిగినా వారిని మనం “శత్రువులు” అంటాం. అంతే కదా?
ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాలి మనం…
వాళ్ళు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు పని చేస్తున్నారు. వారు చేసే ఆ పనుల వల్ల మనకి “హాని” కలుగుతోంది! అంతే కదా?
ఈ ప్రక్రియలో “తప్పు” ఎవరిది?
ఖచ్చితంగా తప్పు మనదే!
ఎందుకు?
ఎదుటివాడు చేసిన పని వలన మనకు “హాని” కలుగుతోంది అంటే మనకు హాని చేసే ” సామర్థ్యం” వాడికి ఉన్నట్టే కదా?
వాడి ” సామర్థ్యం” ముందు మనం “అసమర్ధుల”మే కదా?
నువ్వు “బలహీనుడి”వి అయినప్పుడే అవతలివాడు “బలవంతుడు” అవుతాడు!
నువ్వు “అసమర్థుడు”వి అయినంత కాలమూ అవతలివాడు “సమర్ధుడు”గానే నిలబడతాడు!
కనుక ఈ లోకంలో నిజానికి “శత్రువు” అంటూ ఎవడూ లేడు!
ఉన్నదల్లా నీ ” బలహీనత”, నీ “అసమర్ధత” మాత్రమే!
సరిదిద్దుకోవలసింది నిన్ను నువ్వే!
ఈ ఆలోచన వచ్చిన క్షణమే నీకు కష్టాల నుంచి విముక్తి!
Leave a comment