” మార్పుకి పిలుపు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 156

వస్తుంది… ఒక రోజు వస్తుంది… తప్పదు… ప్రతి మనిషి బ్రతుకులోనూ ఆ రోజు తప్పదు!

ఆ రోజు తీసుకొనే నిర్ణయమే అనంతర జీవితాన్ని ప్రభావితం చేస్తుంది!

కొందరి బ్రతుకు నల్లేరు మీద బండి నడకలా సాగిపోతుంది. వారికి ఇబ్బంది లేదు. వీరు ఒక రకం.

కొందరి బ్రతుకు ఎగుడు దిగుళ్ళతో సాగుతూ ఉంటుంది. వారూ ఎలాగోలా తట్టుకొని బండి నడిపిస్తూ ఉంటారు. వీరు రెండవ రకం.

మరి కొందరు ఉంటారు. వారి జీవితం సాగుతూ సాగుతూ ఉన్నట్టుండి ఒక చోట నిలిచిపోతుంది. ” డెడ్ ఎండ్!”

మొదటి రకాన్ని ప్రక్కన పెట్టేద్దాం… కాసేపు.

రెండవ రకాన్ని చూద్దాం ముందు. వీరి జీవితం ఇందాకా అనుకొన్నట్టు ఎగుడు దిగుళ్ళుగా సాగుతూ ఉంటుంది. ఎలాగోలా తట్టుకొని, రాజీ పడిపోతూ, నెట్టుకొస్తూ ఉంటారు. “రిస్క్” చేసే ధైర్యం ఉండదు వీరికి. యథాతథ స్థితిలోనే సుఖ సంతోషాలను వెతుక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదురొచ్చిన రెండు ఇబ్బందుల మధ్య ఉండే “తెరిపి”నే సుఖం అనుకొని సంబరపడి పోతూఉంటారు. వీరి బ్రతుకులో ఎదుగుదల ఉండదు. “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్టు ఉంటుంది బ్రతుకు.

ఇక మూడవ రకం… సాధారణంగా సాగిపోతున్న బ్రతుకులో ఏదో అడ్డం పడిపోతుంది. “డెడ్ ఎండ్!” ముందుకు పోవటానికి దారి కనపడదు. అంతా చీకటి. చేస్తున్న పని ఆగిపోతుంది. ఏమీ తోచదు.

అప్పుడు నూటికి తొంభై మంది చేసేది ఏమిటి?

ఆగిపోయిన పనిని ఎలాగైనా కొనసాగించాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో కొట్టుకులాడుతూ ఉంటారు. ఇసుమంత ప్రయోజనం లేకపోయినా పోరాడుతూనే ఉంటారు. పోరాడి, పోరాడి, ఏ ఫలితమూ కనపడక, అలసిపోతూ ఉన్నా, ఆ దారిని వదలి పెట్టరు. “అదేమిటయ్యా?” అంటే “ఇది ‘ప్యాషన్’. నాకిష్టమైన పని” అంటారు. ఏళ్లకు ఏళ్లు కాలం ఈ పోరాటంలోనే కరిగిపోతుంది. నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి. ఫలితం ” డిప్రెషన్!” ఆ వ్యక్తితో పాటు కుటుంబం మొత్తాన్ని చీకటి కమ్మేస్తుంది.

ఇన్ని రకాల మనుషులూ మన ప్రక్కనే వున్నారు. బహుశః మన లోనూ ఉన్నారు. బహుశః మనమే కావచ్చు కూడా!

వీటిలో ఒకసారి రెండవ రకం, ఇంకోసారి మూడో రకంలోనూ పడ్డాను నేను కూడా!

అయితే, గతంలో ఎప్పుడో నేను చెప్పినట్టు… ఒక సవాలు ఎదురైతే… నిద్ర పట్టని తత్వం కదా నాది!

రెండో రకం పరిస్థితుల్లో ఉన్నప్పుడు… ఇబ్బందుల మధ్య “తెరిపి”నే సుఖం అనుకోలేదు నేను. ఎగుడు దిగుడుగా నడిచే బ్రతుకుతో సరిపెట్టుకోలేదు నేను. ఆ గతుకుల దారి నుంచి బయటపడాలి… బండి సజావుగా “మొదటి రకం”లా సాగుతూ ఉండాలి!

అంటే “రిస్క్” చేయాలి! చేయగలనా? అనే ప్రశ్న ఎప్పుడూ నన్ను వేధించలేదు! ఒక “మొండితనం”! అంతే!

ఆంధ్రపత్రికలో అయినా, ఆంధ్ర ప్రభ వీక్లీలో అయినా, వెలుగు ప్రాజెక్టులో అయినా, భక్తి టివీలో అయినా, ఎస్విబి సి లో అయినా… ఎక్కడైనా “ప్రతికూల”, “అసంతృప్త” పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ ఆలోచనా లేకుండా, ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండానే వదిలేశాను! “రిస్క్” చేశాను!

“ప్రవాహ వాణి” సాహిత్య పత్రిక ప్రారంభించి, కష్టం మీద లాగి లాగి, ఇక దానిని సాగించే దారి మూసుకుపోయిన పరిస్థితి వచ్చినప్పుడు… అది మూడో రకం పరిస్థితి!

అంటే ఆ దారి మూసుకుపోయింది! “డెడ్ ఎండ్!”

అలా అని దాన్నే పట్టుకొని వేలాడుతూ, ఎలాగోలా… అది నా “ప్యాషన్” అయినా కూడా… లాగించాలని పోరాడలేదు! ఏ మాత్రం ఆలోచనా లేకుండా దానికోసం తీసుకొన్న ఆఫీస్ ఖాళీ చేసేశాను. దగ్గరున్న పుస్తకాలన్నీ ఇంటికి “షిఫ్ట్” చేసేశాను. అప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఉపాధి ఏమీ లేదు!

మళ్ళీ అదే “రిస్క్!”

బ్రతుకులో “సాహసం” అవసరం!

దారి సరిగా లేకపోయినా…దారి మూసుకుపోయినా… దారి మార్చేయాలి!

నీకున్న బలాలూ, బలహీనతలూ, అవకాశాలూ, ఇబ్బందులూ అంచనా వేసుకోవాలి. నీ బలానికి తగిన అవకాశాలు అన్వేషించాలి. నీ బలహీనతలు నీకు ఇబ్బందులు కాకుండా వాటిని అధిగమించాలి! “క్రొత్త దారి” అదే తెరుచుకుంటుంది!

దానికి నీ జీవన శైలి మార్చుకోవలసి ఉంటుంది. అలా మార్చుకోవడానికి మానసికంగా తయారు కావాలి. అలా తయారు కావటానికి నీ రోజువారీ బ్రతుకులో కొన్ని నియమాలు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పరచుకున్న నియమాలను ఖచ్చితంగా పాటించాలి.

ఈ మార్పుకు ఖచ్చితంగా నీ కుటుంబం నుంచి, నీ బంధువుల నుంచీ, నీ పరిచయస్తుల నుంచీ ఎవరి నుంచైనా “వ్యతిరేకత” రావచ్చు… “అసంతృప్తి” ఏర్పడవచ్చు… నీ పట్ల వారు “ఉదాసీనం”గా మారిపోవచ్చు. దానినీ దాటాలి… ఎలా?

దానికి ఒక ప్రణాళిక! నేను అనుసరించినది…

ఎదుటివారు పలకరిస్తేనే మాట్లాడు! నీ అంతట నువ్వు ఏ సంభాషణ ప్రారంభించకు! 

ఎవరికీ సలహాలు ఇవ్వకు!

ఎవరినీ సంప్రదించకు!

సమూహంలో ఉన్నా కూడా ఈ నియమాలు పాటించు!

ఎవరి జీవితాల్లోకీ తొంగి చూడకు!

ఇతరుల కోసం నువ్వు ఇరుక్కున్నపుడు వారే బయట పడేస్తారని ఎదురు చూడకు! వెంటనే నిర్మొహమాటంగా వాళ్ళని వదిలించుకో! ఆ ఇబ్బంది నుంచి బయటపడే దారి నువ్వే వెతుక్కో… ఎంత కష్టం అయినా సరే!

అయితే నీ బ్రతుకులో కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు… ఎలాటి స్థితిగతుల్లో అయినా నీ ప్రక్కనే నిలబడేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఈ నియమాలకు “మినహాయింపు” ఇవ్వక తప్పదు!

ఆ “ఒకళ్ళిద్దరు” లో నా గురువు ఒకరు! ఆయనకు నా అంతట నేను నా పరిస్థితి గురించి చెప్పవలసిన పనే లేదు!

నేను చేసిన, చేస్తున్న పని ఇదే!

” మార్పుకు పిలుపు” వచ్చినప్పుడు మారకపోతే, “అడాప్ట్” కాకపోతే… “బ్రతుకుతూ” ఉంటావేమో కానీ “జీవించలేవు!”


Leave a comment