“వదలించేవాడే గురువు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 157

నేను ఆంధ్రపత్రిక దినపత్రికలో 1985 మధ్య నుంచి 1991 మధ్య వరకూ ఆరేళ్ళ కాలం పని చేశాను. ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాను అనేది గతంలోనే చెప్పాను. అది ఆనాటి సంపాదకుని వ్యవహార శైలికి నిరసన!

ఆ కాలంలో పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ తో పరిచయ భాగ్యం కలగలేదు.

ఆ తరువాత 1991 చివరి నుంచి 1998 ప్రారంభం వరకూ మరో ఆరేళ్ళ కాలం ఆంధ్రప్రభ వీక్లీలో పని చేశాను.

ఇక్కడ… అనంతర కాలంలో గుర్తించిన ఒక విషయం… రెండు ఉద్యోగాలలోనూ ఆరేళ్లే పని చేశాను!

ఆ తరువాత ప్రవాహ వాణి రెండేళ్లు మిత్రుడితో కలిసి నడిపిన “సొంత”  ప్రయత్నం. ఒకరి దగ్గర చేసే “ఊడిగం” కాదు.

తరువాత వెలుగు ప్రాజెక్ట్, భక్తి టివీ, ఎస్వీబీసీ… ఈ మూడూ కలిపి మళ్ళీ ఆరేళ్ళే!

ఆంధ్రప్రభ వీక్లీలో పని చేస్తున్న కాలంలోనే పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ పరిచయ భాగ్యం కలిగింది. నేను అక్కడ ఉద్యోగం వదలి వేసిన కారణం కూడా గతంలో చెప్పాను. ఆ కారణం వెనుక ఉన్న రహస్యం కూడా ఎప్పటికో కానీ అర్థం కాలేదు.

ఒక కల గురించి చెప్పాను అప్పుడు. ఆ కలలో గురూజీ వెనుక పడి ” ఇది” ఎప్పుడు వదులుతుంది?” అని  అడిగాను. “40 రోజుల తరువాత” అని ఆయన జవాబు. సరిగ్గా 41వ రోజు ఆ ఉద్యోగం వదిలేశాను.

అప్పటివరకూ ఎలాటి ఇబ్బందులూ లేకుండా ఉన్న ఉద్యోగం. నాకు తెలియదు… ఇది ఎప్పుడు వదులుతుంది?… అని అడిగినప్పుడు… “ఏది వదలాలి” అనుకొన్నానో నాకు తెలియదు. అంతా బాగున్నప్పుడు “ఇది వదిలించుకోవాలి” అనే ఆలోచనే ఎందుకు వచ్చింది?

అది కూడా “సుప్త చేతన” నుండి వచ్చింది అంటే ఆ “ప్రేరణ” ఎక్కడి నుంచి వచ్చింది?

ఎవరో “వదిలించాలని” అనుకుంటే తప్ప!

” విముక్తి” కలిగించాలని అనుకొంటే తప్ప!

అది కేవలం ” శ్రీ గురు సంకల్పం” కాక మరేమిటి?

గురువు “ఊడిగం” నుంచి ” విముక్తి” కలిగించాలని అనుకొన్నా… ఇంకా “కర్మ ఫలాలు” దగ్ధం కావాలి కదా?

మళ్ళీ ఉద్యోగాలకు వెళ్లి… కొన్నాళ్ళకు… కొన్నేళ్ళకు… కళ్ళు తెరుచుకొని… బుద్ధొచ్చి…అప్పటికి “కర్మ” ముగిసిందేమో… అన్నీ వదలుకొని… ఇలా… ఇప్పుడు…సాగుతోంది బండి “స్వతంత్రం”గా!

ఒకప్పుడు భక్తి టివీ మిత్రుడు నితీశ్ అడిగాడు గురూజీని ” మా సార్ ని అలా వదిలేశారేమిటి?” అని.

” నేను చూసుకోకుండానే ఆయన ఇలా ఉన్నాడా?” అన్నారు గురూజీ!

అదొక్కటే…

ఆ మాట ఒక్కటే…

అదొక్కటే విశ్వాసం…

అదొక్కటే ఆలంబనం…

అదొక్కటే జీవన సూత్రం!

అవును… వదలించేవాడే గురువు!

శ్రీ గురు చరణ కమలేభ్యో నమః!


Leave a comment