స్వీయ అన్వేషణ – 158
ఒకసారి మిత్రుడు వివేకానందంతో కలసి క్రేన్ వక్కపొడి వ్యవస్థాపకులు సుబ్బారావు గారిని కలిసే సందర్భం వచ్చింది.
మాటల మధ్యలో ” వక్కపొడికి, కొంగకీ ఏమిటి సంబంధం?” అని అడిగాను.
ఆయన పెద్దగా చదువుకున్నవారు కారు. కానీ గుంటూరులో ఎం బి ఏ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. చదువు కాదు… వ్యాపార అనుభవం!
నా ప్రశ్నకు ఆయన సమాధానం ఇదీ…
” సింపుల్! అన్ని పక్షులూ తెల్లవారగానే తిండి వెతుక్కుంటూ పోతాయి. వాటికి ఎక్కడ పడితే అక్కడ తిండి దొరికే అవకాశం ఉంటుంది.
” కానీ కొంగకి అలా కాదు. ముందు నీరు పుష్కలంగా ఉన్న చెరువో, నదో దొరకాలి. అలా దొరికినా అక్కడ చేపలు ఉండాలి. ఈ రెండూ ఉన్నా తిండి దొరకటం అంత సులువు కాదు. చేపలు నీటిలో వేగంగా కదులుతూ ఉంటాయి. కొంగ ఒక చోట నిశ్చలంగా నిలబడాలి. అన్ని చేపలలో ఒక దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. దాని వేగాన్ని ఖచ్చితంగా అంచనా వేయాలి. ఆ వేగాన్ని లెక్క వేసుకొని, దానికి అనుగుణంగా చటుక్కున ముక్కు విసిరి ఆ చేపను నోట పట్టాలి.
” ఒక్కోసారి నీరు పుష్కలంగా ఉన్నా ఆ నీటిలో చేపలు ఉండకపోవచ్చు. అప్పుడు చేపలు దొరికే మరో జల వనరును వెతుక్కుంటూ వెళ్లాలి. తప్పదు!
” దీనికి ఎంత ఓపిక ఉండాలి? ఎంత ఏకాగ్రత ఉండాలి? ఎంత స్థిరత్వం ఉండాలి? ఎంత వేగం ఉండాలి?
” ఇవన్నీ వ్యాపారానికి కూడా అత్యవసరం. నీకు సరైన మార్కెట్ అవకాశం దొరకాలి. దానిలో ప్రవేశించి ఓపికగా నిలవాలి. ఒక గొప్ప రోజు, ఒక గొప్ప అవకాశం వస్తుంది. ఖచ్చితంగా అంచనా వేసి ఆ రోజును, ఆ అవకాశాన్ని వాడుకోవాలి.
” ఈ ఆలోచనకి గుర్తు ఆ కొంగ. అందుకే నా బ్రాండ్ కి ‘ క్రేన్ ‘ అని పేరు పెట్టాను. నా వ్యాపార సూత్రాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది అది”
ఆయన ఈ వక్కపొడి వ్యాపారం మొదలు పెట్టేనాటికి ఆంధ్ర ప్రాంతంలో “త్రివేణి” వక్కపొడి చాలా ప్రాచుర్యంలో ఉంది. మార్కెట్ లో నూటికి తొంభై శాతం దానిదే. మిగిలిన పది శాతంలో ” రసిక్ లాల్” వంటి బ్రాండ్స్ ఉండేవి.
మరి ఈ ” కొంగ” ఏ రోజును, ఏ అవకాశాన్ని అంచనా వేసి ముక్కు విసిరిందో కానీ కొద్ది రోజులకే మిగిలినవి అన్నీ కనుమరుగై పోయాయి!
ఇది “క్రేన్” సుబ్బారావు గారి దగ్గర నేను నేర్చుకున్న పాఠాలలో ఒకటి!
ఆ పాఠాన్ని నేను ” ప్రవాహ వాణి” విషయంలో వినియోగించుకున్నా! అయితే చిన్న తేడా ఉంది! మార్కెట్ పుష్కలంగా ఉంది. కానీ దానికి తగిన వేగాన్ని అందుకోలేక పోయాం. అప్పుడు చేసిన పని “మరొక వనరు”ను వెతుక్కోవటమే!
నాకున్న బలం, అవకాశం అనువాదం. దానిలో బలహీనత నెట్ వర్క్ లేకపోవటం, అడ్డంకి మార్కెట్ లో పోటీ .
అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చాయి. “వెలుగు” ప్రాజెక్ట్ లో అనువాదాలు. ఆ కాలంలోనే అక్కడే ఉద్యోగ అవకాశం. “నీరూ, చేప రెండూ దొరికాయి సుబ్బారావు గారూ!” అనుకుంటూ చేరిపోయాను.
రెండవ మాట…
స్టీవ్ జాబ్స్ చెప్పాడు… “మత్స్యకారులు చేపలు వేటాడుతారు. ఒక్కోసారి సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. అప్పుడు వారు వారి వేట పడవలను, వలలను మరమ్మత్తులు చేసుకుంటారు. మళ్ళీ వేటకు సంసిద్ధులు అవుతారు.
“అలాగే జీవితంలో ఒక్కోసారి అన్నీ మూసుకు పోతాయి. ఏడుస్తూ కూచోవడం కాదు. ఆ “విరామ సమయం” లో కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. కొత్త అవకాశానికి సంసిద్ధం కావాలి.”
మన సంగతి మనకి తెలుసు కదా! మన దారి మూసుకుపోవడం కాదు… మనమే దారి మూసేసి బయటకు వచ్చేస్తూ ఉంటాం కదా?!
భక్తి టివీ లో ఉన్నప్పుడు నా పని కేవలం స్క్రిప్ట్ వ్రాయడం, ఎడిటింగ్ దగ్గర చూడటం. కానీ… మనకి తెలుసు కదా… వాకాటి వారు చెప్పినట్టు జాయినింగ్ రోజునే రాజీనామా పత్రం జేబులో పెట్టుకొనే వెడతాం కదా?
భక్తి టివిలో ఉన్నప్పుడు జస్ట్ స్క్రిప్ట్ వ్రాయటం, ఎడిటింగ్ దగ్గర కూచోవడం మాత్రమే కాకుండా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. రవి, సుబ్బు, వర్మ, గణేశ్…వీడియో ఎడిటర్లతో కలిసి పని చేస్తూ ఆ పద్ధతులు నేర్చుకున్నాను. తరువాత వచ్చే ” విరామ సమయా”నికి ముందే “పడవ, వల”… అదే…స్టీవ్ జాబ్స్ చెప్పిన నైపుణ్యాలు సిద్ధం చేసుకొన్నాను.
జీవిత గమనంలో ఎందరో ఎదురవుతారు.
ఎన్నో పుస్తకాలూ చదువుతాం.
వారు చెప్పిన మాటలు, ఆ పుస్తకాలలో రచయితలు చెప్పిన అంశాలు మన జీవితంలో ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు ఉపయోగ పడతాయి.
సరైన సమయంలో, సరైన విధానంలో వాటిని వినియోగించుకుంటే చాలు…
Leave a comment