” రెండు జీవన సూత్రాలు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 159

ఒక సన్నిహితుడు సుధీంద్ర తీర్థ. నేను 1985లో ఆంధ్రపత్రికలో చేరినప్పుడు కొన్ని నెలలు చాదరఘాట్ దగ్గర మా మేనమామ / బావగారు విజయకుమార్ రూమ్ లో ఉన్నాను. అదే ఇంటిలో ఆయనతో పాటు అద్దెకు ఉంటున్న వాడు ఈ తీర్థ. అప్పుడు పరిచయం. ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. కారణం ఒకటే మా గోదావరి జిల్లాల డి ఎన్ ఏ లో సహజమైన విసురు, వెటకారం, హాస్యం అన్నీ ఈ “సీమ మనిషి”లోనూ పుష్కలంగా ఉన్నాయ్. ఆయన భార్య భవాని గారు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆవిడ ఒక మాట విసిరిందంటే అంతటి తీర్థ కూడా అవాక్కు కావలసిందే.

ఒకసారి నేనూ, మా మేనమామ, ఆయన, ఇంకా ఒకరిద్దరు బాతాఖానీ కొట్టుకుంటూ కూచుంటే ఒక టాపిక్ వచ్చింది… “అసలు మగవాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటారు?”… రకరకాల కారణాలు వచ్చాయి.

మరి “ఆడవాళ్లు ఎందుకు పెళ్లి చేసుకుంటారు?”

దానికీ ఏవేవో వాదనలు వచ్చాయి. మధ్య గదిలో తీరికగా కూచుని వింటున్నట్టున్నారు భవాని గారు. అక్కడి నుంచే ఒక విసురు విసిరారు… ” ఆడాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉంటే పదిమంది వెధవలు పాడు చేస్తారు. అదేదో ఒకడి దగ్గరే… అందుకని ఆడాళ్లు పెళ్లి చేసుకుంటారు!”

అంతే… ఇంత “గంభీరమైన” చర్చ చేస్తున్న వాళ్ళం కాస్తా ఆవిడ అంత “గౌరవప్రద స్థానం” కల్పించాక … లేచాక్కా వచ్చేశాం.

“అట్లుంటది ఆమెతోని!”

ఆమె మాటలలో ఉన్న “కఠిన సామాజిక సత్యం” కాదనే దమ్ము ఎవరికి ఉంటుంది కనుక?!

తీర్థ వెటకారమూ తక్కువ కాదు. ఒకాయన ఏదో మాటల్లో ” నా బతుకు కొవ్వొత్తిలా కరిగిపోతోంది!” అన్నాడు. తీర్థ మహ సీరియస్ గా “ఏం? అంత కొవ్వెక్కి పోయిందా?” అన్నాడు. ఎవడైనా అలాటి మాట వింటే ” ఏమైంది? ఎందుకంత బాధ పడుతున్నావ్?” అంటూ ఆరా తీసి ఓదారుస్తాడు. అలా చేస్తే తీర్థ ఎందుకు అవుతాడు?

ఆ సుధీంద్ర తీర్థ ఒకసారి ఒక మహత్తర జీవన సూత్రం చెప్పాడు… ” వందమందితో పరిచయాలు చేసుకుని, వాళ్ళందరినీ మెయింటైన్ చేయటం కన్నా ఆ వందమందితో పరిచయం ఉన్న వాడిని ఒకే ఒక్కడిని పరిచయం చేసుకుని, వాడొక్కడినీ మెయింటైన్ చేసుకుంటే చాలు!”

సులువైన సూత్రం! నిజమే! శ్రమ తగ్గుతుంది. ఇదొక దృక్పథం!

ఇంకొకటి…

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు ( ఆయనకి తండ్రి గారు హనుమచ్ఛాస్త్రి గారు పెట్టిన అసలు పేరు శ్రీకంఠ శర్మ) చెప్పారు…

” ఎంతో మంది పరిచయం అవుతారు. ఎందుకు చెప్పండి? ఒకడు తగ్గినా తగ్గినట్టే! ఆ మేరకు ప్రశాంతత దొరుకుతుంది!”

ఇదీ నిజమే! ఇదొక దృక్పథం!

ఈ రెండూ నిజానికి నిజాలు కావు అనిపిస్తుంది నాకు. ఈ రెండిటి మధ్య ఒక దారి ఏదో ఉంటుంది. అది అవసరం.

తీర్థ చెప్పినట్టు ” వందమందితో పరిచయం ఉన్న వాణ్ణి మెయింటైన్ చేయటం” నిజానికి కత్తి మీద సాము.  వాడికి అప్పటికే వంద మనస్తత్వాలు తెలుసు… ముదిరిపోయి ఉంటాడు. నువ్వు వాడికి నూట ఒకటవ వాడివి! ఆ వందమందిలో నీకు ఏ ఒక్కడితో పనిబడినా వీడినే ఆశ్రయించాలి! ప్రసన్నం చేసుకోవాలి! ఇంతకీ నీకు ఆ పని చేసిపెట్టాలని వాడికి అనిపించాలి. ఈ లోకంలో ప్రతిఫలం లేకుండా ఎవడూ ఏ పనీ చేయడు. ఆ ప్రతిఫలం నువ్వు ఇవ్వగలగాలి. ఇన్ని ఇబ్బందులున్నాయి! పైగా ఆ ఒక్కడూ నీ “పట్టు” నుంచి తప్పుకుంటే వాడితో పాటు వందమంది పోయినట్టే!

శ్రీకాంత శర్మ గారు చెప్పినది అంతే… ఒక్కడు తగ్గితే అప్పటి వరకూ ఉన్న ఒక “మానవ సంబంధం” తెగినట్టే!

ఏం చేయాలి మరి?

నా జీవితం ఏమిటి? నేను ఏం చేస్తున్నాను? నా పరిధి ఏమిటి? నేను చేసే దానిలో, నా పరిధిలో నాతో కలసి ఉండేవాళ్ళు చాలు!వ్యక్తిగత జీవితంలోనూ అంతే! ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలి. అనవసరంగా ఎవరితో పడితే వారితో పరిచయాలు పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ “అనవసర” అన్నానని “అయితే అవసరం ఉంటేనే పరిచయాలా?” అనకండి. “అనవసర” అంటే నీ జీవితంలో భాగం కాని, కాలేని అని మాత్రమే అర్థం.

అప్పుడు “ఒక్కడు” పోతాడనే భయమూ లేదు! ఒకడు తగ్గిపోయే అవకాశమూ లేదు! నీవాళ్లు మాత్రమే నీతో ఉంటారు! నీవాళ్లతో మాత్రమే నువ్వు ఉంటావ్! చాలు!


Leave a comment