స్వీయ అన్వేషణ – 160
జగత్ప్రభువు శ్రీరామచంద్రుని జన్మదినం వేడుక!
జగద్గురువు శ్రీకృష్ణుని జన్మదినం వేడుక!
ఆదిశంకరులు, శ్రీ రామానుజులు, శ్రీ ఆనంద తీర్థుల జన్మదినాలు వేడుక!
మహాయోగులు అరవిందులు, రమణుల జన్మదినాలు వేడుక!
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జన్మదినం వేడుక!
ధర్మ పరిరక్షణకు ప్రాణాలొడ్డి పోరాడిన మహావీరుల జన్మదినాలు వేడుక!
మరి…మన పుట్టిన రోజులు… వేడుక? వేదన?
నిజానికి వేడుక కాదు! వేదన మాత్రమే!
ఎందుకు?
ఈ జన్మ కర్మఫలాలను అనుభవించటానికి అని మన శాస్త్రం చెబుతోంది… అది పుణ్య కర్మనా? పాప కర్మనా? అనేది వేరే సంగతి.
ఈ లోకంలోకి వచ్చిన వాడు ఎవడూ కూడా సంపూర్ణ పుణ్యంతోనో, సంపూర్ణ పాపంతోనో రాడు… రెండూ కలగలిసే వస్తాడు. రెండూ వాటి వాటి తీవ్రతలను బట్టి ఈ జన్మలో అనుభవించ వలసిందే! అలాటప్పుడు పుట్టిన రోజు వేడుక ఎలా అవుతుంది?
అలాగే ఎందుకు పుట్టామో తెలియదు… ఈ జీవిత లక్ష్యం ఏవిటో తెలియదు… అనుభవిస్తూ పోతూ ఉంటాం! అలాటప్పుడు పుట్టిన రోజు వేడుక ఎలా అవుతుంది?
ప్రతి పుట్టిన రోజూ ఆ భగవంతుడు మనకు ఇచ్చిన ఒక మహత్తర అవకాశం!
“ఇక ముందు అది వేడుక అవుతుందా?
లేక వేదనగానే మిగులుతుందా?” అనేది నిర్ణయించే రోజు!
“ఒక ఏడాది గడిచిపోయింది కదా? ఈ మూడు వందల అరవై అయిదు రోజులలో నువ్వు సాధించినది ఏమిటి?” అని భగవంతుడు నిలదీసి ప్రశ్నించే రోజు పుట్టిన రోజు!
“ఒక ఏడాది గడిపేశావు కదా? ఈ ఏడాదిలో నీ వల్ల లోకానికి జరిగిన మేలు ఏమిటి?” అని భగవంతుడు ప్రశ్నించే రోజు పుట్టిన రోజు!
“మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది కదా? ఆ కరిగిపోయిన కాలంలో నీకు నువ్వు ధర్మ బద్ధంగా నీ ఆత్మోన్నతికి చేసిన ఒక్కటంటే ఒక్క పని చెప్పు!” అని భగవంతుడు నీ కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ అడిగే రోజు పుట్టిన రోజు!
” ఒరేయ్ నాయనా! మేము ఎన్నో తపస్సులు చేసీ చేసీ సాధించుకున్న విజ్ఞానం అంతా నీకు ధార పోయటానికి సిద్ధంగా ఉన్నాం కదా! ఈ ఏడాది కాలంలో అటువైపు ఒక్కటంటే ఒక్క అడుగు వేశావురా?” అని మన పూర్వ ఋషులు నీ పట్ల జాలితో అడిగే రోజు పుట్టిన రోజు!
“ఈ ధర్మం కోసం మా ప్రాణాలొడ్డి పోరాడాము. ధర్మ పరిరక్షణకు మా సర్వస్వం సమర్పించాము. అలా కాపాడుకుంటూ వచ్చిన ధర్మాన్ని వారసత్వంగా నీకిస్తే నువ్వేం చేస్తున్నావ్?” అని ధర్మ పరిరక్షకులైన పాలకులు అడిగే రోజు పుట్టిన రోజు!
డబ్బు, పదవి, పెదవి, అధికారం, వ్యామోహం, వ్యసనం… ఇవేగా ఇన్నేళ్లు మనల్ని నడిపించినవి? ఇందులోనే కదా మనం ఇన్నేళ్లు కొట్టుకులాడుతున్నది?
ఆ కొట్టుకులాటలో మరొక ఏడాది కరిగిపోయింది…
ఇప్పుడు చెప్పండి… మన పుట్టిన రోజు… వేడుకా? వేదనా?
Leave a comment