“శరణం భవ…!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 161

ఆ పిల్లాడికి ఆరేళ్లో ఏడేళ్లో… వాడికి ఒక చిన్న తువ్వాలు నడుముకి కట్టి, అది జారిపోకుండా మొలత్రాడు పైకి జరిపి దాని మీదకి లాగి, ముక్కాలి పీట మీద కూచో పెట్టింది ఆమె. మినుములు, పెసలు, శనగలు, వట్టి వేళ్ళు, గంధ కచ్చూరాలు మర పట్టించి, దానిలో కొద్దిగా జవ్వాది పొడి కలిపిన సున్నిపిండి గిన్నె సిద్ధంగా ఉంది. ఆమె అరచేతిలో నువ్వుల నూనె తీసుకొని ఆ పిల్లాడి ఒళ్ళంతా పట్టించింది. అది కాస్త ఇంకేలా రుద్దింది. ఆ తరువాత ఆ ఘుమ ఘుమలాడే సున్నిపిండితో నలుగు పెట్టింది. అది రాలే దాకా రుద్దుతూనే ఉంది.

ఆ తరువాత ఉడుకుడుకు నీళ్లు పోసింది. శీకాయపొడి తో కలిపిన ఉసిరి పొడితో తలంటు కానిచ్చింది.

అలా తల అంటుతున్నంత సేపూ ఆవిడ గొంతు నుంచి ఒక తరంగం ఆ పిల్లాడి మనసులోకి ప్రసరిస్తూనే ఉంది…

” శరణం భవ

కరుణా మయి కురు

దీన దయాలో

కరుణా రస వరుణాలయ

కరిరాజ కృపాలో…”

ఆ పిల్లాడి మనసు నిండా నిండి పోతోంది ఆ తరంగం… అర్ధం తెలియక పోయినా…

చిన్న తాత తనను తాను మరచి పోయి పాడుకొనే “నీవే తప్ప నితఃపరంబెరుగ…” కీ, ఈ “కరిరాజ దయాలో” కీ లింకు పడిపోతోంది.

“మధుసూదన మధుసూదన హర మామక దురితం”

పాడుతున్నది ఆమెనా? స్వయంగా ఆ శివ నారాయణ తీర్థుల వారా? ఒక పక్క తల జిడ్డు వదిలిస్తూనే, ఆ పిల్లాడి జన్మ జన్మల జిడ్డు వదిలిస్తూ ఉందా? అర్ధం తెలియక పోయినా ఆ మాధుర్యం మనసులోకి ప్రవహిస్తోంది.

తలంటు “ఉత్సవం” పూర్తయింది. అవును… ఆ పిల్లాడికి అది ఉత్సవమే! ఆమె గానోత్సవం! ఆమె మనో యవనిక మీద ఆ పిల్లాడే ఆ మధుసూదనుడేమో?! ఆ తలంటు ఆ పిల్లాడికా? బాల కృష్ణుడికా?! ఏమో! ఆమె మనసులో ఏముందో… ఆ పిల్లాడికేం తెలుసు?

ఒళ్ళంతా తువ్వాలుతో తుడిచింది… తడి తల ఆరబెట్టొద్దూ? హారతి కుంది లాంటి మట్టి మూకుడులో బొగ్గులు రెడీ… సాంబ్రాణి పొడి సిద్ధం…

ఆ సాంబ్రాణి ధూపంతో పాటు మరొక గాన ప్రవాహం… 

“బ్రూహి ముకుందేతి రసనే
బ్రూహి ముకుందేతి…”

తడి జుట్టు ఆరే వరకూ ఆ సాంబ్రాణి ధూపం అన్ని వైపులా తిప్పుతూ…

తానూ తిరుగుతూ…

సదాశివ బ్రహ్మేంద్రులను తనలో ఆవాహన చేసుకున్న ఆమె ఆలనా పాలనలో ఉన్న ఆ పిల్లాడికి అంతకన్నా ఏం కావాలి?

ఇంతకీ ఈ ” తలంటు” ఎందుకు అంటే…

నిన్న ఏమీ తోచక యూ ట్యూబ్ లో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉంటే కనిపించింది శ్రీరంగం గోపాలరత్నం గానం చేసిన ” శరణం భవ…” తరంగం కనిపించింది. విన్నా…

ఆరు దశాబ్దాల వెనక్కి జారిపోయి…

ఆనాటి ఆమె గానాన్ని పునర్జీవించి…

ఆ తరువాత వెతికి వెతికి బాలమురళి గొంతులో ” బ్రూహి ముకుందేతి…” పట్టుకొని…కళ్ళు మూసుకొని వింటూ…

ఆనాటి సాంబ్రాణి ధూప పరిమళ నేపథ్యంలో రవళించిన ఆమె గానాన్ని మనసులోనికి అవతరింప చేసుకొని…

చిన్న మామ్మ కనకవల్లి తాయారును మళ్ళీ చూస్తూ…

ఆ పిల్లాడు ఇప్పుడు మళ్ళీ ఎదురు పడితే ఎంత బాగుండును… అనుకుంటూ… ఈ అరవై ఏడేళ్ల పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు.

“అడ్డం కొట్టేసిన పాట!” రేపు…


Leave a comment