స్వీయ అన్వేషణ – 162
ఈ మధ్య ఏమీ తోచక పాటలు వింటున్నా. ఏవేవో గుర్తుకి వస్తున్నాయి. చిన్నప్పుడు వినబడినవి… యౌవన దశలో విన్నవి… ఇంకా వయసు ఎదిగాక చెవిన పడినవి… ఈ ” ద్వితీయ యౌవన” దశలో వింటున్నవి…ఇలా ఎన్నెన్నో… కర్ణాటక కృతులు, తాళ్ళపాక సంకీర్తనలు, హిందుస్థానీ బాణీలు, వీటన్నిటి మధ్య మనోమోహకమైన గజళ్ళు…ఇలా అన్నీ!
ఆ ప్రయాణంలో మా చిన్న మామ్మ కనకవల్లి తాయారు మళ్ళీ మనసులో సాక్షాత్కరించినట్టే… మా నాన్న సీతారామాచారి కూడా !
ఆయనకు దేవుడూ – దెయ్యమూ, భక్తి – గిక్తి లాంటివి ఉన్నట్టు నాకు ఎప్పుడూ కనపడలేదు.
ఆయన తండ్రి, మా తాత వేంకట రంగాచార్యులు గారు మహా మృత్యుంజయ మంత్రోపాసకుడు, మంత్ర సిద్ధుడు, దివ్య దృష్టి కలవాడు. అవన్నీ గతంలో చెప్పాను.
ఆయన మూడవ కుమారుడు మా నాన్న సీతారామాచారి. ఆయనే ఒక సందర్భంలో నాకు చెప్పిన ఒక మాట ఇదీ…
” నాకు కూడా ఏదైనా మంత్రం చెప్పొచ్చు కదా?” అని మా నాన్నను అడిగాను. దానికి ఆయన ” నీకు నేను చెప్పకూడదు. అయినా నీకూ ఈ మార్గానికీ సంబంధం లేదు. కానీ ఎవరైనా ఉపదేశిస్తే రామ మంత్రం తీసుకో… ఇంకేమీ వద్దు!” అన్నాడు.
ఇదీ మా నాన్నకి, వాళ్ళ నాన్నకి జరిగిన సంభాషణ. అంతకు మించి ఆయన నోట… ఇందాకా చెప్పినట్టు దేవుడూ – దెయ్యమూ, భక్తీ – గిక్తీ వంటివి ఎప్పుడూ వినలేదు.
కానీ… ఆయన నోట ఒక పాట మాత్రం చాలాసార్లు విన్నాను. పిల్లలను ఎడమ భుజాన వేసుకొని, కుడి అరచేతితో వీపు మీద జోకొడుతూ మెల్లగా పాడేవాడు ఆ పాట…
“చందమామ చందమామ చందమామ
నీ సంజ్ఞ తెలియు జ్ఞానులెవరె చందమామ”
(ఇక్కడ రెండవ పాదంలో ” నీ సంజ్ఞ” అని, “నీ జాడ” అని, ” నీ సంధి” అనీ కూడా పాఠాంతరాలు కనిపిస్తున్నాయి)
ఎవరైనా పిల్లలను నిద్ర పుచ్చటానికి జోలపాటలు పాడుతారు… ఎన్ని లేవు ఆ పాటలు?! ఈ పాట ఏవిటి?
” కాయమను పుట్టలోన చందమామ
పాము మాయగాను మెదలుచుండు చందమామ”
పిల్లల్ని జోకొట్టడానికి ఈ పాము పాట లేవిటీ?!
” జంట నాగస్వరము లూది చందమామ
పాము పాదు పెకలింప వలెను చందమామ”
ఓ ప్రక్క పిల్లల్ని నిద్రపుచ్చుతూ ఈ పాముల పాదులు పెకలించటం ఏవిటో?!
ఈ పాట ఆయన నోట చాలాసార్లు విన్నాను. అర్ధం తెలియదు. కానీ ఏదో బాగుందే అనిపించేది! ఆయన మంద్ర స్వరమో, ఆయన పాడే విధానమో… ఏదో తెలియదు కానీ… నచ్చింది. చాలా కాలం వెంటాడింది.
ఆ తరువాత కాలంలో మా చిన్న తాత వేంకట వల్లభాచార్యులు గారు నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు సర్ ఆర్థర్ ఎవలాన్ “The Serpent Power” గ్రంథాన్ని నాకు బోధించినప్పుడు ఆ “పాము” ఏమిటో తెలిసింది.
కొన్నేళ్ళకి ఆ పాట నా మనసులో మరుగున పడిపోయింది. కొన్ని దశాబ్దాల తరువాత
ఒక టీవీ ఛానల్ కి సలహాదారుగా ఉన్నప్పుడు తత్వాల మీద ఒక కార్యక్రమం చేద్దామని అనుకున్నప్పుడు హఠాత్తుగా ఈ పాట ఎక్కడి నుంచో చీల్చుకుని బయటికి వచ్చింది. వెతికి వెతికి పట్టుకున్నాను. ఆ పాట వివరణ ఆ ఛానల్ లో అందించాను.
మళ్ళీ మరుగున పడింది. నిజంగా మరచిపోయాను.
మొన్న రాత్రి మళ్ళీ యూ ట్యూబ్ లో ” శరణం భవ…”, ” బ్రూహి ముకుందేతి…” తో పాటు ఇదీ కనిపించింది.
“ఎంత క్లిష్టమైన విషయాన్ని ఇంత సులువుగా ఎలా చెప్పేశారో!”
కుండలినీ యోగం అంతా మూటగట్టి ఒక్క పాటలో జనానికి ఎంత సులువుగా అందించారు!
అది విన్న వాడికి “ఇదేమిటి?” అనే ప్రశ్న పుట్టాలని, ఆ జిజ్ఞాస లో నుంచి అన్వేషణ మొదలై, తత్వం బోధ పరచుకోవాలని కదూ?
“కప్పి” చెప్పకుండా “విప్పి” చెప్పిన దానికి విలువ ఉండదు. అదేవిటో తెలుసుకోవాలనే తపన పుట్టాలి. తెలుసుకొనే వరకూ నిద్ర పట్టని ఉద్వేగం రావాలి. తిరగాలి… వెతకాలి… అడగాలి… తెలుసుకోవాలి. అప్పుడు కలిగే ఆనందం సరైన జ్ఞానం! అప్పుడే “గుప్తవిద్య” అనర్హుల పాల పడకుండా నిజమైన జిజ్ఞాస ఉన్న వాడికి అందుతుంది.
ఆ జిజ్ఞాసకు కులం లేదు! వర్గం లేదు! లింగ వివక్ష లేదు!వయో భేదం లేదు! ఉండకూడదు! పైగా ఈ “తత్వ సాహిత్యం” నూటికి తొంభై తొమ్మిదిన్నర వంతులు అందరూ అనే “అగ్ర కుల పండితుల” నుంచి వచ్చిన “బ్రాహ్మణికల్ లిటరేచర్” కాదు. ఇతర వర్గాల నుంచి వచ్చినదే! అంటే ఏమిటి? ఇవన్నీ అందరివీ! ఎవరైనా అందుకోదగినవి! అందుకోవాలనే తపన ఉండాలి అంతే! అదే మనవాళ్ళ ఆశయం!
ఇదే కదూ సనాతన ధర్మంలోని మహత్తర విధానం! ” గుహ్య విద్య”ను బోధించే విధానం ఇదే కదూ?
నిజానికి మహాపండితుల ప్రవచనాల కన్నా సామాన్య జనంలోకి చొచ్చుకొని పోయిన వేదాంతం, యోగం, శాస్త్రం అన్నీ ఇలాటి తత్వాల వల్లనే కాదూ?
ఒకసారి ఎప్పుడో అడిగాను మా నాన్నని… “పిల్లల్ని జోకొట్టి నిద్రపుచ్చడానికి అదేం పాట? ఈ పాము పాట తప్ప వేరే దొరకలేదా?” అని.
” నాకు వచ్చిన పాట అదొక్కటే మరి!” అన్నాడు మా నాన్న.
ఇంతకీ ఆ పాము పాదు పెకలించుకొని మూడు దారుల్లో ఉన్న మధ్య దారిలో వెళ్లాలి జంట నాగ స్వరాల నాదశక్తి ఒత్తిడికి.
కానీ ఎందుకో… ఆయన భుజాన ఉండి ఈ పాట వింటూ నిద్ర పోయిన ఆ పిల్లలకి ఆ పాము ఆ మధ్య దారిలో నుంచి కాకుండా ఎటో కొట్టేసినట్టుంది ఇప్పటి వాళ్ళ జీవితాలను చూస్తుంటే…
బహుశః ఆ పాటను ఆయన నోట విన్నాను కానీ… ఆ భుజం మీద పడుకొని వినలేదు… అందుకే… నేనొక్కడినీ “బచాయించా”నేమో!
ఆ పాట మిగిలిన వాళ్ళందరికీ “అడ్డం కొట్టేసింది” మరి!
Leave a comment