“అందులో మా వాళ్ళు తోపులు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 163

ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క “కళ”లో తోపులు. కొందరు శిల్పంలో, కొందరు చిత్రంలో…ఇలా ఎన్ని కళలు ఉన్నాయో అన్నిటిలోనూ ఉంటారు.

మావాళ్ళు కూడా ఒక కళలో మహా ముదుర్లు! అదే ” చతుర్ముఖ పారాయణం” అని గొప్పగా పిలుచుకునే “పేకాట!”

ఇళ్ళల్లో ఏ కార్యక్రమం జరిగినా ఓ ప్రక్క ఈ “వైభవం” జరగాల్సిందే! అది పెళ్లి అయినా, చావు అయినా, బాలసారె అయినా, అక్షరాభ్యాసం అయినా, చివరికి సత్యనారాయణ వ్రతం అయినా సరే… ఓ ప్రక్క ఈ “కళ”తో ఇల్లు కళకళ లాడిల్సిందే!

పోనీ అదేదో సరదాగా ఆడేదా? అంటే… ఊహూ… సొమ్ములు కురవాల్సిందే! పోయింట్ కి ఇంత అని స్టేక్!

డిసెంబర్ 30వ తేదీ వచ్చిందంటే ఇక మూడు రోజుల జాతరే! 30 సాయంత్రం మొదలు పెడితే జనవరి ఒకటో తేదీ ఉదయం లేవటమే! మధ్యలో కాలకృత్యాలు, భోజనాలకు లేవటం, మళ్ళీ కూర్చోవటం. మహా పతివ్రతలైన ఆ ఇంటి మహిళామణులు “టైమ్ టు టైమ్” కాఫీలు, టిఫిన్లు, చిరుతిళ్ళు అక్కడికే అందిస్తుంటే ఈ పేకాట రాయుళ్లు పరమ నిష్ఠతో, అచంచల ఏకాగ్రతతో తమ కళకు తమ మేధను జోడించి ముక్క మీద ముక్క ఎత్తుతూ, విసిరి పడేస్తూ… ఆ ముక్క ఎత్తటం, విసరటంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్!

ఆట మధ్యలో అత్యవసరంగా లేచి వెళ్ళవలసి వస్తే ఒక “ప్రాక్సీ” రెడీగా ఉంటాడు. వాడి చేతికి ముక్కలు అందించి “జాగర్త రొరెేయ్” అని హెచ్చరించి మరీ వెళ్ళడం, ఆ పనేదో కానిచ్చి, హడావిడిగా వచ్చేసి, ఆ ప్రాక్సీగాడిని లేపేసి, యథాస్థానం ప్రవిశ్య, ఆ కాసేపటిలో ఆ ప్రాక్సీ గాడు ఏం తగలేశాడో అని చూసుకుని, బాగుంటే హమ్మయ్య అనుకొని, తేడా కొడితే “ఆట అటకెక్కించావు కదరా, నీ మొహం మండా!” అని తిట్టేసి, పాడయిన వ్యూహాన్ని దారిలో పెట్టుకోవటానికి ప్రయత్నించి, కుదిరితే “ఆ విధంగా ముందుకు సాగుదాం” అనుకొని, కుదరకపోతే ” డ్రాప్” అంటూ మిడిల్ డ్రాప్ అయిపోయి, ఇంక ప్రక్క వాడి ఆటకు వీడే తిమ్మరుసు అయిపోయి, వాడు నెగ్గితే వీడే నెగ్గినంత సంబర పడిపోయి, ఓడిపోతే వాడెక్కడ తిడతాడో అని ముందే ” ఛస్! అన్నీ చెత్త ముక్కలే ఎత్తుకున్నావ్! ఇంకెలా చస్తుంది ఆట?” అంటూ వాణ్ణే తిట్టేసి ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఆటకు శంఖం పూరించే యోధులు మా వాళ్ళు!

అక్కడితో అయిపోయిందా? ఆ ఆటకు సంబంధించి మావాళ్ళు చరిత్రకారులు కూడా!

ఒక పెళ్ళిలో పొయింట్ కి పది పైసలు. తరువాత కొన్నాళ్ళకు ఫలానా వాడి ఇంటిలో ఒడుగు. అక్కడ “స్టేక్ పెంపుదల”!

“ఫలానా పెళ్ళిలో పది పైసలు కదా? ఈ ఒడుగులో పదిహేను చేద్దాం” అని ఏకగ్రీవ తీర్మానం! అలా ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క కార్యక్రమంలో ఈ పెంపుదల ఉండేది. ఎవరి ఇంటిలో ఏ కార్యక్రమంలో ఎంత పెంపుదల అనే రికార్డ్ అందరి దగ్గరా ఉంటుంది మనసులో. మళ్ళీ తేడా రాకూడదు కదా?

ఈ యోధుల నిష్ఠ ఎలాటిది అంటే…

ఈ పేకాట యోధులలో ఒక పెద్దాయన పరమపదం చేరారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి.  చివరికి “వాయస పిండం”… కాకులు రావే! ఎంతమంది కావ్ కావ్ అన్నా ఆ వాయసములు కనికరించనే లేదు! చివరికి ఒక యోధుడికి “జ్ఞాన బుగ్గ ఎల్గింది”. ఒక ప్రకటన చేశాడు… “బాబాయ్ గారూ! ఇవాళ సాయంత్రం ఆటలో స్టేక్ పావలా నుంచి అర్థ రూపాయ్!” అన్నాడు. అంతే! బహుశః ఆ చుట్టుప్రక్కల మాత్రమే కాదు…ఆ ఊళ్ళో మాత్రమే కాదు… చుట్టుప్రక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చేసినట్టున్నాయ్ కాకులే కాకులు!

కళకు అంత అంకితమైపోయి, “ఆత్మ నిష్ఠం” చేసుకొన్న మహా యోధులు మా వాళ్ళు!

ఒక కాలంలో నేను కూడా ఈ కళలో యోధుడిని కాదు కానీ “అప్రెంటిస్”నే!

ఒకసారి ఈ కళలో “అనేక యుద్ధముల ఆరి తేరిన వృద్ధ మూర్తి” తో “హ్యాండ్ టు హ్యాండ్” తల పడ్డాను. పొద్దున్న తొమ్మిదింటికి మొదలు పెట్టాం. పన్నెండు అయింది.  పద్దెనిమిది రూపాయలు వచ్చాయ్! ఒక్క ఆట కూడా ఓడిపోలేదు! గెలుపు నషా తలకెక్కేసింది. “ఉండండి… భోజనం చేసేసి వచ్చేస్తా, ఈ లోపు మీరు కూడా తినేసి రెడీగా ఉండండి” అని వెళ్ళాను.

తిరిగి వచ్చి మళ్ళీ కూచున్నాం. ముందు వచ్చిన పద్దెనిమిదీ గోవిందా! అంతేనా? మరో ఇరవై గోదాట్లో కలిసి పోయాయి.

అప్పుడు అర్థం అయింది పేకాట అనబడు క్రీడలోని నషా, దాని రిజల్ట్! ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ దాదాపు నాలుగు దశాబ్దాలు! వచ్చిన పద్దెనిమిది… పోయిన ఇరవై… మొత్తం ముప్ఫై ఎనిమిది… ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ మళ్ళీ “పేకాట” అనే దాని జోలికి వెళ్ళలేదు! వెళ్ళను కూడా!

శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన భగవద్గీతను అతగాడు మరచిపోయి “బావా! ఆ మధ్య యుద్ధానికి ముందు ఏదో చెప్పావ్! మర్చిపోయా! మళ్ళీ చెప్పవా?” అని అడిగాడని విన్నా. శ్రీ కృష్ణుని బోధను అర్జునుడైనా మర్చిపోయాడేమో కానీ ఆ ముప్ఫై ఎనిమిది రూపాయలు చేసిన బోధ మాత్రం నాకు ఒక జీవితకాలం మర్చిపోలేని పాఠం!


Leave a comment