స్వీయ అన్వేషణ – 164
అవును…
షరతులు వర్తిస్తాయి…
దాదాపు దశాబ్దం క్రితం వరకూ నా వైపు నుంచి అన్నీ “బేషరతు”గానే అందించాను.
ఈ దశాబ్ద కాలంలో నా జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే… అది నా తప్పు అనిపించింది. అనిపించటమే కాదు… అదే నిజం… అది ఖచ్చితంగా నా తప్పే!
“అవతలివాడిని అంచనా వేయకుండా, ప్రతి వాడూ ‘మన’వాడే అనే ‘భ్రమ’లో బతికేయటం వల్ల వచ్చిన ముప్పు అది… కొన్నిటిని, కొందరిని తలపై కెత్తుకొని… దాని వల్ల మరికొన్ని తలపై పడి… అనుభవించినది ఇక చాలు!” అని తెలియడానికి దశాబ్దాల కాలం పట్టింది మరి!
“Better than Never” అన్నాడుగా వాడెవడో! “Knowledge often dawns late” అని కూడా ఇంకెవడో అన్నాడు!
ఈ రెండూ ప్రత్యక్షంగా “ఎరుక” లోకి రావటానికి అన్నేళ్ళు పట్టింది. ఇది నా ఒక్కడికే కాదు… నా తరంలో చాలామందికి అనుభవమే… ఎక్కడో బ్రతుకు ప్రణాళిక ఖచ్చితంగా ముందే నిర్ణయించుకున్న వాడికి తప్ప. అలాటి వాళ్ళని మా తరంలో వ్రేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు!
“ఏ విధంగా అయినా మన దగ్గరకి వచ్చిన వాడికి ఏదో చేయాలి” అనే మా తాత ఫణిహారం వేంకట రంగాచార్యులు గారు ఏదో మూల నాలో బ్రతికే ఉన్నారేమో! లౌకికంగా ఆయన స్థాయిలో ఆయన నష్ట పోతే నా స్థాయిలో నేనూ అదే గోతిలో పడ్డాను!
ఆస్తులు మూడొంతులు కరిగిపోయాక గానీ “జాగ్రత్త పడాలి” అని మా చిన్న తాత వేంకట వల్లభాచార్యులు గారికి “జాగరూకత” కలగనట్టే నాకూ దాదాపు దశాబ్దం క్రితం వరకూ ఆ “తెలివిడి” కలగలేదు! ఈ తాతలు ఇద్దరూ నాలో చెరో మూల ఉన్నట్టున్నారు!
ఆ “తెలివిడి” కలిగాక, కంటికి కమ్మిన పొరలు తొలగిపోయాక… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు… బేషరతు వ్యవహారాలు క్రమంగా వదలించుకుంటూ వస్తున్నాను. ఇంకా వదలించుకో వలసినవి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయ్! వాటికీ ఒక రోజొస్తుంది తొందరలోనే!
“నన్ను వాడు వాడేసుకున్నాడు, వీడు వాడేసుకున్నాడు” అని ఎవడినో నిందించటం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు గాక లేదు! ఆ అవకాశం నా “బుద్ధిహీనత” వల్ల నేను ఇచ్చినదే కదా! ఇప్పుడు కదా బుద్ధొచ్చింది!
కనుక…
షరతులు వర్తిస్తాయి…
నా నుంచి ఒక పని కావాలంటే దానికి తగిన “మూల్యం” చెల్లించాల్సిందే! ఆ ” మూల్యం” ఏమిటి అని నిర్ణయించేది నేనే!
నా అభిమానం పొందాలంటే అవతలి వాడికి అది పొందే “అర్హత” ఉండి తీరాల్సిందే!
ఆ “అర్హత”ను నిర్ణయించేది “నేనే!”
నాతో మాట్లాడాలన్నా, ముచ్చట్లు పెట్టుకోవాలన్నా ముందుగా వాళ్ళు నాకు “ఆత్మీయు”లై ఉండాల్సిందే!
నా వృత్తిలో నేను నిర్ణయించినదే “ఫీజ్!” బేరసారాలు ఉండవు!
అవతలివాడు ఏ పరిస్థితులలో అయినా ఉండనీ…నేను ఏదీ ఉచితంగా అందించను!
నాకు ఏదీ “ఉచితం”గా రాదు కనుక నేనూ ఎవరికీ ఏదీ “ఉచితం”గా అందించను!
నేను ఎవరినీ, దేనినీ “ప్రమోట్” చేయను!
నా మనసుకు నచ్చిన విషయాన్ని “పరిచయం” మాత్రమే చేస్తాను!
ఎవడో ఏదో అడిగాడని మొహమాటానికి పోయి ఒక్క అడుగు కూడా ముందుకు వేయను!
ఇప్పుడు నా “చూపు” స్పష్టంగా ఉంది!
” Colour Blindness” వదలి పోయింది!
కనుక…
షరతులు వర్తిస్తాయి!
ఇదంతా “ఒళ్ళు పొగరు” అనిపించవచ్చు చాలా మందికి…
But, I don’t undersell myself anymore!
Leave a comment