“ఆ ఒక్కటీ అడక్కు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 167

“ఇప్పుడు నేనేం చెయ్యాలి?” అని అడిగాడు ట్రావెల్ మూర్తి.

“మూర్తీ! లైఫ్ లో ఎప్పుడూ ఏం చెయ్యాలి అని ఎదుటి వాణ్ణి అడక్కు. నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి!” అన్నాడు బిట్టు. (జులాయి సినిమా)

సినిమాని ఒక్కొక్కసారి తేలిగ్గా తీసుకుంటాం కానీ… కొన్ని కొన్ని “డవిలాగులు” జీవన “గీత”ల్లా ఉంటాయి. అలాటివాటిలో ఇదీ ఒకటి. చాలాసార్లు చూసినా, సరదాగా చూసేసినా, రవీంద్ర నారాయణ్ – బిట్టుల తెలివితేటలు గురించే దృష్టి పడింది కానీ, ఎందుకో ఇవాళ ఈ “డైలాగు” దగ్గర ఆగిపోయాను! తరువాత టివి స్క్రీన్ మీద సినిమా నడుస్తోంది కానీ, మనసు ఆ దృశ్యాల మీద లేదు! బిట్టు మాటల మీదే మనసు లగ్నం అయిపోయింది!

విశ్వనాథ సత్యనారాయణ గారు పురాణవైర గ్రంథమాల లోని “అశ్వమేధము” నవలలో ఒక మాట అన్నారు.

“మానవుడు విచారించుట కొరకు జన్మించినాడు. ఆలోచనాహీనుని యందు మానవత్వము లేదు”. ఇక్కడ “విచారించుట కొరకు” అంటే “ఆలోచించుట కొరకు” అని అర్థం.

“ఆలోచనాహీనుని యందు మానవత్వము లేదు” అంటే…

మనిషి ఆలోచించటానికి పుట్టాడు కాబట్టి, ఆలోచన అనేది మానవ లక్ష్యం కాబట్టి అది మానవత్వం. అలాటి ఆలోచన లేకపోతే ఆ మానవత్వం లేదని అర్ధం.

ఆ “ఆలోచన” అనే “మానవత్వ” లక్షణం అంటూ ఉంటే ” ఇప్పుడు నేనేం చేయాలి?” అని ట్రావెల్ మూర్తి లాగ అడిగే పరిస్థితి రాదు కదా! “ఏం చేయాలో” ఆలోచిస్తాం కదా?

అంటే మనం ఎవరినైనా “ఇప్పుడు నేనేం చేయాలి?” అని అడిగాము అంటే మనం “మనుష్యులం” కాదన్న మాట! అంతే కదా?

ఇంత దూరం ఆలోచించ వలసిన పని కూడా లేదు… ఇతర సమస్త జీవజాలానికీ, మనిషికీ ఉన్న తేడా ఈ “ఆలోచనా శక్తి”యే కదా? అందరికీ తెలిసిన విషయమే! అయినా దాని గురించిన “ఎరుక” ఉండదు మనిషికి!

అందుకే బిట్టు చెప్పిన “క్లారిటీ”ని మిస్ అవుతున్నాం అందరమూ.

“నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి” అన్నాడు బిట్టు.

ఆ “క్లారిటీ” కావాలి అంటే ఎవడికి వాడు “ఆలోచన” చేసుకోవాలి. ఎదుటి వాణ్ణి అడిగితే వాడి “ఆలోచన” మాత్రమే చెబుతాడు. అది నీ “ఆలోచన” కాదు కదా? ఎదుటి వాణ్ణి ఫాలో అవుతున్నావంటే నీకు “స్వీయ ఆలోచన” లేదని అర్ధం. అప్పుడు నువ్వు విశ్వనాథ వారు అన్నట్టు “మానవత్వము లేని వాడవు” అవుతావు. అప్పుడు నీ “ఉనికి”కే అర్ధం లేదు!

అందుకే… “ఆ ఒక్కటీ అడక్కు!”

నిన్ను నువ్వు “మనిషి”వి అని నిరూపించుకో!


Leave a comment