“పనులున్నాయ్… కానీ…”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 171

చాలా బోల్డు కుంచెం పనులున్నాయి…

అందుకేగా నువ్వు నన్నిక్కడికి పంపినది?

అలా చెప్పి నువ్వు పంపితేనేగా నేనూ ఇలా వచ్చినది?

నువ్వు నన్నిక్కడికి పంపావ్… సరే!

నీ మాట ప్రకారం నేనూ ఇక్కడికి వచ్చాను… అదీ సరే!

కానీ…

ఆ “చాలా” పనులేవిటో ఇప్పుడు చెప్పవేం?

ఆ “బోల్డు” పనులేవిటో ఇంకా చెప్పటం లేదేం?

పోనీ… ఆ “కుంచెం” పనులైనా మళ్ళీ చెప్పొచ్చు కదా?

నువ్వు అలా పంపేసి, నేనిలా వచ్చేసి… ఇన్నేళ్లయిపోయినా… ఏవీ తెలియటం లేదే!

ఏవిటో… చీకట్లో బాణం వేసేసినట్టు నన్నిక్కడికి విసిరేసి… అలా విసిరేసినట్టు మరచేపోయినట్టున్నావే!

నిజం చెబుతున్నా… వింటున్నావో, లేదో కానీ… నాకు మాత్రం ఊపిరాడటం లేదు.

ఏవిటో… వచ్చిన పని తప్ప పనికిరాని పనులే చేస్తున్నట్టుంది అన్నీ!

తెలుస్తూనే ఉంది… చేయవలసిన పనులు చేయటం లేదనీ, చేయకూడని పనులే పనిగట్టుకుని మరీ చేస్తున్నాననీను!

కానీ…

ఏం చేయను మరి?

చేయకూడనివని తెలుసు!

చేయాల్సినవేమిటో తెలియటం లేదే?

నిజంగా తెలియటం లేదా?

లీలగా తెలుస్తూనే ఉన్నట్టుంది!

సుదూర గగనతలంలో కాలాలకు ఆవల మిణుకు మిణుకుమంటున్న చుక్కలా!

స్థల కాలావరణంలో నన్ను నేను పోగొట్టుకున్నట్టుంది!

లేకపోతే… చెప్పే పంపావుగా ఏం చేయాలో!

మరపు మూసేసిన మనసు ముసుగు వేసేసి ఎందుకిలా ఆడుకుంటున్నావూ నాతో?

ఏవిటీ… మనసుని అంతం చేసేయి… తెలుస్తుందంటావా?

మహామహా వాళ్ళకే సాధ్యం కాలేదే! అర్భకుణ్ణి… నాకెలా సాధ్యం చెప్పు?

వాళ్లెవాళ్లో అప్పుడెప్పుడో ముక్కు మూసుకొని కూచుంటే తెలిసిందంటున్నావా?

ఆ ముచ్చటా ముగిసింది!

ముక్కు మూసుకొని కూచుంటే ఉక్కిరిబిక్కిరి అయింది తప్ప అసలు పనేవిటో తెలియలేదు!

వాళ్లెవళ్లో అప్పుడెప్పుడో కళ్ళు మూసుకొని కూచుంటే అన్నీ కనిపించాయంటావా?

అదీ అయింది!

కళ్ళు మూసుకొని కూచుంటే తెరలు తెరలుగా ముంచెత్తే కడలి అలలలా కల్లోల పరచే దృశ్యాలే కానీ… అసలు పని తోచదే!

“అసలు పని” తెలియాలంటే “అసలు నువ్వు” ఎవరో, ఏవిటో తెలుసుకోవాలంటున్నావా?

నీదేం పోయింది? ఎన్నైనా చెబుతావ్!

“అసలు నేను” ఏవిటో తెలిస్తే నీకూ నాకూ తగువేముంది ఇంక?

నువ్వూ, నేనూ ఒకటే అంటున్నాడు ఒకాయన!

నేను నీకు దాసుడిని అంటున్నాడు ఇంకొకాయన!

నువ్వు నువ్వే, నేను నేనే అంటున్నాడు మరొకాయన!

నాకు తెలియక అడుగుతానూ… వాళ్ళని పంపిందీ నువ్వేగా?

ఏదో ఒక మాట చెప్పి పంపొచ్చు కదా? ఒక్కొక్కడికి ఒక్కొక్క మాట చెప్పి పంపావ్! వాళ్ళేమో నువ్వు చెప్పింది చెప్పినట్టు చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు! అవన్నీ విని నాలో నేను కొట్టుకు ఛస్తున్నాను! అయినా నీకిదేం సరదా?

ఇంతకీ నన్నెందుకు పంపావిక్కడికి?

చెప్పకుండా అంత మౌనం ఏవిటీ?

సరేలే… నేర్చుకుంటాను… ఆ మౌన సంభాషణ!

చెప్పేదాకా వదులుతాననుకున్నావా?

నువ్వు చెప్పి పంపిన పనేవిటో నేనే తెలుసుకుంటాను!

అలా తెలుసుకోవటంలో నన్ను నేను తెలుసుకుంటాను!

నన్ను నేను తవ్వుకొని, లోలోపలికి పయనించి, ఆ పరమార్థాన్ని తెలుసుకోవాలనే కదా నీ మౌనం?

అలాగే కానీ…

ఆ పనేదో పూర్తి చేసే దాకా ఇక్కడ నుంచి వెళ్ళను!


Leave a comment