“మాట్లాడాలనిపించటం లేదు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 172

అవును…

మాట్లాడాలనిపించటం లేదు!

ఎందుకు?

ఏమో?

వినేవాళ్ళు లేరనా?

కాదు!

మరి ఎందుకు?

వినబడ కూడదనా?

కాదు!

అయితే ఎందుకు?

ఏమో… మాట్లాడాలని లేదంతే!

అయితే మాట్లాడకుండా ఉండగలవా?

కష్టమే… ఉండలేను!

మరేం చేస్తావ్?

ఏం? మాట్లాడుకుంటాను… నాతో నేనే మాట్లాడుకుంటాను… నాలో నేనే మాట్లాడుకుంటాను.

పిచ్చివాడు అనరూ నిన్ను?

అననీ… ఇపుడేవన్నా గొప్పవాడు అంటున్నారా ఏవిటి?

ఎందుకంటా అంత కోపం జనాల మీద?

నాకేం కోపం జనాల మీద?

నాకేం కోపం లేదు జనాల మీద… జాలి తప్ప!

జాలి? ఎందుకు?

వాళ్ళ దుఃఖాన్ని చూసి… వాళ్ల కష్టాన్ని చూసి… వాళ్ళ ఆశల్ని చూసి… వాళ్ళ బ్రతుకుల్ని చూసి… వాళ్ళ బ్రతుకు పోరాటాన్ని చూసి… వాళ్ళ ఆరాటాన్ని చూసి…

నాకు జాలి వాళ్ళ మీద!

అబ్బో! అంత మహాత్ముడివా నువ్వు? ఏం చేస్తావ్ జాలి పడి వాళ్ళ మీద?

మహాత్ముణ్ణి కాదు… మనిషిని… నేనేం చెయ్యగలను వాళ్ళకి…

నాతో నేనే పోరాడుకుంటున్న వాణ్ణి… వాళ్ళ ఆరాట పోరాటాలలో నేనేం చెయ్యగలను?

మాట్లాడు వాళ్ళతో… నాలుగు సాంత్వన వాక్యాలు చెప్పు… వాళ్ళ ఆరాటం కొంతైనా తీర్చినవాడివవుతావ్ కదా?

మాట్లాడితే తీరుతుందా ఆరాటం నీ పిచ్చి కానీ? అయినా మాట్లాడాలనిపించటం లేదే!

ఏం… నీ మాటలు వినే అర్హత లేదా వాళ్ళకి?

అయ్యో… అలా కాదు… వాళ్ళకి చెప్పే యోగ్యత ఉండొద్దూ నాకు?

అయినా నేను చెబితే వింటారా వాళ్ళు? కృతయుగం నుంచీ మన పూర్వ  ఋషులు ఎన్ని చెప్పలేదూ? విన్నారా వీళ్లు?

నీకింకో సంగతి తెలియదేమో… ఎవరైనా మనల్ని ఏదైనా అడిగారంటే ఆ విషయంలో వాళ్ళు అప్పటికే ఒక అభిప్రాయానికి లేదా నిర్ణయానికి వచ్చేసే ఉంటారు. మనల్ని అడగడం అంటే వాళ్ళు అప్పటికే తీసుకున్న నిర్ణయానికి “బావుంది… బావుంది” అంటూ ఆమోద ముద్ర వేయించుకోవడానికి మాత్రమే! అది తెలియక మనమేదో జ్ఞానులమని మనకు మనమే ఊహించేసుకుని సలహా ఇస్తే… అప్పటికి తలూపి వెళ్ళిపోయినా లోపల్లోపల “వీడేమిటీ ఇలా అన్నాడు?” అని తిట్టుకుంటూ పోతారు. వీళ్ళకా “సాంత్వన వాక్యాలు” చెప్పమంటున్నావ్? ఇలాటివెన్నో చూసి చూసే ఇప్పుడు మాట్లాడాలపించటం లేదు! తెలిసిందా?

అందరూ అంతేనంటావా?

నూటికి తొంభై మంది అంతే.

మరి ఆ మిగిలిన పదిమంది కోసం అయినా మాట్లాడొచ్చుగా?

ఆ మిగిలిన పదిమందికీ స్పష్టత ఉంది, సత్యాన్వేషణ పట్ల అనురక్తి ఉంది. వారి మార్గాన్ని వారు నిర్మించుకునే పనిలో ఉన్నారు. పనిగట్టుకుని వారితో మాట్లాడవలసిన అవసరం లేదు.

అయితే మాట్లాడనంటావ్?

మాట్లాడను అనడం లేదు.

మాట్లాడాలనిపించటం లేదని మాత్రమే అంటున్నా!

ఎప్పటికీ ఇంతేనా?

ఏమో! నాతో మాట్లాడిస్తే… మాట్లాడించే వారు తారసపడితే చూద్దాం.

మరి ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నావ్ కదా నాతో!

ఒరేయ్ పిచ్చివాడా! నీతో మాట్లాడుతున్నానా? నాతో నేనే మాట్లాడుకుంటున్నానురా బాబూ! నువ్వూ నాలోనే ఉన్నావ్ కదరా?


Leave a comment