“నీరాగార నివిష్ట …”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 173

వేసవి కాలంలో బాటల ప్రక్కన చలివేంద్రాలు ఉంటాయి. తాటాకు పందిరులు వేసి ( ఒకప్పుడు), వాటిలో మట్టి కుండలలో మంచినీరు నింపి ఉంచుతారు. కూర్చోవడానికి బల్లలు ఉండేవి. దారిన పోతూ, వేసవి తాపానికి అలసిపోయి, ఆ పందిరి నీడలోకి వచ్చి, ఆ బల్ల మీద కూలబడి, భుజం మీది ఉత్తరీయంతోనో, మెడలో తువ్వాలుతోనో చెమటలు కారిపోతున్న ముఖాన్ని తుడుచుకొని, ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, (అప్పట్లో అయితే ఆ కుండ మీద ఉన్న) మట్టి ముంతతో నీళ్ళు ముంచుకుని త్రాగి, కాసేపు సేద దీరి, మళ్ళీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేవారు బాటసారులు.

ఆ చలివేంద్రంలో కూర్చున్న ఆ కాసేపట్లో  మిగిలిన వారితో సంభాషణలు, కుశలప్రశ్నలు, కుటుంబ వివరాలు, స్థితిగతులు… ఇలా ఎన్నెన్నో కబుర్లు! కాసింత ఓపిక రాగానే అన్నీ వదిలేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోవటం! అక్కడ కలిసినవారు “ఎప్పటికీ” కలిసే ఉండరు కదా? అదే మాట పోతన మహాకవి అన్నాడు. అదీ ఒకానొక రాక్షస స్వభావం ఉన్న హిరణ్యకశిపుని నోటి వెంట!

జీవితమూ అంతే కదూ?

కాస్త బుద్ధీ ఙ్ఞానం తెలిసి వచ్చినప్పటి నుంచీ ఆటపాటల్లో, ప్రాధమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో, కళాశాలలో, వృత్తి -ఉద్యోగ – వ్యాపార స్థలాలలో, రోజూ మనం బస్సు ఎక్కే స్టాప్ లో, మనం ప్రయాణించే మెట్రో, లోకల్ ట్రైన్, దూర ప్రయాణాలలో ఎందరిని కలవటం లేదూ? ఎవరైనా “ఎప్పటికీ” మనతో ఉన్నారా? లేరు కదా?

జీవితమూ అంతే కదూ?

కానీ…

ఈ జీవన యాత్రలో కొందరు ఎదురవుతారు. కొన్ని క్షణాల్లో మన మనస్సును ఆక్రమించేస్తారు.

ఒకసారి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెడుతూ నరసాపురం ఎక్స్ప్రెస్ ఎక్కి, విజయవాడలో దిగాను. ఆ ప్రక్క ప్లాట్ఫార్మ్ పైన ఉన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రి వెళ్ళిపోవచ్చు. దిగటానికి, ఎక్కటానికి మధ్య చాలా సమయం ఉంటుంది. సో, దిగగానే దంతధావనం పూర్తి చేసుకొని, ఎక్కి నాకు కేటాయించిన విండో సీట్ లో కూచున్నాను. కొన్ని క్షణాలకు ఒక అపరిచితుడు చేతిలో రెండు కాఫీ కప్పులతో వచ్చి, నా ఎదురు సీట్లో కూచుని, “గుడ్ మార్నింగ్” అంటూ ఒక కప్పు నా చేతికి ఇచ్చాడు. అప్రయత్నంగా అందుకున్నాను. అతనెవరో నాకు  తెలియదు ( ఇప్పటికీ). కాఫీ సిప్ చేస్తూ ఒక చిరునవ్వు విసిరి, “ఏమీ అనుకోకండి! పొద్దున్నే ఇంట్లో ఎవరికో ఒకరికి గుడ్ మార్నింగ్ చెప్పి కాఫీ షేర్ చేసుకోవటం అలవాటు. మరిప్పుడు జర్నీలో ఉన్నా కదా? సో, మీతో షేర్ చేసుకున్నాను!” అన్నాడు. ఏవో కబుర్లు రాజమండ్రి వరకూ సాగుతూనే ఉన్నాయి. నేను అతని పేరు అడగలేదు, అతనూ నా పేరు అడగలేదు. మేము ఏం ఉద్యోగాలు చేస్తున్నామో ఇద్దరికీ తెలియదు. కబుర్లు అన్నీ లైఫ్ ను “షేర్” చేసుకోవటం మీదే! నేను రాజమండ్రిలో అతనికి వీడ్కోలు పలికి దిగిపోయాను. ఆ మనిషి ఇప్పుడు నా జీవితంలో లేడు! నిజంగా లేడా? ఎందుకు లేడూ? ఇంతసేపూ నాతోనే ఉన్నాడు కదా? ఇంతసేపేవిటి? ఇన్ని ఏళ్లూ నాతోనే ఉన్నాడు కదూ? లేకపోతే ఇప్పుడెందుకు గుర్తుకు వస్తాడు?

ఇంతకీ ఇప్పుడెందుకుడంతా?

అంటే…

నా సాహిత్య జీవిత యాత్రకు బీజాలు వేసిన చిలుకూరి వేంకట రామశాస్త్రి కొన్ని నెలల క్రితం వెళ్ళిపోయాడు.

నా సాహిత్య జీవిత యాత్రలో అడుగడుగునా తోడు నిలిచిన ఎల్లాప్రగడ వేంకటేశ్వర వివేకానందం నిన్నటికి నిన్న వెళ్ళిపోయాడు.

వివేకానందం గురించి గతంలో చెప్పాను.

నా వ్యక్తిగత, సాహిత్య జీవితాలలో అతనిది ఒకానొక విచిత్ర ప్రముఖ పాత్ర!

కొందరు వదలి వెళ్ళిపోతే గుండెలో ఒక ముక్కను కోసుకొని కూడా పట్టుకుపోతారు. అలాటి వాడే వివేకానందం!

అతనిది ఒక విచిత్ర మనస్తత్వం. ఒకప్పుడు హిమశైల శీతలంగా ఉంటాడు. మరుక్షణం లావా చిమ్మే అగ్నిపర్వతంలా మారిపోతాడు. దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అయినా అతడిని దూరం పెట్టలేం. అతని ఆలోచనలకు విలువ ఇవ్వకుండా ఉండలేం. అతని “బుర్ర”లో వ్యాపారపు పదను ఉంటుంది.

1986 ప్రాంతాలలో ఒక వ్యాపార ఆలోచన చేశాడు. అదే “మొబైల్ టిఫిన్ సెంటర్!” ఇప్పటికి దాదాపు 40 ఏళ్ల క్రితం! ఒక బండి, ఆ బండిలో జస్ట్ రెండే ఐటమ్స్… ఒకటి నేతి ఇడ్లీ + కారప్పొడి, రెండు నేతి పెసరట్టు… అంతే! ఇప్పుడు చూడండి రోడ్డు పొడవునా ఎన్ని “మొబైల్ టిఫిన్ సెంటర్స్”  వెలిశాయి? నాలుగు దశాబ్దాల క్రితం అతను చేసిన ఆలోచన అమలులోకి వచ్చి ఉంటే ఇవాళ హైదరాబాద్ లో “రామ్ కి బండి” బదులు అతని బండి ఉండేది సిటీ లో ప్రతి గల్లీలో! దురదృష్టం ఏమిటంటే ఇలాటి కొన్ని పదుల వ్యాపార ఆలోచనలు అతని “బుర్ర”లో మెరిశాయి కానీ వాటిలో ఏ ఒక్కటీ వాస్తవ రూపంలో ఆచరణలోకి రాలేదు! ఆలోచనలకు “బుర్ర” ఉంటే చాలు కానీ అవి వాస్తవ రూపం ధరించాలంటే చేతిలో “తైలం” ఉండాలి కదా?

అతను “దుస్సాహసి” కూడా! అది “ఆత్మ విశ్వాస”మో, “అతి విశ్వాస”మో అర్థం కాదు… ఆ పని అయ్యేదాకా!

డాక్టర్ ప్రసాదరాయ కులపతి అరవై ఏళ్ళు నిండేనాటికి అప్పటివరకూ ఆయన చేసిన రచనలు అచ్చులో అందుబాటులో లేకుండా పోయాయి. ఆ రోజులలో వివేకానందం ఆయనను గురువుగా భావించేవాడు. ఆయనే మా ఇద్దరికీ మంత్రోపదేశం చేసిన మొదటి గురువు కూడా! “గురు ఋణ మీగుటకునై..” ఆయన సమస్త రచనలను తిరిగి ముద్రించి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించాడు.

అదొక బృహత్తర ప్రణాళిక! దాదాపు ఎనిమిది గ్రంథాలు! ఒక్కొక్కటీ వెయ్యి కాపీలు! వాటిలో “కవితా మహేంద్రజాలం” రెండువేల కాపీలు! అంటే మొత్తం తొమ్మిదివేల కాపీలు! ప్లస్ ఒక విశిష్ట సంచిక! మొత్తం పదివేల కాపీల ముద్రణ! ఒక్కొక్క గ్రంథానికి సగటున వంద పేజీలు వేసుకున్నా 10 లక్షల పేజీల ముద్రణ! తొమ్మిది వేల కవర్ పేజీల ముద్రణ!

ఈ పని మొత్తం చేయవలసిన వాళ్ళం నేనూ, వివేకానందం మాత్రమే! నా ఉద్యోగమూ, జీతమూ అంతంత మాత్రమే. అతనికి ఏ ఉద్యోగమూ లేదు. నిజానికి ఈ పని మేము చేయగలిగినది కానే కాదు!

ఆ “దుస్సాహసి” ముందుగా తొమ్మిది వేల కవర్ పేజీలు ప్రింట్ చేయించేశాడు. కులపతికి సన్నిహితులైన ఉన్నతాధికారులు అందరినీ ఒక్క త్రాటి పైకి తెచ్చాడు. విరాళాలు, వ్యాపార ప్రకటనలు సేకరించాడు. మూడు నెలల్లో ఆ గ్రంథాలు అన్నీ కట్టలు కట్టలుగా కళ్ళ ముందు నిలిచాయి! పట్టు పట్టాడంటే ఆ పని పూర్తి అయ్యేవరకూ నిద్రపోడు.

ఇవాళ గుంటూరులో కులపతి ఇంటిలో “శ్రీ స్వయంసిద్ధ కాళీ పీఠం” ఉందంటే దాని వెనుక వివేకానందం చేసిన కృషి ఎంతో ఉంది. కులపతికీ, పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీ కి అనుసంధానం కల్పించిన వాడు వివేకానందమే! ఆ అనుసంధానం వల్ల పూజ్య గురుదేవుల మార్గదర్శనం కులపతి ఎన్ని మంత్రసాధనలు చేశారో అనేదానికి నేను ప్రత్యక్ష సాక్షిని!

వివేకానందం ఒంటరివాడు. అవివాహితుడు. కుటుంబం నుంచి దూరం. వ్యక్తిగత జీవితంలో “ప్రయోగ బాధల”తో సతమతం అయినవాడు. వాటి నుంచి బయటపడటానికి ఎందరో మంత్రవేత్తలను కలిశాడు. వారు చెప్పినవన్నీ చేశాడు.  ఆ క్రమంలో వారి నుంచి ఎంతో సమాచారం సేకరించుకున్నాడు. అదంతా నాతో పంచుకున్నాడు.

కులపతిలోని సాధనా పార్శ్వాన్ని అతడే నాకు పరిచయం చేశాడు. అప్పటివరకూ ఆయనను కేవలం సాహిత్యజీవిగానే చూశాను. శ్రీ బాలా మంత్ర సిద్ధుడు, “అద్దంకి” కృష్ణమూర్తిగా ప్రసిద్ధుడైన చెన్నూరు కృష్ణమూత్రిగారిని పరిచయం చేసినవాడు అతనే. పరమపూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ్ దత్ శ్రీమాలీజీ గురించి “The Power of Tantra” పుస్తకంతో నాకు ఎరుక చేసినవాడు అతడే. అలాగే అదే మార్గంలో పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషీజీని పరిచయం చేసినవాడు అతనే. ఈ రోజు నేను శ్రీగురు చరణాలను ఆశ్రయించి బ్రతుకుతున్నాను అంటే ఎల్లాప్రగడ వేంకటేశ్వర వివేకానందం కారకుడు.

అలాటి మిత్రుడు నిన్నటికి నిన్న వెళ్ళిపోయాడు.

అతగాడు “చలివేంద్రం”లో కలిసి, విడిపోయిన వాడు కాడు. జన్మజన్మల నుండి నాతో నడచి వచ్చి, నన్ను శ్రీగురు చరణ సన్నిధికి చేర్చి, బహుశః తన కర్తవ్యం పూర్తి చేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు!


Leave a comment