“ఒక్కసారి వచ్చి చూడు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ – 174

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!

నా హృదయాంధకార గుహలోకి కళ్ళు మూసుకొని రా!

నీకొక కాంతిపుష్పాన్ని బహూకరించి పంపిస్తా!

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!

నా మనో విషాద విష తటాక సోపానాలను అవరోహించి రా!

నీకొక అమృత భాండాన్ని అందించి పంపిస్తా!

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!

నా జీవనాసిత గగనాన్ని అధిరోహించి రా!

నీకొక నక్షత్ర మాలికను అలంకరించి పంపిస్తా!

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!

నా వైఫల్య పరంపరలను తొక్కుకుంటూ రా!

నీకొక విజయకేతనాన్ని అందించి పంపిస్తా!

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!

నా ఎదడ కడలి కెరటాలపై నడచి రా!

అడుగడుగునా ముత్యాల మువ్వలు తొడిగి పంపిస్తా!

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!

నా బ్రతుకు చీకటిని చూస్తూ రా!

నీ కళ్ళకు కాటుక రేఖలు దిద్ది పంపిస్తా!

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!

నా భగ్న జీవన గీతికను వింటూ రా!

నిన్నొక రాగమాలికనై ఆవరించి నీ వెంట వచ్చేస్తా!

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!

నిన్ను నాలో నింపేసుకొని నీవే నేనై వచ్చేస్తా!

రా…

నిర్భయంగా… నిస్సంకోచంగా రా!


Leave a comment