స్వీయ అన్వేషణ – 176
“కాళిదాసు (అ)వినయము!”
“కాళిదాసు వినయవంతుడా?
కాదు… కానీ… వినయపు ముసుగులో తన ఆత్మప్రత్యయాన్ని ప్రకటించే గడుసువాడు!” అన్నారు మా మాష్టారు శరభయ్య గారు. నిన్న మాస్టారి గురించి వాడ్రేవు చినవీరభద్రుడు స్వాధ్యాయ యూట్యూబ్ ఛానల్ లో మాస్టారి గురించి చెప్పిన విశేషాలు వింటూ ఉంటే “కాళిదాసు వినయవంతుడు” అన్నట్టుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్రాసిన మాటలు విని మాష్టారు “వాడి మొహం!” అన్నారని విన్నాక పై విషయం గుర్తుకు వచ్చింది.
ఒకసారి ఆయన ఇంటి నుండి కోటిలింగాల రేవు వరకూ నడుస్తున్న వేళ కాళిదాసు రఘువంశం ప్రసక్తి వచ్చింది. అప్పుడు మాష్టారు అన్న మాటలవి! దానికి ఆయన వివరణ కూడా “బోధించారు!”
“రఘువంశం లోని మొదటి శ్లోకాన్ని ప్రక్కన పెట్టి తరువాతి మూడు శ్లోకాలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి.
“రెండవ శ్లోకంలో ఏమన్నాడు? సూర్యుని నుంచి ప్రభావించిన వంశం ఎక్కడ? అల్పమతినైన నేనెక్కడ? ఒక చిన్న తెప్ప మీద మహాసాగరాన్ని తరించటానికి ప్రయత్నిస్తున్నాను అన్నాడు.
” మూడవ శ్లోకంలో ఏమన్నాడు? మందుడను, కవికున్న యశస్సును పొందాలని ఆశిస్తున్నాను. ఇక్కడ కవి అంటే కాళిదాసు దృష్టిలో కవి అంటే ఒక్కడే… అతడు వాల్మీకి! వాల్మీకుకున్న యశస్సు నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇదెలా ఉందంటే ఒక పొడవైన వానికి అందే పండు కోసం ఒక మరుగుజ్జు చేతులెత్తి పైకెగురుతూ అపహాస్యం పాలవుతున్నట్టుంది అన్నాడు. ఇక్కడి దాకా ఆహా! కాళిదాసుకు ఎంత వినయం అనిపిస్తుంది.
అసలు కాళిదాసు నాలుగవ శ్లోకంలో తన ఆత్మ ప్రత్యాయాన్ని ప్రకటిస్తాడు. కానీ అది కూడా సామాన్యుడికి వినయంలాగే కనిపిస్తుంది. ఆ శ్లోకం ఏమంటున్నారు? రఘువంశ చక్రవర్తుల కథలు వజ్రంతో తొలిచిన మణుల వంటివి. వాటికి నేను ఒక సూత్రాన్ని అవుతున్నాను అన్నాడు. పైకి “అబ్బే! నాదేముంది? ఆ మణులు గుచ్చే దారాన్ని అంతే!” అన్నట్టే ఉంటుంది.
” ఇక్కడే అసలు కీలకం ఉంది. మణులు తొలిచి సిద్ధంగా ఉన్నాయి. ఆ రఘువంశ రాజుల చరిత్రలు అక్కడక్కడా పురాణాలలో ఉన్నాయి. అంటే రఘువంశ రాజుల చరిత్రలు అనే తొలిచి సిద్ధంగా ఉన్న మణులు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటికి ఒకానొక రామణీయకత చేకూర్చే హారత్వం లేదు. నేను వాటినన్నిటినీ సూత్రంతో కూర్చి ఆ కథలకు ఒక హారత్వాన్ని కల్పిస్తున్నాను అన్నాడు.
“అంటే తాను రఘువంశ రాజుల చరిత్రకు ఇప్పటివరకూ ఎవరూ కల్పించని ఒక కావ్యమర్యాదను కలిగిస్తున్నాయని సగర్వంగానే ప్రకటించాడు.
“కాళిదాసు మొదటి రెండు శ్లోకాలలో లేడు! ఇదిగో ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నాడు!” అంటూ ముగించారు మాష్టారు! ఆ శ్లోకాలు ఇవీ… పరిశీలించండి మరి..
క్వ సూర్యప్రభవో వంశః క్వ చాల్పవిషయా మతిః .
తితీర్షుర్దుస్తరం మోహాదుడుపేనాస్మి సాగరం ।।
మందః కవియశః ప్రార్థీ గమిష్యామ్యుపహాస్యతాం .
ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామనః ।।
అథవా కృతవాగ్ద్వారే వంశేఽస్మిన్పూర్వసూరిభిః .
మణౌ వజ్రసముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః ।।
Leave a comment