స్వీయ అన్వేషణ – 175
“సహృదయ మయూరము”
ఈ ఫేస్ బుక్ మాధ్యమంలో ఇద్దరు నన్ను చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నట్టున్నారు. దశాబ్దాల క్రితమే సాహిత్య జీవితాన్ని ప్రక్కన పెట్టేసి, సాధనా జగత్తులోకి ప్రవేశించిన నన్ను గిల్లి, గిల్లి మళ్ళీ ఆ సాహిత్య లోకంలోకి లాగేస్తున్నారు.
“ఎవరు వారు?” అని అడుగుతున్నారా?
ఒకరు వాడ్రేవు చిన వీరభద్రుడు, మరొకరు విజయ్ జీడిగుంట! వీరభద్రుడు తన మేఘ సందేశ ప్రసంగాలతోనూ, విశ్వనాథ వారి గురించిన పోస్టులతో విజయ్ నన్ను లాగేస్తున్నారు.
ఈ మధ్య విశ్వనాథ వారి “కల్పవృక్ష రహస్యములు” గ్రంథం గురించి పెట్టిన పోస్ట్ లో విశ్వనాథ వారు చెప్పిన ఒక మాటను విజయ్ ఉటంకించారు.
అది ఇక్కడ పోస్ట్ చేసిన మొదటిది.
అది చదవగానే వెంటనే మా మాష్టారు శరభయ్య గారు కమ్మేశారు నన్ను. ఆ సంఘటనకు సంబంధించినదే క్రింది శ్లోకం.
ఒక వానాకాలం… సాయంత్రం… మాష్టారూ, నేనూ రాజమహేంద్రవరంలో శ్రీ మార్కండేయ స్వామి గుడి ఎదురుగా వున్న గోదావరి రేవు మెట్ల మీద కూచుని ఏదో మాట్లాడుకుంటున్నాం. కాసేపటికి మబ్బులు దట్టంగా కన్నేశాయి. ఉరుములు మొదలయ్యాయి. “మాష్టారూ! వాన పడేట్లు ఉంది” అన్నా. “అవును, సరే, లేవండి, పోదాం” అంటూ లేచారు. నడుస్తున్నాము. మళ్ళీ ఉరుములు…
మాస్టారి నోట అప్రయత్నంగా వెలువడిన శ్లోకం… మృచ్ఛకటిక నాటకం లోనిది. ఆ శ్లోకం క్రింద ఇచ్చాను.
“పర్వత శిఖరాలపై వ్రేలాడుతూ మేఘాలు గర్జిస్తున్నాయి. ఆ గర్జన విరహిణీ హృదయ ఘోషను అనుకరిస్తోంది. ఆ శబ్దాన్ని వినగానే నెమళ్ళు ఒక్కసారిగా పైకెగిరి , ఆకాశాన్ని మణిమయమైన విసనకర్రలతో వీస్తున్నాయి. అంటే అవి పురి విప్పి నర్తిస్తూ ఉంటే విచ్చుకొన్న వాటి పింఛాలు మణులు పొదిగిన విసనకర్రలతో ఆకాశాన్ని వీస్తున్నట్టు ఉంది. ఇంతే ఇందులో ఉన్నది… కానీ అవతల ఉన్నది మా మాష్టారు కదా…
” చూశారా? ఇది కేవలము మేఘాల గురించే అనుకుంటే పొరపాటే! ఇందులో ఒక మహార్థం దాగి ఉంది. అక్కడ ఆ పర్వత శిఖరాగ్రాల మీద వ్రేలాడుతూ గర్జిస్తున్నది మేఘం కాదు… కవి! అది కవి ఘోష! ఎలాటిది ఆ ఘోష? విరహిణి హృదయ ఘోష వంటిది. కవి ఒకానొక సహృదయుని కోసం విపరీతమైన విరహాన్ని అనుభవిస్తాడు… ఘోషిస్తూ ఉంటాడు. ఆ సహృదయుడు మాత్రం ఆ ఘోష విని ఊరుకుంటాడా! కవి వాక్కు చెవిన పడగానే ఒక్కసారిగా పైకెగురుతాడు. పైకెగరటం అంటే ఏమిటి? ఈ భౌతికమైన ఆవరణలను వదిలించుకొని కవి జగత్తును అందుకోవటానికి తనంతట తానే ఉద్యుక్తుడు అవుతాడు. అతని భావనా ప్రపంచం అనే మయూర పంఖం ఆ కవి జగత్తునంతటా వీచి వీచి వెతుకుతుంది. మయూర పింఛం లో అనేక వర్ణాలు ఉన్నట్టుగానే ఈ సహృదయుడు ఆ కవి సృష్టిలోని వివిధ రస భావాలను అన్వేషిస్తాడు… అనుభవంలోకి తెచ్చుకుంటాడు.. అంతే కాదు ఒక్కోసారి ఆ కవి ఉద్దేశించని అనేక “ఉదాత్త భావన”లని కూడా ప్రకటిస్తాడు లోకానికి. కేవలం మేఘ గర్జన వర్ణనతో సరిపెట్టుకుంటే అంతే… కానీ కవి – సహృదయ బంధాన్ని కూడా అనుభవంలోకి తెస్తుంది ఈ శ్లోకం” అంటూ ముగించారు మాష్టారు. అప్పటికి ఆయన ఇంటికి చేరాము. మాష్టారు లోపలికి వెడుతూ ఉంటే అప్పుడే మొదలైన చిరుజల్లులలో నడుస్తూ అదే శ్లోకాన్ని, మాస్టారి వ్యాఖ్యానాన్ని పదేపదే నెమరు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాను.
విశ్వనాథ వారు చెప్పిన మాటే… ఈ సహృదయుడు.. రసోన్మత్త జీవి ఆయన మాష్టారు శరభయ్య గారు మరో శ్లోకం వ్యాఖ్యానిస్తూ చెప్పారు!


Leave a comment