స్వీయ అన్వేషణ – 177
ఒక్కొక్క సమాజమున కొక్కొక్క జీవలక్షణ ముండును. ఆ సమాజ ప్రాదుర్భావ వేళ దాని యందలి దార్శనికులగు పూర్వులు నిర్మించిన జీవన సూత్రముల పైన నాధారపడి యా లక్షణము రూపు దిద్దుకొని, యనుస్యూతముగ తరముల బడి ప్రవహించును. అట్టి జీవ లక్షణమును కాపాడుకొన్న జాతి నిలబడును. లేనిచో నిలబడదు.
మన ప్రస్తుత పరిస్థితులిట్లే యున్నవి. తన జీవ లక్షణమును చూచికొనుచూ సిగ్గులు జాతి జాతి యనిపించుకొనజాలదు సరికద తన యునికిని కోల్పోవుట తథ్యము.
“ఇట్టి స్థితిగతులకు కారణమేమి?” యని విచారించుకొన వలయును.
నడుమ నెవ్వడో వచ్చి నీ వేషభాషలను వెక్కిరించినాడు, నీ సమాజ నిర్మాణ సిద్ధాంతము లోపభూయిష్ఠమని తీర్మానమును చేసినాడు. “కామమ్మ మొగుడ”ని వాడనిన తోడనే నీవును “కాబోలు”నని నమ్మితివి. సర్వ స్వతంత్ర జీవనపథమునందు స్వయం సమృద్ధిగ చరించిన జాతిని పొట్టకూటికై వెంపరలాడు దానిగ మార్చివేసినాడు.
నీ సమాజ నిర్మాణ విధానము వాని కర్థము కాక వాని సమాజ నిర్మాణ చట్రమును నీ కాపాదించినాడు. శతాధిక వృత్తులు స్వతంత్రముగ, స్వయంసమృద్ధముగ, సగౌరవముగ జీవించెడు చోట, సమాజము నందలి సమస్త జను లొకరికొకరుగ మనుచున్న వేళ వారి యందు భేదభావ బీజములు నాటినాడు. అట్టి బీజములకు నీరు పోసి పెంచు వారిని తయారుచేసినాడు.
వానికేమి పోయినది? వానికి వాడు వాని పబ్బమును గడపుకొని పోయినాడు! వాడు నాటి పోయిన బీజములకు నేటికినీ నీరిడి పెంచి పోషించుచు కొందరు తమ పబ్బమును గడపు కొనుచున్నారు.
పౌరుషమును, ఆత్మ ప్రత్యయమును కోల్పోయి మనుట కన్న దౌర్భాగ్య మేమున్నది?
Leave a comment