స్వీయ అన్వేషణ – 178
ఈ దేశమున ననేక భాషలున్నవి. మరల వాని యందనేక యాసలున్నవి. దేని సొగసు దానిది, దేని హొయలు దానిది, దేని యందలి కాకువు దానిది, దేని యందు గల విరుపు దానిది, దేని యందుండు పొడుపు దానిది, దేని నడకలోని యొయ్యారము దానిది, దేని పలుకులోని సంగీతము దానిది.
ఎవనికి వానికి వాని భాషాధ్యయనము మాతృదేవీ స్తన్యపానము వంటిది. ఎంత గ్రోలిన యంత పుష్టి.
ఎవనికి వానికి వాని భాష గొప్పది. నా భాష గొప్పది యని చెప్పికొనుటలో దొసగు లేదు. కాని నా భాషయే గొప్పదని యన్నచో తగవు వచ్చును. భాషల యందు న్యూనాధిక్యములను చూచువానికి భాష యొక్క తత్త్వము తెలియదని యర్థము. భాషా విషయమున నట్టి వారు అకృత పరిశ్రములు మాత్రమె కాక శ్రమగతాలస బుద్ధులు, పరప్రత్యనేయ మనస్కులు కూడ. ఇట్టి వారి చేతుల యందు నేటి విద్యావిధానమును బెట్టితిమి. ఫలితము ననుభవించుచున్నాము. తన భాషను విస్మరించి ఇతర భాషల యందు అభినివేశమును చూపుట యనగా తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కెర చేయించినట్లు.
పలుకుటకు స్వీయమగు భాష, చెప్పికొనుటకు తనదైన సంస్కృతి, నిలిచి మనుటకు నాదియను నేల లేక ఇతర భాషాపదముల నరవు దెచ్చుకొని, ఇతరుల సంస్కృతి, పండుగల, పబ్భముల రూపురేఖలను మార్చి స్వాయత్తము జేసికొని, ఇతరుల నేలల నాక్రమించి, అచటి సమస్త భాషలను, సంస్కృతిని, నేల తోడి జనుల సంబంధమును తెగద్రుంచి, సంపదలను దోచికొని బ్రతికి, తాము చెప్పినదే వేదమను భ్రమను కల్పించి, ఈనాటికినీ అట్టి భ్రమ లోననే బ్రతుకునట్టుల జేసినవాడు మనకు ఆరాధ్యుడయినాడు.
తరతరములుగ నీ జాతి సంస్కృతిని, భాషలను, జీవన విధానమును తీర్చిదిద్దినవారు, యొక మనిషి బ్రతుకున నున్న సమస్త పార్శ్వములను సమగ్రముగ నవగాహన జేసికొని, యిచటి శీతోష్ణ స్థితిగతుల నెరిగి కట్టు పుట్టముల నుండి తినెడి తిండి వరకు యే కాలఖండమునకు సరిపడునది దానికిగా నొక ప్రణాళికను యేర్పరచిన వారు నేడు దేనికినీ కొరగాని వారయినారు. చివరకు నా పూర్వులు మూర్ఖులు, వారికేమియును తెలియదను కాడికి వచ్చినాము.
తన పూర్వీకుల యందు నెట్టి గౌరవ మర్యాదలు లేనివారలను మనుష్యులని యనుటకు కూడ నవకాశము లేదు.
Leave a comment