స్వీయ అన్వేషణ – 179
ఒక భాష యున్నదని యన్నచో దానియం దంతటను యొకే యొక పలుకుతీరు యుండునని కాదు. భాష యొకటి కావచ్చును. కాని అట్టి భాషను మాటలాడు వారి ప్రాంతమును బట్టి భాష యొక్క పలుకు తీరు మారుచుండును. అట్లు వివిధ విధములుగ నున్న పలుకు తీరును పండితులైన వారలు మాండలికములను పేర పిలుతురు. పండితులు కాని సామాన్య జనులు యాసలని వ్యవహరింతురు.
భాష యందు గల యాస లనిన వారల కొక యభిమాన ముండును. అట్టి యాస వారల అస్మితను ప్రకటించును. అది వారల స్వాభిమానమునకు ప్రతీకగ భావించెదరు. అట్టి భావన సత్యము కూడ. మాటలాడు వారి పలుకు తీరును బట్టి వారి ప్రాంతమును ఇతరులు గుర్తించెదరు కాదా? కనుక నొక వ్యక్తి యే ప్రాంతము వాడని తెలిసి కొనుటకు యాస ప్రధానమైన భాషాంగముగ నిర్ణయించ వచ్చును.
ఆయా ప్రాంతముల యందలి కవులు, రచయితలు కొద్ది కాలముగ తమ ప్రత్యేకతను, అస్మితను ప్రకటించు కొనుటకని వారి వారి యాసల యందు కవిత్వమును, కథలను చెప్పుచున్నారు. ఒక విధముగ నిది మంచి పరిణామమని చెప్పవచ్చును. ఒక ప్రాంతము వారలకు మరియొక ప్రాంతము వారల భాషా వైవిధ్యము తెలియుటకు యిట్టి రచనలు దోహదమగు ననుటలో నెంత మాత్రమునూ సందేహము లేదు.
కాని… ఇచట నొక చిక్కు కూడ లేకపోలేదు.
ఒక ప్రాంతము వారల యాస మరియొక ప్రాంతము వారికి సంపూర్ణముగ నవగతము కాదు. రచన మొత్తముగ అవగతమయిన కావచ్చును గాని ఆ పలుకు నందలి సౌందర్యమును మరియొక ప్రాంతము వాడయిన పాఠకుడు అనుభవించ జాలడు… వానికి అట్టి పలుకుతో సంబంధము లేదు కనుక, అయ్యది వాని బ్రతుకున భాగము కాదు కనుక. రచన మొత్తముగ నట్టి యాస యందు సాగిన సందర్భమున నా పాఠకుడు దానిని పూర్తిగ చదువునను నమ్మకమును లేదు. అట్టి స్థితి యందు రచయిత, కవి పడిన శ్రమ వ్యర్థ మగుచున్నది.
మరియొక అంశమును కూడ యోచించ వలయును. ఒక యాస యందున్న సౌందర్య మంతయును దానిని పలుకుట యందుండును. ఆ యాస సొగసు, హొయలు, కాకువు వంటి వాచక సౌందర్య మంతయును దానిని పలుకుట యందున మాత్రమే ద్యోతక మగును. అట్టి యాసను అక్షరబద్ధము చేసిన మరుక్షణమున నది కనుమరుగగును. ఇందువలన కూడ కవి, రచయిత పడిన శ్రమకు తగిన ప్రతిఫలము లభింపదు. అట్టి రచన ఆయా ప్రాంతీయు లయిన వారి యందు, అట్టి యాసను జీవంతముగ నిలిపికొను వారల యందు మాత్రము రససిద్ధిని కలిగించును.
అట్లని యట్టి రచనలు చేయరాదని కాదు. చేయ వలయును. అయ్యది సర్వథా అభిలషణీయము కూడ. కాని యట్టి రచనలకు రససిద్ధి యందు పరిమితు లున్నవి మాత్రము చెప్పక తప్పుట లేదు!
Leave a comment