“కాళిదాసు ప్రశ్నిస్తున్నాడు!”

Phaniharam Vallabhacharya Avatar

స్వీయ అన్వేషణ -180

అవును… కవికులగురువు కాళిదాసు ప్రశ్నిస్తున్నాడు!

తన కావ్యాల ద్వారా ప్రశ్నిస్తున్నాడు!

ప్రశ్న రెండు రకాలు. “నువ్వు ఈ పని చేస్తున్నావా? లేదా?” అని నేరుగా అడగటం ఒక పద్ధతి.

కొంతమంది ఎలా జీవించారో, ఆ జీవనం ద్వారా వాళ్ళు పొందిన ఫలితాలు ఏవిటో వర్ణించి వదలివేయటం, తద్వారా మనలో ప్రశ్న రేకెత్తించటం మరొక పద్ధతి!

కవులు… నిజమైన కవులు… ఈ రెండవ పద్ధతిని ఎంచుకుంటారు. వారిలో కాళిదాసు ప్రప్రథముడు! కాళిదాసుకు ముందు కవులు లేరా? వారేమీ ప్రశ్నించలేదా?

వాల్మీకి, వ్యాసుల రచనా పద్ధతి వేరు. మనిషి ప్రవర్తన ఫలితాలను నేరుగా చెప్పేశారు.  “ఇదుగో… నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఇలా అవుతుంది సుమా!” అనే హెచ్చరిక వారి పద్ధతి.

కానీ… కవికుల గురువు కాళిదాసు అలా చెప్పడు. మనిషి గుణగణాలను, ప్రవర్తనను వర్ణించి ఊరుకుంటాడు. ఆ రసమయ వాక్కు మనలో ప్రశ్నలను రేకెత్తిస్తుంది! మనల్ని మనం ప్రశ్నించుకునేట్టు చేస్తుంది! మనల్ని మనం చూసుకునేట్టు చేస్తుంది!

ఇదంతా ఎందుకయ్యా అంటే ఈ మధ్య కాళిదాస మహాకవి “రఘువంశ” మహాకావ్యాన్ని అధ్యయనం చేస్తుంటే ఎన్నో ప్రశ్నలు! నేను ఇలా బ్రతికానా? బ్రతుకుతున్నానా? కనీసం అలా బ్రతకటానికి ప్రయత్నించానా? ఈ అన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఒకటే! “లేదు!” అని.

చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది… ఆయన రఘువంశ మహారాజుల గురించి చెప్పిన ఒక మాట…

“శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం / వార్ధకే మునివృత్తినాం యోగేనాంతే తను త్యజాం”

రఘువంశ రాజులు తమ జీవితంలో చేసిన ఫోకస్ ఇది.

ఏవిటి దీని అర్థం?

చిన్నప్పుడు విద్యాభ్యాసంలో, యౌవనంలో విషయ భోగాలలో, వార్ధక్యంలో ముని జీవనంలో గడిపి, చివరికి యోగ మార్గంలో శరీరాన్ని విడిచి పెట్టేవారు!

కాళిదాసు చేసిన ఈ వర్ణన నాలో ఒక ప్రశ్న రేకెత్తిస్తోంది. ఈ శ్లోకంలో చివరి మాట నన్ను ప్రశ్నిస్తోంది. “యోగేనాంతే తను త్యజాం”.

ఈ దశకు చేరటానికి ఏమి చేయాలి? చిన్నతనంలో చదువుపై ఏకాగ్రత, యౌవనంలో విషయ భోగాలపై దృష్టి, ముసలితనంలో ముని జీవనం…

చదువుకున్నాం… సరే. విషయ భోగాలను అనుభవించడం… సరే. ఈ రెండూ అందరం చేస్తున్నాం. ముసలితనంలో మునిజీవనం సాగించటానికి అవసరం అయిన పునాది ఏముంది? కాళిదాసు ఆ మాట చెప్పాడా ఇక్కడ? లేదే?

అంటే చదువుకున్న చదువులో, విషయ భోగాల అనుభవంలో ఈ మాటకు అవసరమైన భూమిక ఏదో ఉండాలి కదా? ఉందా మరి? ఉంది!

ఈ శ్లోకానికి ముందు మరో మూడు శ్లోకాలు ఉన్నాయి. అవి దీనికి భూమిక!

ఆ రఘువంశ రాజులు ఆజన్మ శుద్ధులు. జన్మతః పరిశుద్ధులు. అంటే వారి జననీజనకుల దాంపత్యంలో ధర్మకామం ఉందన్నమాట. ఆ మాటనే తరువాత మరొక చోట “ప్రజాయై గృహ మేధినామ్” అంటాడు. గృహస్థ జీవనానికి పరమార్థం “ప్రజ” అంటే సంతానం. స్త్రీపురుష సంభోగం అనేది శారీరక సుఖ లబ్ధికి కాదు… సంతాన లబ్ధికి.

ఉపనిషత్తు కూడా అదే ఆదేశిస్తుంది… బ్రహ్మచారి విద్యాభ్యాసం పూర్తి చేశాక ఆచార్యుడు చేసే ఉపదేశంలో ఒక మాట ఉంది… “ప్రజా తంతువును విచ్ఛిన్నం చేయవద్దు” అని. అది ఆదేశం, ఉపదేశం, అదే ఉపాసించదగినది.

అందువల్ల కేవల శారీరక సుఖం కోసం జరిగే స్త్రీపురుష సమాగమం పరిశుద్ధం కాదు. తద్వారా కలిగే సంతానము “ఆజన్మ శుద్ధానాం” క్రిందకు రాదు. 

మరి అటువంటి ఆజన్మ శుద్ధి కల సంతానం ఎలా కలుగుతుంది? పైగా ఆ రఘువంశ రాజులు యౌవనంలో విషయ భోగాలను అనుభవించారని కూడా చెప్పాడు కదా కాళిదాసు. దానిని ఎలా అన్వయించుకోవాలి?

ఆ రాజులు సంతానం కోసం గృహస్థాశ్రమం లోనికి ప్రవేశించారని కూడా అన్నాడు కదా? అసలు సంతానం ఎందుకు? దానికీ ఉపనిషత్తు సమాధానం చెప్పింది… “దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం” దైవ సంబంధమైన కార్యాలు, పితృ సంబంధమైన కార్యాలకు ప్రమాదం వాటిల్లనీయవద్దు… అన్నది ఉపనిషత్తు. ఈ రెండు కార్యాలూ తాను చేయడమే కాదు… వాటిని పరంపరగా కొనసాగించే బాధ్యత కూడా మనిషిదే.  ఆ పరంపరను కొనసాగించటానికే “ప్రజా తంతువును త్రెంచవద్దు” అని ఆదేశించింది ఉపనిషత్తు.

ఆ విధంగా దేవ పితృ కార్యాల పరంపరను కొనసాగించే లక్ష్యంతో జరిగే స్త్రీపురుష సమాగమం వల్ల మాత్రమే “ఆజన్మ శుద్ధులు” అయిన సంతానం కలుగుతుంది. అటువంటి ధార్మికమైన విద్య శైశవంలోనే ఆ రఘువంశ రాజులు అందుకున్నారు కనుకనే వారికి అటువంటి సంతానం కలిగింది.

అటువంటి విద్యను మనం అందుకున్నామా? లేదే!

శారీరక సుఖం కోసం కాకుండా పరంపరయా దేవ పితృ కార్యాల కొనసాగింపు కోసం విషయ భోగాలను అనుభవించామా? లేదే!

ఇంకా ఎన్నో ప్రశ్నలను వేస్తున్నాడు కవికులగురువు కాళిదాసు పరోక్షంగా!

అవేవిటో మళ్ళీ కలిసినప్పుడు చూద్దాం!

కాళిదాస మహాకవి “రఘువంశం”కేవలం మహాకావ్యం మాత్రమే కాదు… సనాతన ధర్మ వ్యాఖ్యాన గ్రంథం కూడా!


Leave a comment