స్వీయ అన్వేషణ – 184
ఈ మధ్య కాలంలో కాళిదాసు రఘువంశ “ధార్మిక” మహాకావ్యాన్ని మళ్ళీ చేతబట్టినప్పటి నుంచీ మనసు నిండా మా మాష్టారు, కావ్యరససిద్ధులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు వినీల శ్రావణ మేఘంలా ఆవరించి, “నిరుడు కురిసిన” రసవృష్టిని మళ్ళీ మళ్ళీ నిరంతరం నా హృదయ క్షేత్రంలో కురిపిస్తూనే ఉన్నారు.
ఇక్కడ రఘువంశాన్ని “ధార్మిక” మహాకావ్యం అంటే మాష్టారు అంగీకరించరని నాకు ఖచ్చితంగా తెలుసు. దానికి ఒక పూర్వ సంఘటన ఆధారం. రాజమహేంద్రవరంలో ఒక సాయంత్రం ఆయన ఇంటి నుంచి కోటిలింగాల రేవు వైపు నడుస్తున్నాము. త్రోవలో మాష్టారితో “శాకుంతలంలో ఒక సందేహం మాష్టారూ!” అన్నాను. “ఏవిట”న్నట్టు చూశారు.
“మాష్టారూ! శాకుంతలం ప్రారంభంలో కాళిదాసు అష్టమూర్తి అయిన శివుని స్తుతించాడు. భరతుని జన్మ ఫలితంగా ఉన్న ఒక కథను నాటకంగా వ్రాశాడు. చివరికి తనకు పునర్జన్మ లేకుండా చేయమని కోరాడు కదా? ప్రకృతి స్వరూప శివుని ప్రార్ధన, ఒక జన్మ కారణమైన కథ. ఎవరైనా మోక్షం పొందిన కథ తీసుకొని, తనకు కూడా పుట్టుక లేకుండా చేయమని కోరితే ఔచిత్యం కానీ ఒకడు పుట్టిన కథ వ్రాసి, తనకు పుట్టుక లేకుండా చేయమని అనటం ఏమిటి?” అని అడిగాను.
“అంటే మీరేదో అనుకుంటున్నారన్న మాట. ఏవిటది?” అని అడిగారు మాష్టారు.
“మాష్టారూ! ఈ శాకుంతలంలో మనిషికి పుట్టుక లేకుండా చేసే మర్మం ఏదో ఉందనిపిస్తోంది!” అన్నాను.
మాష్టారు ఒకసారి చురుగ్గా చూశారు. కొంచెం కోపంగానే ” ఆ జిడ్డంతా దానికి అంటించకండిి! ఆ వేదాంతాలు అన్నీ ఇక్కడకి తీసుకొచ్చి పెట్టకండి! కాళిదాసు నాటక కళను చూడండి.” అన్నారాయన.
కనుక రఘువంశం “ధార్మిక” మహాకావ్యం అంటే ఆయన ఖచ్చితంగా ఒప్పుకోరు. అయినా మాష్టారూ! క్షమించండి!
ఇంతకీ నేను ఆ కావ్యాన్ని చూస్తున్న ప్రస్తుత పద్ధతిని మాష్టారు అంగీకరించకపోయినా, ఆయనకు అది సుతరామూ ఇష్టం లేకపోయినా, మరెందుకు ఆయన రూపం, ఆయన వాణి నా అస్తిత్వాన్ని ఇలా ఆవరించేస్తూ ఉన్నాయి?
నేను చూస్తున్న పద్ధతి వేరు కావచ్చు కానీ దానికి మూలమైన “కావ్యజ్ఞ శిక్ష” ఆయన పెట్టిన భిక్షయే కదా? ఒక పుస్తకం చేతబట్టి పాఠం చెప్పకపోయినా ఒక కావ్యాన్ని ఎలా చూడాలి, దాని ఆత్మలోనికి ఎలా ప్రవేశించాలి అనే మర్మాన్ని బోధించినవారు ఆయనే కదా? నేను ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ ఉంటే ముందుగా వచ్చి నా ఎదురుగా నిలిచేది మాష్టారి రూపం, శ్రవణ సుభగంగా ఆయన ఆ శ్లోకాన్ని చదివే విధానమే కదా?
ఆయన ఆజానుబాహువేమీ కారు. ఆయన కంఠం మేఘ గంభీరమూ కాదు. ఆయన వామనుడు. సన్నటి మానిసి . ఆయన రూపంలాగే ఆయనది సన్నని కంఠం. అయితేనేమీ?
ఒక ప్రాచీన కవి విషయం వచ్చేసరికి హిమాలయోత్తుంగ శిఖర సదృశ వ్యక్తిత్వం ఆవిష్కృతం అయిపోతుంది. అంతే… ఆ వామనుడు త్రివిక్రముడైపోయి శబ్దబోధతో భౌతికావరణని, అర్థావబోధతో మానసాకాశాన్ని , రస ముద్రతో ఆత్మని ఆక్రమించేసి, మనకి ఆవరణభంగం చేసేస్తారు. ఆ రసఝరీ వేగంతో మన లౌకిక జీవితాన్ని రసాతలంలో ముంచి పారేస్తారు! ఆ కవి ఆయనలోకి ఆవాహన అయిపోతాడు అనాయాసంగా. ఇంక అక్కడ మాష్టారు ఉండరు… ఆ కవి వాణికి ఆయనొక “స్వర మాధ్యమం” ( మీడియం) అయిపోతారు. ఆ కవే వచ్చి మన ఎదురుగా తన ఆత్మను పరచి “ఇదుగో! ఇదీ నేను!” అంటూ తన ప్రతిభకు తానే మురిసిపోతున్నట్టు ఉంటుంది.
ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క శ్లోకం ఆయన స్వరపేటిక నుంచి ఒక నాదగంగా ప్రవాహంలా సాగిపోతుంది. ఆ పద్యం లేదా శ్లోకంలోని పద సంయోజనం నుంచి జనించే నాద మాధుర్యాన్ని మరొక పండితుడు ఎవరూ ఆయనలా సాధించలేరు! ఆవిష్కరించలేరు! ఈ విషయంలో ఆయన అనిదంపూర్వ రస సిద్ధుడు! బహుశః ఇంక ముందు కూడా అలాటి వారు మరొకరు ఉండరేమో!!
నా దృష్టిలో … మాష్టారూ! ఇలా అంటున్నందుకు మీకు కోపం రావచ్చు కానీ మరోసారి మన్నించాలి!… చివరికి మా మాష్టారు తనకు “మాష్టారు”గా సంభావించే కవి సమ్రాట్ విశ్వనాథ వారికి కూడా ఇది సాధ్యం కాలేదు! విశ్వనాథ వారి రచనలు “న భూతో న భవిష్యతి” సందేహం లేదా విషయంలో కించిత్తున్నూ! కానీ పద్యం లేదా శ్లోకం చదివే క్షణంలో మాత్రమూ ఆ కవిసమ్రాట్ కన్నా మా మాష్టారే “రస సమ్రాట్”!
మా మాష్టారు ఒక పద్యమో, శ్లోకమో అందుకుంటే అదొక రస చక్రవ్యూహం! దానిలోనికి మనం ప్రవేశించ వలసిన అవసరమే లేదు… దానంతట అదే మనల్ని ఆ వ్యూహంలోకి లాగేస్తుంది సుడిగుండంలాగ! నిజమైన సాహిత్య విద్యార్థి కొన్ని రోజులపాటు ఆ రస చక్రవ్యూహం నుంచి బయటపడే ప్రసక్తే లేదు గాక లేదు!
పాండురాజుకు ఒక శాపం వచ్చి పడింది. భార్యాసంగమం చేస్తే తక్షణమే మరణం! ఆయన తన భార్యలు కుంతిని, మాద్రినీ తీసుకొని మునివృత్తిని అవలబించి శతశృంగ పర్వతం మీద ఒక ముని వాటికా ప్రాంతంలో ఉంటున్నాడు. అక్కడే ఆయన అనురోధం వల్లనే కుంతి, మాద్రి అయిదుగురు పాండవులకు జన్మనిచ్చారు.
అప్పుడు వసంతకాలం సమీపించింది. అటవీ ప్రాంతం అంతా విరగబూసింది. మందానిలం ప్రసరిస్తూ ఉంది. నన్నయ గారు ఆ వసంతాన్ని వర్ణిస్తూ రెండు పద్యాలు అందించారు. ఆ రెండు పద్యాలూ చదవండి. మామిడి, అశోకం, చంపకాలు అన్నీ పూశాయి. ఆ పూవుల లోని మకరందాన్ని తనివి తీరా గ్రోలి తిరుగుతూ నాదాన్ని చేస్తున్నాయి. చందనం, తమాలం, అగరు, అరటి, లవలి, మాకంద వృక్షాల మీద నుంచి, వికసించిన కమల వనాల మీద నుంచి ప్రసరిస్తూ, ఆ పూల తేనెలను తాకుతూ జనుల హృదయాలకు ఆనందం చేకూరుస్తూ, విరహుల గుండెలకు విచారాన్ని కలిగిస్తూ మంద మలయానిలం ప్రసరిస్తూ ఉంది. ఇదీ ఆ రెండు పద్యాలకు స్థూలంగా భావం. ఇలా చెబితే స్కూల్ లో తెలుగు మాష్టారు పాఠం చెప్పినట్టు ఉంది కదూ? ముందు ఆ పద్యాలు చూడండి. ఆ తరువాత రస సిద్ధుడైన మా మాష్టారి నోట వాటిని వినండి. అప్పుడు తెలుస్తుంది… నాలాంటి కొంత మంది మా మాష్టారితో అపారమైన ప్రేమలో ఎందుకు పడిపోయామో!
ఈ రెండు పద్యాలు నన్నయ గారు “లయ గ్రాహి” ఛందస్సులో వ్రాశారు! ఈ పోస్ట్ క్రింద ఆ రెండు పద్యాలూ అందించాను. చూడండి..
ఆ పద్యాలు మనం పుస్తకం లోనుంచి చదివితే ఎవరికి వారే తమను తానే విని చూసుకోండి. ఆ తరువాత మా మాష్టారి నోట వినండి. నాలుగున్నర నిమిషాలు మీరు ఈ లోకంలో ఉండరు ఒకటే షరతు… “తెలుగు జాతి రసజ్ఞత చావదేని”
ఈ ఆడియో క్లిప్ నాకు షేర్ చేసిన మాష్టారి కుమారుడు చిరంజీవి మార్కండేయ శర్మకు కృతజ్ఞతలతో…


Leave a comment